Begin typing your search above and press return to search.

శంకుస్థాపనకు లక్ష మంది అవసరమా బాబు?

By:  Tupaki Desk   |   1 Oct 2015 1:38 PM GMT
శంకుస్థాపనకు లక్ష మంది అవసరమా బాబు?
X
కార్యక్రమం ఏదైనా సరే.. భారీగా.. కనివినీ ఎరుగని రీతీలో చేయటం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు అలవాటే. చరిత్రలో నిలిచిపోయేలా ఏపీ రాజధాని అమరావతి శంకుస్థాపన జరగాలని ఆయన తపిస్తున్నారు. అందులో తప్పు లేదు. కానీ.. భారీతనానికి పోయే కొద్దీ సమస్యల తీవ్రత భారీగా ఉంటుందన్న విషయం మర్చిపోకూడదు.

సింగపూర్.. జపాన్ ప్రధానులతో (సింగపూర్ ప్రధాని అయితే కన్ఫర్మ్ అని.. జపాన్ ప్రధాని విషయం మాత్రం సందేహమని తమ్ముళ్లు చెబుతుంటే.. మరికొందరు మాత్రం పక్కా అంటున్నారు) పాటు.. ప్రధాని మోడీ.. ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. అతిరథ మహారథులు.. ప్రముఖ పారిశ్రామికవేత్తలు.. సెలబ్రిటీలు.. ఇలా చాలామందే అమరావతి శంకుస్థాపనకు రానున్నారు.

అయితే.. అమరావతి శంకుస్థాపనకు మొత్తం లక్ష మంది వరకూ ఆహ్వానిస్తున్నామని ఏపీ సర్కారు ప్రకటించటం ఆందోళన కలిగించే అంశం. శుభమా అని భారీ కార్యక్రమం చేపడితే.. ఆందోళన ఎందుకన్న ప్రశ్న వ్యక్తం కావొచ్చు. గత అనుభవాలతో చూసినప్పుడు ఈ వాదన ఎంత నిజమో ఇట్టే అర్థమవుతుంది. లక్ష మందితో కార్యక్రమం చేపట్టిన పక్షంలో ఏర్పాట్లు భారీగా అవసరమవుతాయి.

అనుకోని సంఘటన (తొక్కిసలాట) లాంటివి ఏదైనా చోటు చేసుకుంటే భారీ ప్రమాదం జరగటంతో పాటు.. అంతర్జాతీయంగా బాబు సర్కారు సమర్థతపై సందేహాలు వ్యక్తమయ్యే అవకాశం ఉంది. గోదావరి పుష్కరాల సమయంలో పోలీసులు.. అధికారులతో పాటు.. రాజకీయ నేతల తప్పులు చూశాం. దానికి తగ్గట్లే బాబుపై చెరగని మచ్చ పడిపోయింది.

ఇలాంటి అనుభవాల నేపథ్యంలో లక్షమంది లాంటి భారీ సంఖ్యలో జన సమీకరణ సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జరగరానిది ఏదైనా జరిగిన పక్షంలో నష్టం ఎక్కువగా ఉండే ప్రమాదం ఉంది. దీనికి తోడు.. ఇంత భారీ సంఖ్యలో ఆహ్వానం పొందినప్పుడు విస్తృతంగా ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. అంత భారీ స్థాయిలో ఏర్పాట్లు సాధ్యమేనా అన్న అంశంపై ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. భారీగా చేయాలని డిసైడ్ అయితే.. ఎలాంటి విపత్తులు ఎదురైనా అందుకు తట్టుకునే సాధనా సంపత్తిని సిద్ధం చేసుకోవాలన్న విషయం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మర్చిపోకూడదు.