Begin typing your search above and press return to search.

మీలో పౌరుషం లేదా?బాబు తాజా డైలాగ్ వెనుక మర్మం ఇదేనా?

By:  Tupaki Desk   |   19 Jan 2020 5:22 AM GMT
మీలో పౌరుషం లేదా?బాబు తాజా డైలాగ్ వెనుక మర్మం ఇదేనా?
X
ఎంతకూ కదలని బండిని ఎంత తోస్తే మాత్రం ఊపయోగం ఉంటుంది? ప్రజల మనసుల్లో లేని దానిని తీసుకొచ్చేందుకు ఎంతలా ప్రయత్నించినా ఫలితం ఉండదు. ఈ విషయాన్ని విస్మరిస్తున్న చంద్రబాబు.. తన మాటలతో ఏపీ ప్రజల్ని భావోద్వేగానికి గురి చేయాలన్న విఫల ప్రయత్నాల్ని విడిచిపెట్టకుండా చేస్తున్నారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుతో డెవలప్ మెంట్ ను అన్ని ప్రాంతాల్లో సమానంగా చేపట్టాలన్న జగన్ ప్రభుత్వం ఆలోచిస్తుంటే.. మరోవైపు ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే.. అమరావతి మీద బాబు చేస్తున్న లొల్లి అంతా ఇంతా కాదు.

దాదాపు నెలకు పైనే నిరసనలు.. ఉద్యమాలు చేస్తున్నా.. అమరావతి కోసం భూములు ఇచ్చిన గ్రామాల్లో కొన్ని మాత్రమే పాజిటివ్ గా రియాక్ట్ అవుతుంటే.. మిగిలిన జిల్లాల్లోని ప్రజలు జరుగుతున్నదేదీ తమకు సంబంధం లేని వ్యవహారమన్నట్లుగా ఉంటున్నారు. అమరావతి పేరుతో రాజకీయ అలజడిని తెర మీదకు తీసుకొచ్చి పొలిటికల్ మైలేజీ కోసం బాబు పడుతున్న పాట్లకు.. ఏపీ ప్రజలు తమదైన శైలిలో సమాధానం చెబుతున్నారు. మూడు రాజధానుల మీద ఎవరూ ఏమీ మాట్లాడకపోవటమే కాదు.. వ్యతిరేకించటం లేదు కూడా.

దీంతో..దిక్కుతోచని చంద్రబాబు ఇప్పుడు ఎమోషనల్ బ్లాక్ మొయిల్ కు దిగుతున్నారు. దీనికి నిదర్శనంగా ఆయన చేసిన తాజా వ్యాఖ్యల్ని చెప్పక తప్పదు. అమరావతిని జగన్ సర్వనాశనం చేస్తున్నారని.. ఇలాంటి వేళ అసెంబ్లీ ముట్టడికి ప్రజలంతా సమాయుత్తం కావాలని పిలుపునిస్తున్నారు. తానెంత మాట్లాడినా ఫలితం పెద్దగా లేకపోవటంతో ఆయన గేరు మార్చారు. మీలో పౌరుషం లేదా? అని ప్రశ్నించటంతో పాటు ఇదంతా నా ఒక్కడికేనా? సమస్య నా ఒక్కడిదేనా? అన్న విషయాన్ని ఐదు కోట్ల మంది తెలుసుకోవాలని వ్యాఖ్యానించటం గమనార్హం. ఇదంతా చూస్తే.. ప్రజల్ని ఏదోలా రెచ్చగొట్టాలన్న ఉద్దేశం కొట్టొచ్చినట్లుగా కనిపించకమానదు. బాబు తాజా వ్యాఖ్యలపై విస్మయం వ్యక్తమవుతోంది. అమరావతి విషయంలో ఏపీ ప్రజల స్పందన ఎలా ఉందన్న దానికి బాబు మాటలు ఇట్టే చెప్పేస్తున్నాయని చెప్పక తప్పదు.