Begin typing your search above and press return to search.

బాబు గారూ!... స‌భ్య‌త అంటే ఇదేనా?

By:  Tupaki Desk   |   10 Feb 2019 2:00 PM GMT
బాబు గారూ!... స‌భ్య‌త అంటే ఇదేనా?
X
రాజ‌కీయాల్లో ఉంటే ఏమైనా మాట్లొడొచ్చు. ఎవ‌రిని ఏమైనా అనేయొచ్చు. అయితే గియితే ఓ సారీ ప‌డేస్తే స‌రిపోద్ది. లేదంటే నా కామెంట్స్‌ ను వెన‌క్కు తీసుకుంటున్నాన‌ని ఓ మాట అంటే స‌రిపోద్ది. అంతేనా... మీరు న‌న్ను అన్నారు కాబ‌ట్టి నేను మిమ్మ‌ల్ని అన్నాను అనేయొచ్చు. ఎదుటి వ్య‌క్తిని రాజ‌కీయంగా కాకుండా వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేసి కూడా త‌న‌దైన శైలిలో దాని ప్ర‌భావం త‌న‌పై ప‌డ‌కుండా కూడా చూసుకోవ‌చ్చు. ఎదుటోడు అలాంటోడు, ఇలాంటోడు అంటూనే.... తాను మాత్రం శుద్ధ‌పూస అని చెప్పుకోవ‌చ్చు. మొత్తంగా నాలిక‌ను ఎన్ని మ‌డ‌త‌లైనా పెట్టేయొచ్చు. ఆ మ‌డ‌త‌ల‌ను క‌ప్పిపుచ్చుకోనూ వ‌చ్చు. ఇదీ ఘ‌న‌త వ‌హంచిన మ‌న నేత‌ల తీరు. ఈ తీరును ఇప్పుడు మ‌న‌కు కళ్ల‌కు క‌ట్టిన‌ట్టుగా చూపారు టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్ర‌బాబునాయుడు. యూట‌ర్న్ అంకుల్ అంటూ వైసీపీ నేత‌ల‌తో ముద్దు పేరు పెట్టించుకున్న చంద్ర‌బాబు... తాను యూట‌ర్న్ తీసుకున్న దాఖ‌లాలే లేవ‌ని బ‌ల్ల గుద్ది మ‌రీ చెబుతారు. మ‌హిళ‌ల‌పై కామెంట్లు చేయ‌డం స‌భ్య‌త కాద‌ని చెబుతూనే చంద్రబాబు.. నేరుగా ప్ర‌ధాని స‌తీమ‌ణి జ‌సోదాబెన్ పేరును బ‌య‌ట‌కు లాగి మ‌రీ త‌న స‌భ్య‌త‌ను ఆయ‌న చాలా ఘ‌నంగానే చాటుకున్నార‌న్న ఇప్పుడు పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు రేకెత్తుతున్నాయి.

మొత్తంగా స‌భ్య‌త పాటిస్తాన‌ని చెబుతూనే... స‌భ్య‌త‌ను మ‌రిచి మోదీ త‌ల్లి, స‌తీమ‌ణిల ప్ర‌స్తావ‌న తీసుకొచ్చిన బాబు... త‌న‌ను తాను దిగ‌జార్చేసుకున్నారు. మోదీ ఏపీ టూర్‌పై అంతెత్తున ఎగిరిన చంద్ర‌బాబు అండ్ కో... నిన్న మ‌ధ్యాహ్నం నుంచే నిర‌స‌నల హోరును షురూ చేశారు. చంద్ర‌బాబు ఆదేశాల‌తో టీడీపీ శ్రేణులు ఎక్క‌డిక‌క్క‌డ నిర‌స‌న ర్యాలీలు నిర్వ‌హించాయి. ఈ క్ర‌మంలో నేటి ఉద‌యం మోదీ గుంటూరు వ‌చ్చి వెళ్లాక... తీరిగ్గా ఎంట్రీ ఇచ్చిన చంద్ర‌బాబు.. గుంటూరు వేదిక‌గా మోదీ చేసిన ప్ర‌సంగంపై విరుచుకుప‌డ్డారు. మోదీ టూర్‌ ను నిర‌సిస్తూ న‌ల్ల రంగు చొక్కా వేసుకుని వ‌చ్చాన‌ని ప్రక‌టించిన చంద్ర‌బాబు... మోదీపై వ్య‌క్తిగ‌త వ్యాఖ్య‌లు చేశారు. త‌న‌ను, త‌న కుమారుడు నారా లోకేశ్ ను మోదీ వ్య‌క్తిగ‌తంగా టార్గెట్ చేశార‌ని ఆగ్ర‌హం చేసిన చంద్ర‌బాబు... త‌న‌కు స‌భ్య‌త ఉంద‌ని చెప్పారు. ఆ వెంట‌నే అదే స‌భ్య‌త‌ను వ‌దిలేసిన చంద్ర‌బాబు... మోదీ స‌తీమ‌ణి జ‌సోదాబెన్‌ను పేరును ప్ర‌స్తావించారు.

ఈ సంద‌ర్బంగా చంద్ర‌బాబు ఏమ‌న్నార‌న్న విష‌యానికి వ‌స్తే... న‌న్ను లోకేష్ తండ్రిగా అభివర్ణించారు. లోకేష్ మా అబ్బాయి. మీకు అబ్బాయిలు లేరు. మీకు కుటుంబం లేదు. మీకు బంధాలు లేవు. మీకు సంబంధాలు లేవు. కుటుంబం వ్యవస్థను పెంచే వ్యక్తిని. కుటుంబంతో గడపాలని కోరుకునే వ్యక్తిని. ప్రతి ఒక్కరు కుటుంబంతో బాగుంటేనే మీకు ఆనందమని భావించే వ్యక్తిని. ప్రధానికి ఎప్పుడైనా కుటుంబ వ్యవస్థ పైన గౌరవం ఉందా? ఆయనకు భార్య ఉందని, ముస్లీం మహిళలకు అన్యాయం జరుగుతుందని ట్రిపుల్ తలాక్ తెచ్చారు. జశోదాబెన్ అని ఆయన భార్య ఉందని, నేను ఆ మాట అంటే... మీ తల ఎక్కడ పెట్టుకుంటారు. నన్ను లోకేష్ తండ్రి అన్నందుకు గర్వంగా ఉంది. జశోదాబెన్ భర్త అని నేను అంటున్నా.. అవునా.. కాదా తమ్ముళ్లు మిమ్మల్ని అడుగుతున్నా. జశోదాబెన్‌ కు మీరు విడాకులు కూడా ఇవ్వకుండా మీరు ఆమెను పక్కన పెట్టారు. మీరు నా వ్యక్తిగత విషయాలు మాట్లాడారు కాబట్టి నేను చెబుతున్నా. తల్లికి కూడా దగా చేసిన వ్యక్తి మోదీ. లేదంటే చెప్పేవాడిని కాదు. నాకు సభ్యత ఉంది అని చంద్ర‌బాబు త‌న‌దైన శైలి స‌భ్య‌త‌ను బయ‌ట‌పెట్టుకున్నారు.