Begin typing your search above and press return to search.

40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ క‌దా? స‌ర్వేలు ఏల బాబు?

By:  Tupaki Desk   |   11 July 2017 5:46 AM GMT
40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ క‌దా? స‌ర్వేలు ఏల బాబు?
X
గొప్ప‌లు చెప్పుకోవ‌టం బాగోదు. ఆ విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తీరు భిన్నం. అంత మంది తెలుగు త‌మ్ముళ్లు ఉన్నా.. అధినేత‌ను పొగిడే విష‌యంలో ఎప్పుడూ కొర‌తే. ఇందుకే కాబోలు.. త‌మ్ముళ్లు ఎటూ పొగ‌డ‌రు కాబ‌ట్టి.. త‌న‌ను తాను పొగుడుకునేందుకు ఎప్పుడూ ప్ర‌యారిటీ ఇస్తుంటారన్న‌ట్లుగా ఉంటుంది బాబు తీరు. త‌న తీరు మీద జోకులే జోకులు వేసుకునే ప‌రిస్థితుల్లో బాబు ఎదుటివారి త‌ప్పుల గురించి మా గొప్ప‌గా చెబుతుంటారు.

రెండు రోజుల వైఎస్సార్ కాంగ్రెస్ ప్లీన‌రీ దెబ్బ బాబు అండ్ కో మీద ఎంత ఎక్కువ‌గా ఉంద‌న్న విష‌యం తాజాగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ప్లీన‌రీ సంద‌ర్భంగా జ‌గ‌న్ చేసిన ప్ర‌సంగం మీద విమ‌ర్శ‌లు చేస్తున్నారు టీడీపీ త‌మ్ముళ్లు.

పార్ల‌మెంటు స‌మావేశాల సంద‌ర్భంగా అనుస‌రించాల్సిన వ్యూహం మీద చ‌ర్చించేందుకు స‌మావేశ‌మైన ఎంపీల‌తో పార్టీ అధినేత చంద్ర‌బాబు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీన‌రీ మీద‌నే మాట్లాడ‌టం గ‌మ‌నార్హం. ఇదొక్క అంశం చాలు.. జ‌గ‌న్ ఫియ‌ర్‌ బాబును ఎంత‌లా ఇబ్బంది పెడుతుంద‌న్న‌ది తెలియ‌టానికి. ప్లీన‌రీ సంద‌ర్భంగా జ‌గ‌న్ అన్ని అబ‌ద్ధాలు చెప్పార‌ని.. ఆ విష‌యం ప్ర‌జ‌ల‌కు తెలుస‌ని.. అందుకే ఇచ్చిన హామీల గురించి ప‌ట్టించుకోకుండా మ‌న ప‌ని మ‌నం చేసుకుంటూ పోదామ‌ని బాబు చెప్పిన‌ట్లుగా చెబుతున్నారు.

నిజంగానే జ‌గ‌న్ మాట‌ల్ని ప్ర‌జ‌లు విశ్వాసంలోకి తీసుకోర‌నే అనుకుంటే.. అలాంటి ప‌రిస్థితే ఉంటే.. చంద్ర‌బాబు అంత సేపు ప్లీన‌రీ గురించి మాట్లాడే మాట్లాడ‌రు. అంటే.. లోప‌లున్న భ‌యాన్ని క‌వ‌ర్ చేసేందుకు బాబు బింకంగా మాట్లాడార‌ని చెప్పాలి. త‌న‌లోని ఆందోళ‌న‌ను బ‌య‌ట‌ప‌డితే పార్టీ నేత‌ల్లో ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతుంద‌ని.. అలాంటిదేమీ లేకుండా ఉంద‌న్న భావ‌న క‌లిగించేందుకే జ‌గ‌న్ తీరును మొద‌టినుంచి చివ‌ర వ‌ర‌కూ త‌ప్పు ప‌ట్టార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

ప్లీన‌రీ సంద‌ర్భంగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్ కిశోర్‌ ను ప‌రిచ‌యం చేయ‌టం ద్వారా జ‌గ‌న్ త‌న‌లోని బ‌ల‌హీన‌త‌ను తానే బ‌య‌ట‌పెట్టుకున్న‌ట్లుగా బాబు వ్యాఖ్యానించార‌ని చెబుతున్నారు. "ప్ర‌శాంత్ కిశోర్ ఇప్పుడు కొత్త‌గా వ‌చ్చి చేసేదేంటి? నాకు న‌ల‌భై ఏళ్ల అనుభ‌వం ఉంది. వాళ్ల‌కు వాళ్ల మీదే న‌మ్మ‌కం లేదు. అందుకే వ్యూహ‌క‌ర్త‌ల్ని తెర‌పైకి తీసుకొస్తున్నారు. అది వారి బ‌ల‌హీన‌త" అని బాబు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. మ‌రిన్ని మాట‌లు చెప్పిన బాబు.. త‌మ పార్టీ సంగ‌తికి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం త‌న‌దైన శైలిలో చెప్పుకొచ్చారు. తాను ప‌ది ర‌కాల స‌ర్వేలు చేయించి ప్ర‌తి ఒక్క‌రి గురించి నివేదిక‌లు తెప్పించుకుంటున్నాన‌ని చెప్పిన బాబు.. ప‌ని చేయ‌ని వారిని తాను నిర్మోహ‌మాటంగా ప‌క్క‌న పెడ‌తాన‌ని హెచ్చ‌రించారు.

ఇక్క‌డ బాబు మాట‌ల్ని చూస్తే.. ఆయ‌న‌లోని డ‌బుల్ టంగ్ ఇట్టే అర్థ‌మ‌వుతుంది. రాజ‌కీయ పార్టీకి వ్యూహ‌క‌ర్తను పెట్టుకోవ‌ట‌మే బ‌ల‌హీన‌త అయిన ప‌క్షంలో.. తాను పొగిడేసే మోడీ పార్టీ కూడా ప్ర‌శాంత్ కిశోర్ సేవ‌ల్ని ఎందుకు వాడుకున్న‌ట్లు? బాబు మాట‌లే నిజ‌మైన ప‌క్షంలో వ్యూహ‌క‌ర్త‌ను నియ‌మించుకోవ‌టం ద్వారా బీజేపీ త‌న బ‌ల‌హీన‌త‌ను తాను బ‌య‌ట‌పెట్టుకుంద‌ని భావించాలా? ఒక్క బీజేపీనేనా?.. కాంగ్రెస్ సైతం ప్ర‌శాంత్ కిశోర్ సేవ‌ల్ని వినియోగించుకుంది క‌దా? దేశానికి దిశానిర్దేశం చేసే ప్ర‌ధాన‌పార్టీలే రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల మీద ఆధార‌ప‌డుతున్న వేళ‌.. జ‌గ‌న్ కు తెలివి లేన‌ట్లుగా వ్యాఖ్య‌లు చేస్తున్న బాబు మాట‌లు అర్థం లేనివిగా చెప్ప‌క త‌ప్ప‌దు.

అంతేనా.. రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌ల్ని నియ‌మించుకోవ‌టాన్ని కామెడీ చేస్తున్న చంద్ర‌బాబు.. పార్టీ నేత‌ల‌కు సంబంధించి తాను ప‌ది స‌ర్వేలు తెప్పించుకుంటున్న విష‌యాన్ని గొప్ప‌గా చెప్పుకోవ‌టం క‌నిపిస్తుంది. ఫార్టీ ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ అంటూ త‌న రాజ‌కీయ అనుభ‌వం గురించి గొప్ప‌గా చెప్పుకునే చంద్ర‌బాబుకు ప‌ది సర్వేల ఫ‌లితాల్ని క్రాస్ చెక్ చేసుకుంటే కానీ విష‌యం అర్థం కాదా? అన్న క్వ‌శ్చ‌న్ రాక మాన‌దు. ఈ రెండింటి మ‌ధ్య వైరుధ్యాల్ని చూస్తేనే అర్థ‌మ‌వుతుంది బాబు మాట‌ల‌కు చేత‌ల‌కు ఏ మాత్రం సంబంధం లేద‌ని. రాజ‌కీయంగా ద‌శాబ్దాల అనుభ‌వం ఉన్న‌ప్పుడు ప్ర‌జ‌లు త‌న గురించి ఏమ‌నుకుంటున్నార‌న్న విష‌యాన్ని నిఘా వ‌ర్గాలు చెప్పే మాట‌ల‌తోనే అర్థం చేసుకునే అవ‌కాశం ఉంటుంది. అదేమీ లేకుండా ఒక‌ట్రెండు సర్వేల‌తో స‌రిపుచ్చ‌కుండా ప‌దేసి స‌ర్వే రిపోర్టులు చూస్తే కానీ సంతృప్తి చెంద‌ని బాబుకు న‌ల‌భైఏళ్ల రాజకీయ అనుభ‌వం ఉన్నా దండ‌గేన‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.