Begin typing your search above and press return to search.

భారీస్థాయిలో ఆశావ‌హులు..బుజ్జ‌గిస్తున్న బాబు

By:  Tupaki Desk   |   1 April 2017 2:53 PM GMT
భారీస్థాయిలో ఆశావ‌హులు..బుజ్జ‌గిస్తున్న బాబు
X
ఏపీ మంత్రివర్గ విస్తరణ మ‌లుపులు తిరుగుతోంది. ప్ర‌మాణ స్వీకార గ‌డువు ముగుస్తుండ‌టంతో సీఎం చంద్రబాబు కసరత్తు ముమ్మరం చేశారు. జిల్లాల వారీగా నేతలు, ఎమ్మెల్యేల నుంతి అసంతృప్తులు వ్యక్తమవుతుండటంతో టీడీపీ ముఖ్యనేతలు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. మంత్రివర్గంలో చోటు దక్కదని అసంతృప్తి చెందుతున్న ఎమ్మెల్యేలతో సీఎం చంద్రబాబునాయుడు ఫోన్‌ లో మాట్లాడారు. అసంతృప్తులను బుజ్జగించే పనిలో చంద్రబాబు ఉన్నారు. జిల్లాల వారీగా స‌మాచారం సేక‌రించి వారితో బాబు మాట్లాడుతున్న‌ట్లు స‌మాచారం.

మ‌రోవైపు పార్టీ పిరాయించిన నేత‌ల‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌డంపై తెలుగుదేశం వ‌ర్గాల్లో తీవ్ర అసంతృప్తి మొద‌లైంది. క‌డ‌ప జిల్లాకు చెందిన ఆది నారాయణరెడ్డి, విజ‌యన‌గ‌రం జిల్లాకు చెందిన‌ సుజయ కృష్ణరంగారావుకు మంత్రి పదవి ఇచ్చేందుకు సీఎం చంద్ర‌బాబు మొగ్గు చూపుతున్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో విజయనగరం జిల్లా టీడీపీ నేతలు సుజయకృష్ణకు మంత్రి పదవి కట్టబెట్టడంపై పార్టీ ముఖ్య నేత‌లతో అసంతృప్తి వ్య‌క్తం చేసిన‌ట్లు స‌మాచారం. కాగా మంత్రులు బొజ్జల గోపాల కృష్ణారెడ్డి, పీతల సుజాత‌, మృణాళిని తమ మంత్రి పదవి ఎక్కడ ఊడిపోతుందోనన్న బెంగతో ముందస్తుగా సీఎం చంద్ర‌బాబు కలిసి మాట్లాడారు.

కాగా, సీఎం చంద్రబాబునాయుడుతో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ భేటీ అయ్యారు. రేపు మంత్రివర్గ విస్తరణ దృష్ట్యా అశావహులు, కీలక నేతలతో చంద్రబాబు విడివిడిగా సమాలోచనలు జరుపుతున్న క్ర‌మంలో జ్యోతుల నెహ్రు స‌మావేశం ఆస‌క్తిక‌రంగా మారింది. అనంత‌రం, ఏపీ టీడీపీ సీనియ‌ర్ నేత‌లు ప‌య్యావుల కేశ‌వ్‌, ధూళిపాళ్ల న‌రేంద్ర‌ కూడా చంద్రబాబుతో భేటీ అయ్యారు. పయ్యావుల, ధూళిపాళ్ల పదేళ్లుగా పార్టీకి అందించిన సేవలను పార్టీ నేతలు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి వర్గ విస్తరణలో వీరి అభిప్రాయాల‌ను పరిగణలోకి తీసుకుంటాన‌ని, త‌గు న్యాయం చేస్తాన‌ని బాబు భ‌రోసా ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇదే స‌మ‌యంలో ముస్లిం మైనార్టీల్లో మంత్రిపదవి ఎవరిని వరిస్తుందన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ముస్లిం మైనార్టీ ఎమ్మెల్యేలు జలీల్‌ఖాన్‌, చాంద్‌బాషా, షరీఫ్‌లలో ఒకరికి స్థానం దక్కనున్నట్లు తెలుస్తోంది. ఈసారి మంత్రివర్గంలో తమ వారికి స్థానం కల్పించాలని మైనార్టీ వర్గాలు కోరుతున్నాయి. జలీల్‌ఖాన్‌ ఇంటి దగ్గర ఉత్కంఠగా అనుచరులు ఎదురుచూస్తున్నారు.

కాగా, ఏపీ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌పై మిత్ర‌ప‌క్ష‌మైన బీజేపీ కీల‌క స‌ల‌హా చేసింది. పనిచేసే వారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలని బీజేపీ శాస‌న‌స‌భా ప‌క్ష‌నేత‌ విష్ణుకుమార్‌రాజు కోరారు. కులాలు, మతాలు, ప్రాంతాలు ప్రాపిపదికన కాకుండా భాగా పనిచేసే వారినే మంత్రివర్గంలోకి తీసుకోవాలన్నారు. అప్పుడే రాష్ట్ర అభివృద్ధి కోణంలో సీఎం చంద్ర‌బాబు స‌రైన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు అవుతుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/