Begin typing your search above and press return to search.

బంకుల దగ్గర ఆందోళన చేస్తే ఏమొస్తుంది ?

By:  Tupaki Desk   |   7 Nov 2021 4:38 AM GMT
బంకుల దగ్గర ఆందోళన చేస్తే ఏమొస్తుంది ?
X
చంద్రబాబునాయుడు వైఖరి చాలా విచిత్రంగా ఉంది. అధికారం చేతుల్లో ఉందికదాని జనాలను ధరలతో ప్రజలని బాదుతారా ? అంటు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు. కేంద్రం పెట్రోల్, డీజల్ ధరలు తగ్గించింది కాబట్టి రాష్ట్రంలో కూడా వాటి ధరలను తగ్గించాల్సిందే అని డిమాండ్ చేశారు. పెట్రోలు, డీజల్ ధరలు పెరగటం వల్ల నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయని, రైతాంగమంతా ఇబ్బందులు పడుతోందని చంద్రబాబు చెప్పారు.

పెట్రోలు, డీజల్ ధరలు పెరిగితే దాని ప్రభావం అన్నింటిపైనా పడుతుందని చంద్రబాబు లాంటి ఆర్ధిక వేత్తే చెప్పక్కర్లేదు. కనీస అవగాహన ఉన్న ఎవరైనా ఈ మాట చెప్పగలరు. అంతర్జాతీయంగా పెట్రోలు, డీజల్ ధరలు బ్యారెల్ ప్రకారం వివిధ దేశాల్లో ఇంధన ధరలుంటాయన్న విషయం కూడా అందరికీ తెలిసిందే. అయితే బ్యారెల్ అంతర్జాతీయ ధరలు తగ్గిన దామాషాలో మనదేశంలో ధరలు తగ్గకపోవటానికి ప్రధానకారణం నరేంద్రమోడి సర్కారే అన్న విషయం ప్రతి ఒక్కళ్ళకు తెలుసు. ఇంధన ధరలు తగ్గిస్తే జనాలంతా సంతోషిస్తారని జగన్ కు మాత్రం తెలీదా ? కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రాష్ట్రాదాయం దారుణంగా పడిపోవటంతో బహుశా ఇంధన ధరలు తగ్గించటానికి జగన్ ఇష్టపడటం లేదేమో.

అయినా ఏడాదిలో మోడీ సర్కార్ 50 రూపాయల దాకా పెంచి చివరకు 5 రూపాయలు తగ్గిస్తే అదే గొప్ప తగ్గింపుగా బీజేపీ నేతలు చెప్పుకుంటున్నారు. వాళ్ళు చెప్పుకుంటున్నా అదో అర్ధముంది. మరి చంద్రబాబు కూడా అదే విషయాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారో అర్థం కావటం లేదు. సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే పెట్రోలు, డీజల్ ధరల పెరుగుదల ప్రభావం అన్ని రంగాలపైన పడుతుందని చెబుతున్న చంద్రబాబు మరి తాను అధికారంలో ఉన్నపుడు ఎందుకు పెంచినట్లు ? చెప్పగలరా ?

లీటర్ పెట్రోల్ రు. 16 తగ్గించాల్సిందే అని బల్లగుద్ది మరీ డిమాండ్ చేస్తున్న చంద్రబాబు తన హయాంలో అమరావతి సెస్ పేరుతో లీటర్ కు రు. 4 ఎందుకు వడ్డించినట్లు ? కరోనా వైరస్ వంటి మహమ్మారి లేకపోయినా, ఎలాంటి ప్రకృతి ఉత్పాతాలు లేకపోయినా లీటరు పెట్రోలు, డీజల్ మీద రు. 4 ఎందుకని అదనపు బాదుడు బాదినట్లు ? పెట్రోలు ధర పెరిగితే దాని ప్రభావం మిగిలిన రంగాల మీద పడుతుందని అప్పుడు మరచిపోయారా ?

అమరావతి కట్టిందీ లేదు పెట్టిందీ లేదు కానీ రు. 4 అమరావతి సెస్ మాత్రం అధికారంలో ఉన్నంతవరకు వసూలు చేశారు. పెట్రోలు, డీజల్ ధరలు పెరుగుతున్నంత కాలం ధరలు తగ్గించాలని మోడి సర్కార్ ను ఒక్కసారి కూడా డిమాండ్ చేసే ధైర్యం చేయలేదు. అప్పుడు కూడా జగన్నే డిమాండ్ చేశారు. నిజానికి రాష్ట్రాలు విధిస్తున్న పన్నుల కన్నా కేంద్రం పన్నులే చాలా ఎక్కువ. అయినా పెట్రోలు, డీజల్ ధరలు తగ్గించాలని పెట్రోలు బంకుల దగ్గర ఆందోళన చేస్తే ఉపయోగం ఏమిటి ? బంకులకు వచ్చేపోయే వారికి న్యూసెన్సు తప్ప.