Begin typing your search above and press return to search.
ఆఖరి క్షణాల్లో హైరానా బాబుకు అలవాటే!
By: Tupaki Desk | 26 Dec 2018 2:30 PM GMTకొన్ని అలవాట్లు ఎప్పటికి మార్చలేం. అందునా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకున్న కొన్ని అలవాట్లను అస్సలు మార్చలేరు. ఎవరెన్ని చెప్పినా.. వారి మాటను పట్టించుకోకుండా తన మానాన తాను పోవటం ఆయనకు అలవాటే. 2009లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికలు గుర్తున్నాయా?
దాంతో.. జరగాల్సిన నష్టం భారీగా జరిగింది. రెండోసారి విపక్ష నేతగా ఉన్న బాబు.. 2014 ఎన్నికల సమయంలో మాత్రం ఆర్నెల్లు ముందుగా అభ్యర్థుల్ని ప్రకటిస్తానన్న మాటను పలు బహిరంగ సభల్లో చెప్పారు. బరిలో ఉండే అభ్యర్థుల్ని బాబు ఆర్నెల్ల ముందు ప్రకటించటమా? నో.. నెవ్వర్ అన్న పలువురి అంచనాలకు తగ్గట్లే ఆఖరి నిమిషంలో హడావుడిగా అభ్యర్థులను ప్రకటించటం తెలిసిందే.
ముందు నుంచి చెప్పే మాటలకు.. ప్రణాళికాబద్ధంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుందనే బాబు మాటను టీడీపీలోని ఒక్క నేత కూడా నమ్మే పరిస్థితి లేదు. ఆ విషయాన్ని తాజాగా జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బాబు మరోసారి ఫ్రూవ్ చేశారని చెప్పాలి. తిప్పి తిప్పి కొడితే 20 స్థానాలు కూడా లేనప్పటికీ.. ఆయా స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక కోసం బాబు ప్రదర్శించిన జాగు అంతా ఇంతా కాదు. ఇది కూడా..పార్టీ విజయవకాశాలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్న అభిప్రాయం ఉంది.
అంతేకాదు.. ముందు ఇచ్చిన హామీలకు భిన్నంగా అకస్మాత్తుగా ప్యారాచూట్ అభ్యర్తుల్ని బరిలోకి దించటం బాబుకు అలవాటే. తెలంగాణలో ఇటీవల ముగిసిన ఎన్నికల్లో చూస్తే.. అప్పటివరకూ పార్టీకి ఏ మాత్రం సంబంధం లేని.. నియోజకవర్గం మీద కనీస అవగాహన లేని అభ్యర్థుల్ని పలువురిని బరిలోకి దించటం తెలిసిందే. శేరిలింగంపల్లి విషయానికి వస్తే.. అక్కడ టీడీపీ అభ్యర్థిగా మువ్వా సత్యానారాయణను ప్రకటించి ఉంటే ఆయన పక్కాగా గెలిచి ఉండేవారు. కానీ.. ఆయన స్థానంలో ఉన్నట్లుండి ఊడిపడ్డ భవ్య ఆనందప్రసాద్ ను పార్టీ అభ్యర్థిగా ప్రకటించటం.. తుది ఫలితం ఏమైందన్న విషయం అందరికి తెలిసిందే.ఆఖరి నిమిషం వరకూ నానపెట్టటం.. చివరకు పులిహోర నిర్ణయాలు తీసుకోవటంలో బాబు తర్వాతే ఎవరైనా. అందుకే.. బాబు ఎప్పుడైనా ముందే అభ్యర్థుల్ని ప్రకటిస్తామని చెబితే నవ్వుకునేది. హైరానా.. హడావుడిని ఇంటిపేర్లుగా పెట్టుకునే బాబుకు.. ప్లాన్డ్ గా వ్యవహరించటం అస్సలు అలవాటు లేదని చెప్పకతప్పదు.