Begin typing your search above and press return to search.

బాబు బంగారమే....కానీ

By:  Tupaki Desk   |   8 Jan 2019 5:04 AM GMT
బాబు బంగారమే....కానీ
X
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని పార్టీ శ్రేణులు బంగారంతో పోలుస్తున్నారు. అయితే ఇక్కడ చిన్న మెలికను కూడా పెడుతున్నాయి. బాబు బంగారమే..... కానీ ఆయన కుమారుడు నారా లోకేష్‌ కోసం కాకి బంగారంలా మారుతున్నారని పార్టీలో చర్చ జరుగుతోంది. మహానటుడు ఎన్టీఆర్ స్దాపించిన తెలుగుదేశం పార్టీని తన చెప్పు చేతలలో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు పార్టీలో ఇన్నాళ్లు వన్‌ మేన్ ఆర్మీగానే ఉన్నారు. చివరకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను కూడా పార్టీలో నోరెత్తకుండా చేసారు. అందుకే పార్టీపై అదుపు ఉండి పాల‌న‌లో కొంత 2003కు ముందు కొంత మెప్పు పొందారు.

తన హయాంలో ఇవన్నీ జరిగినా తన కుమారుడి విషయంలో మాత్రం చంద్రబాబు నాయుడు తప్పటడుగులు వేస్తున్నారని తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకులు అంటున్నారు. తన తర్వాత కుమారుడు లోకేష్‌ ను ముఖ్యమంత్రిని చేయాలని చంద్రబాబు ఆలోచనగా చెప్తున్నారు. ఈ వారసత్వ రాజకీయాల కారణంగా తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టడం ఖాయ‌మని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ మధ్యనే రాజకీయాలలోకి వచ్చిన నారా లోకేష్‌ కు పార్టీని నడపగలిగే సమర్ధత ఉందో లేదో చంద్రబాబుకు అంచనా లేదని చెబుతున్నారు. వచ్చే ఎన్నికలలో పార్టీ అధికారంలోకి వస్తే తొలి ఏడాది తాను ముఖ్యమంత్రిగా ఉండి అనంతరం తన కుమారుడికి ఆ పదవి కట్టబెట్టాలని చంద్రబాబు ఆలోచన అని అంటున్నారు. దీని కారణంగానే పార్టీలో సీనియర్ నాయకులను పట్టించుకోవడం లేదని - ఎవరి సలహాలు - సంప్రదింపులు తీసుకోవడం లేదని చెబుతున్నారు.

తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు కాంగ్రెస్‌ తో పొత్తు వద్దంటూ సీనియర్ నాయకులు కెఇ. క్రిష్ణమూర్తి - యనమల రామక్రిష్ణుడు - కళా వెంకట్రావు వంటి వారు సలహా ఇచ్చారట. అయితే ఆ సలహాలను పట్టించుకోకుండా చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ తో చేతులు కలిపారంటున్నారు. గతంలో కీలక నిర్ణయాలు తీసుకోవాల్సిన సమయంలో పార్టీ సీనియర్ల అభిప్రాయాలను తెలుసుకునే వారని ఇప్పుడు అసలు సంప్రదించటం లేదని అంటున్నారు. మరీ ముఖ్యంగా తన కుమారుడు లోకేష్‌ ను మంత్రి వర్గంలోకి తీసుకున్నప్పటి నుంచి చంద్రబాబు ధోరణి పూర్తిగా మారిపోయిందని వారంటున్నారు. అంతవరకూ బాబు బంగారమే... ఆ తర్వాతే కాకి బంగారంగా మారారంటూ తెలుగుదేశం నాయకులు చర్చించుకుంటున్నారటా.