Begin typing your search above and press return to search.

పళ్లు కొరకటం తప్పించి బాబు ఇంకేమీ చేయలేదన్నారు

By:  Tupaki Desk   |   15 Nov 2019 11:16 AM GMT
పళ్లు కొరకటం తప్పించి బాబు ఇంకేమీ చేయలేదన్నారు
X
టీడీపీ అధినేత చంద్రబాబుకు.. ఆయన కుమారుడు లోకేశ్ తో పాటు టీడీపీ నేతల మీద సంచలన వ్యాఖ్యలు చేసిన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచనలంగా మారారు. తాను పార్టీని వీడుతున్నానని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాటలో నడుస్తానని చెప్పారు. పార్టీపైనా.. పార్టీ నేతలపైనా వంశీ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినాయకత్వం మండిపడుతోంది. ఇలాంటివేళ.. తాజాగా వంశీ విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావును కలిశారు.

తనపై సోషల్ మీడియాలో విష ప్రచారం చేస్తున్నట్లు వంశీ ఆరోపించారు. ఆడపిల్లల పేర్లతో ఫోటోలు మార్ఫింగ్ చేసి.. అభ్యంతరకర రీతిలో పోస్టులు పెడుతున్నారని.. ఇలాంటివారిపై చర్యలు తీసుకోవాలని కంప్లైంట్ చేశారు. టీడీపీ సోషల్ మీడియా విభాగం చేస్తున్నట్లుగా ఆరోపించారు.

తనపై దుర్మార్గ ప్రచారాన్ని చేస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వంశీ.. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. తనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన బాబు నిర్ణయంపైన విరుచుకుపడ్డారు. అయినా.. ఆయన నా మీద చర్యలు తీసుకోవటం ఏమిటి? నేనే పార్టీలో పని చేయనని చెప్పి బయటకు వచ్చేశాగా? అని వ్యాఖ్యానించారు.

బాబుకు అంత సీన్ లేదని.. పళ్లు కొరకటం తప్పించి ఆయనింకేమీ చేయలేరన్న వంశీ.. నిజంగానే చంద్రబాబుకు రోషం ఉంటే.. పార్టీ మారిన రాజ్యసభ సభ్యుల్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయగలరా? అని సవాల్ విసిరారు. లోకేశ్ కు.. జూనియర్ ఎన్టీఆర్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. లోకేశ్ కు పని లేకనే సోషల్ మీడియా వింగ్స్ నడుపుతూ కూర్చున్నారన్నారని తప్పు పట్టారు.