Begin typing your search above and press return to search.

కాంగ్రెస్ కొంప‌ముంచిన చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   11 Nov 2018 5:24 PM GMT
కాంగ్రెస్ కొంప‌ముంచిన చంద్ర‌బాబు
X
తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు వేసిన ఎత్తుకు కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని దెబ్బ తిన‌నుందా? ద‌శాబ్దాలుగా ఆ పార్టీకి అండ‌గా ఉంటున్న వారిని ఒక్క ప్ర‌క‌ట‌న‌తో బాబు దూరం చేసేశారా? ఎన్నిక‌ల పొత్తు వెనుక బాబుకు మేలు చేసే ఎత్తుగ‌డ‌లే త‌ప్ప కాంగ్రెస్‌ కు ఉప‌యోగం ఏమీ లేదా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. ఓ వైపు చంద్ర‌బాబుతో కాంగ్రెస్‌ తో పొత్తు పెట్టుకొని దూకుడుగా ముందుకు సాగుతున్న స‌మ‌యంలో కాంగ్రెస్ అవాక్క‌య్యే రీతిలో ఇలాంటి అప్‌ డేట్ రావ‌డం చిత్రంగా ఉన్న‌ప్ప‌టికీ - వాస్త‌వ ప‌రిస్థితులు ఇందుకు అద్దం ప‌డుతున్నాయ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు విశ్లేషిస్తున్నాయి. చిత్రంగా ఇదంతా గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్‌ కు మేలు చేసే రీతిలో ఉండ‌టం గ‌మనార్హం.

రాజ‌కీయ‌వ‌ర్గాల అభిప్రాయం ప్ర‌కారం...కాంగ్రెస్ పార్టీకి రెడ్డి సామాజిక‌వ‌ర్గం అండగా ఉన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఎన్నిక‌లు జ‌రుగుతున్న తెలంగాణ విష‌యానికి వ‌స్తే దాదాపు 50 శాతం పైగా ఈ సామాజిక‌ వ‌ర్గ‌ మ‌ద్ద‌తు కాంగ్రెస్‌ కు ఉండేది. వీరు స‌హ‌జంగానే టీడీపీకి వ్య‌తిరేకంగా రాజ‌కీయంగా వ్య‌వ‌హ‌రించారు. అలాంటి నేప‌థ్యంలో తాజాగా పొత్తు పేరుతో చంద్ర‌బాబు కాంగ్రెస్‌ కు ద‌గ్గ‌రవ‌డం, ఈ ఎత్తుగ‌డ‌ల వ‌ల్ల ప‌లువురు రెడ్డి నేత‌ల‌కు సీట్లు ద‌క్క‌క‌పోవ‌డాన్ని స‌ద‌రు వ‌ర్గం జీర్ణించుకోవ‌డం లేద‌ని తెలుస్తోంది. త‌మ‌కు బ‌ద్ద‌శ‌త్రువు అయిన చంద్ర‌బాబు త‌న రాజ‌కీయ స్వార్థం కోసం చేరువ అవ‌డం - పైగా అది త‌మ‌కు న‌ష్టం చేసేలా ఉండ‌టంతో వారు కాంగ్రెస్‌ కు దూర‌మ‌వుతూ టీఆర్ ఎస్ పార్టీకి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్లు అంచనా వేస్తున్నారు.

కేసీఆర్ రెడ్డి నేత‌ల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం - కార్పొరేష‌న్ వంటి హామీల‌ను ఇవ్వ‌డంతో పాటుగా ఏపీ ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్‌ మోహ‌న్ రెడ్డి పై ఇటీవ‌ల జ‌రిగిన క‌త్తి దాడి అంశంలో వ్య‌వ‌హ‌రించిన తీరుతో...త‌మ‌కు కాంగ్రెస్ కంటే టీఆర్ ఎస్ ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంద‌ని స‌ద‌రు రెడ్డి సామాజిక‌ వ‌ర్గం భావిస్తున్న‌ట్లుగా చెప్తున్నారు. మ‌రో వైపు రెడ్డిల సార‌థ్యంలోని ప‌లు మీడియా సంస్థ‌లు సైతం కూట‌మిని కాంగ్రెస్ కంటే చంద్ర‌బాబే ఎక్కువ‌గా ప్ర‌భావితం చేస్తున్నార‌ని విశ్లేషిస్తూ కేసీఆర్ ఈ నేప‌థ్యంలో ఉత్త‌మ ప్ర‌త్యామ్నాయ‌మని పేర్కొంటున్నాయి. ఈ నేప‌థ్యంలో రాబోయే ఎన్నిక‌ల్లో తాము కాంగ్రెస్‌ కు అండగా నిల‌వడం కంటే - టీఆర్ ఎస్‌ కు మ‌ద్ద‌తిస్తేనే మేల‌ని రెడ్డిలు భావిస్తున్న‌ట్లు టాక్‌. చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా నిల‌బ‌డితే రెండు తెలుగు రాష్ట్రాల్లో రెడ్డి సామాజిక వ‌ర్గానికి చేటు జ‌రుగుతుంద‌ని, ఈసారికి కాంగ్రెస్ దెబ్బ రుచిచూపించ‌డ‌మే మంచిద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. స్థూలంగా - బాబును ద‌గ్గ‌ర చేసుకోవ‌డం అనే ఐడియా ఏదైతే ఉందో అది బాబుకు మేలు చేసేదే కానీ - కాంగ్రెస్‌ కు ఏమాత్రం ఉప‌యోగ‌ప‌డ‌ని అంశ‌మ‌ని ప‌లువురు విశ్లేషిస్తున్నారు.