Begin typing your search above and press return to search.

ఒంట‌రిగా వ‌చ్చేందుకు బాబుకు భ‌య‌మా?

By:  Tupaki Desk   |   16 Nov 2018 6:58 AM GMT
ఒంట‌రిగా వ‌చ్చేందుకు బాబుకు భ‌య‌మా?
X
తెలంగాణ ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి సంబంధించి టీడీపీ అధినేత - ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు తీసుకున్న తాజా నిర్ణ‌యం ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ చ‌ర్చనీయాంశ‌మ‌వుతోంది. తెలంగాణ‌లో ప్ర‌చారానికి గ‌తంలో నో చెప్పిన బాబు.. ఇప్పుడు మాత్రం తాను కూడా వ‌స్తాన‌ని చెబుతుండ‌ట‌మే ఇందుకు కార‌ణం.

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ విభ‌జ‌న అనంత‌రం తెలంగాణ‌లో టీడీపీ నాయ‌కులు చాలావ‌ర‌కు టీఆర్ ఎస్‌ లోకి వెళ్లిపోయారు. అయిన‌ప్ప‌టికీ కేడ‌ర్ మాత్రం పెద్ద‌గా చెక్కుచెద‌ర‌లేదు. సెటిల‌ర్లు ఎక్కువ‌గా ఉన్న హైద‌రాబాద్‌ తోపాటు న‌గ‌ర శివార్ల‌లోని ప‌లు నియోజ‌క‌వ‌ర్గాల్లో టీడీపీ గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల్లో జ‌య‌భేరి మోగించింది. దీంతో ఈసారి కూడా ఆయా స్థానాల్లో పోటీకి టీడీపీ స‌న్నాహాలు చేసుకుంది.

ఆపై టీటీడీపీ నేత‌లు చంద్ర‌బాబును క‌లిశారు. ముంద‌స్తు ఎన్నిక‌ల్లో ప్ర‌చారానికి రావాల‌ని.. మీరొస్తే కేడ‌ర్‌ లో ఉత్సాహం ఉర‌క‌లెత్తుతుంద‌ని కోరారు. విజ‌యావ‌కాశాలు పెరుగుతాయ‌ని విన్న‌వించారు. చంద్ర‌బాబు మాత్రం అందుకు నిరాక‌రించారు. తాను ప్ర‌చారానికి రాలేన‌ని తేల్చిచెప్పారు. కానీ అన్ని విధాలా అవ‌స‌ర‌మైన స‌హాయం అంద‌జేస్తాన‌ని భ‌రోసా ఇచ్చారు. దీంతో చేసేదేం లేక టీటీడీపీ నేత‌లు నిరాశ‌గా వెనుదిరిగారు.

రోజులు మారాయి. రాష్ట్రంలో టీడీపీ - కాంగ్రెస్‌ ల మ‌ధ్య పొత్తు కుదిరింది. మ‌హా కూట‌మి ఆవిర్భ‌వించింది. ఇప్పుడు చంద్ర‌బాబు కూడా మ‌న‌సు మార్చుకున్నారు. కూట‌మి త‌ర‌ఫున ప్ర‌చారానికి రావ‌డానికి తాను సిద్ధ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఏఐసీసీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీతో క‌లిసి తెలంగాణ‌లో దాదాపు 18 నియోజ‌క‌వ‌ర్గాల్లో ఈ నెల చివ‌ర్లో ప‌ర్య‌టించేందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేశారు.

ప్ర‌చారానికి వ‌చ్చేందుకు అంగీక‌రిస్తూ చంద్ర‌బాబు తీసుకున్న తాజా నిర్ణ‌యం తీవ్ర విమ‌ర్శ‌ల పాల‌వుతోంది. కాంగ్రెస్‌ తో పొత్తు లేన‌ప్పుడు తెలంగాణ‌కు ఒంట‌రిగా రావ‌డానికి బాబు భ‌య‌ప‌డ్డార‌ని.. ఇప్పుడు రాహుల్‌ తో క‌లిసి వ‌చ్చి వెళ్లాల‌ని ఆయ‌న చూస్తున్నార‌ని ప‌లువురు విమ‌ర్శిస్తున్నారు. ఓటుకు నోటు కేసు వంటి వ్య‌వ‌హారాల్లో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ త‌న‌ను చీల్చిచెండాడుతార‌నే భ‌యంతోనే గ‌తంలో ప్ర‌చారానికి వ‌చ్చేందుకు బాబు జంకార‌ని వారు ఆరోపిస్తున్నారు. ఇప్పుడు రాహుల్ ఉన్నార‌న్న ధైర్యంతో ప్రచారానికి వ‌చ్చేందుకు ఆయ‌న సాహ‌సిస్తున్నార‌ని మండిప‌డుతున్నారు. మ‌రీ ఇంత‌గా భ‌య‌ప‌డే చంద్ర‌బాబు.. తెలంగాణ‌లో టీడీపీకి ఏ మేర‌కు మార్గ‌నిర్దేశ‌నం చేయ‌గ‌ల‌ర‌ని రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప‌లువురు పెద‌వి విరుస్తున్నారు.