Begin typing your search above and press return to search.

ఏంది బాబు.. ఇంత ఖ‌ర్చేంది బాబు..?

By:  Tupaki Desk   |   24 Dec 2017 7:30 AM GMT
ఏంది బాబు..  ఇంత ఖ‌ర్చేంది బాబు..?
X
ప్ర‌జ‌ల ఆస్తుల‌కు ధ‌ర్మ‌క‌ర్త‌గా ఉండాల్సిన వ్య‌క్తి ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తే ఎలా ఉంటుందంటే.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాదిరి అని చెప్పక త‌ప్ప‌దు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో భారీగా న‌ష్ట‌పోయిన ఏపీని.. మ‌రిన్ని ఆర్థిక క‌ష్టాల్లో కూరుకుపోయేలా బాబు తీరు ఉంది. రాజ‌ధాని లేని ఏపీకి స‌రికొత్త‌గా క‌ట్టిస్తాన‌ని చెబుతున్న చంద్ర‌బాబు.. క‌ళ్లు చెదిరిపోయే డిజైన్లు చూపించి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.

సినిమా సెట్టింగుల‌ను త‌ల‌పించే రీతిలో ఉన్న ఈ నిర్మాణాల‌కు అయ్యే వ్యయం మాటేమిటి? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. అమ‌రావ‌తిలో నిర్మించే అసెంబ్లీ.. స‌చివాల‌యం.. హైకోర్టుల‌ కోసం చేసే ఖ‌ర్చు లెక్క బ‌య‌ట‌కు వ‌చ్చి షాకిస్తున్నాయి. అటు హైద‌రాబాద్ లో కానీ.. ఇటు బెజ‌వాడ‌లో కానీ ఏ నిర్మాణ‌మైనా చ‌ద‌ర‌పు అడుక్కి రూ.3వేలు మొద‌లు కొని రూ.4వేల వ‌ర‌కూ ప‌లుకుతోంది.

ఒక‌వేళ‌.. విలాస‌వంత‌మైన ఇళ్ల నిర్మాణానికి రూ.5వేల లోపే వ‌సూలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మిస్తున్న సచివాల‌యం..అసెంబ్లీ.. హైకోర్టు భ‌వ‌నాల కోసం ఖ‌ర్చు చేస్తున్న లెక్క తెలిస్తే నోటి వెంట మాట రాదంతే. చ‌ద‌ర‌పు అడుగుకు రూ.1,179 చొప్పున ఏపీ స‌ర్కారు ఖ‌ర్చు చేయ‌నున్న‌ట్లుగా చెబుతున్నారు.

ఇంత భారీ ఖ‌ర్చుతో నిర్మాణాల్ని నిర్మించాల్సిన అవ‌స‌రం ఉందా? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది. సుదీర్ఘ కాలం నిర్మాణ రంగంలో అనుభ‌వం ఉన్న వారు సైతం.. తాజాగా ఏపీ స‌ర్కారు ఓకే అంటున్న నిర్మాణ ఖ‌ర్చు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. అంచ‌నాలే ఇంత భారీగా ఉంటే.. రేపొద్దున అనుకున్న‌ది పూర్తి అయ్యేస‌రికి ఎంత ఖ‌ర్చు అవుతుంద‌న్న‌ది ఊహ‌కు అంద‌ని రీతిలో త‌యారైంద‌న్న మాట వినిపిస్తోంది. ఏపీ రాజ‌ధానిలో నిర్మించే నిర్మాణాల‌కు సంబంధించిన డిజైన్ల‌ను ఖ‌రారు చేసేందుకే మూడున్న‌రేళ్ల‌కాలాన్ని గ‌డిపేసిన చంద్ర‌బాబు స‌ర్కారు.. ఇప్పుడు కొత్త‌గా నిర్మాణాల హ‌డావుడి మొద‌లెట్టింది.

ఏపీ శాశ్విత స‌చివాల‌యం కోసం నిర్మిస్తున్న భ‌వ‌న నిర్మాణానికి చ‌ద‌ర‌పు అడుగుకు రూ.7179 చొప్పున.. హైకోర్టు భ‌వ‌నాల‌కు చ‌ద‌ర‌పు అడుగుకు రూ.6192 చొప్పున ఖ‌ర్చు అవుతుంద‌ని లెక్క వేస్తున్నారు. నిజానికి అన‌వ‌స‌ర ఖ‌ర్చు విష‌యంలో ఏపీ ముఖ్య‌మంత్రి త‌ర్వాతే ఎవ‌రైనా అన్న మాట వినిపిస్తోంది. హైద‌రాబాద్ నుంచి అమ‌రావ‌తికి త‌ర‌లి వ‌చ్చే క్ర‌మంలో హ‌డావుడిగా తాత్కాలిక స‌చివాల‌యం కోసం ఇప్ప‌టికే వంద‌లాది కోట్లు ఖ‌ర్చు చేయ‌టం తెలిసిందే.

అప్పుడే.. శాశ్విత క‌ట్ట‌డం కోసం మ‌ళ్లీ ఖ‌ర్చు చేయ‌టం మొద‌లెట్టారు. వెల‌గ‌పూడిలో నిర్మించిన తాత్కాలిక స‌చివాల‌యం కోసం ఇప్ప‌టికే భారీగా ఖ‌ర్చు చేసింది. చ‌ద‌ర‌పు అడుగు రూ.3150 చొప్పున టెండ‌ర్లు ఖ‌రారు చేసి చివ‌ర‌కు రూ.6వేల వ‌ర‌కూ ఖ‌ర్చును తీసుకెళ్లింది ఏపీ స‌ర్కారు. రూ.180 కోట్ల‌ను తాత్కాలిక స‌చివాల‌యాన్ని పూర్తి చేయాల‌న్న అంచ‌నాతో మొద‌లై చివ‌ర‌కు రూ.660 కోట్ల ఖ‌ర్చు అయిన‌ట్లుగా చెబుతున్నారు.

నిర్మాణ ఖ‌ర్చుల‌కు అద‌నంగా గ్రీన‌రీ.. మౌలిక వ‌స‌తుల‌తో క‌లుపుకొని తాత్కాలిక స‌చివాల‌యానికి రూ.వెయ్యి కోట్ల వ‌ర‌కూ ఖ‌ర్చు చేసిన‌ట్లుగా అంచ‌నా.

అదే రీతిలోతాజాగా నిర్మిస్తున్న శాశ్విత క‌ట్ట‌డాల‌కు.. నిర్మాణ వ్య‌య‌మే ఏడు వేల‌కు పైనే అయితే.. నిర్మాణం పూర్తి అయిన త‌ర్వాత గ్రీన‌రీ.. మౌలిక వ‌స‌తులు క‌లిపితే త‌క్కువ‌లో త‌క్కువ 8వేల నుంచి 9వేల మ‌ధ్య‌లో ఖ‌ర్చు అయ్యే అవ‌కాశం ఉంది. ల‌క్ష‌లాది చ‌ద‌ర‌పు అడుగులు నిర్మాణం కార‌ణంగా ఏపీ స‌ర్కారు ఖ‌జ‌నా మీద ప‌డే భారం గురించి ఆలోచిస్తే వ‌చ్చే అంకెలు భ‌య‌పెట్టేవిగా ఉంటాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. గ‌డిచిన మూడున్న‌రేళ్ల‌లో భారీ అప్పు చేసిన ఏపీ స‌ర్కారు.. తాజాగా నిర్మిస్తున్న నిర్మాణ వ్య‌యం మ‌రింత పెరిగిన ప‌క్షంలో ఏపీ స‌ర్కారు రుణం భారీగా పెరిగిపోవ‌టం ఖాయం. ఖ‌ర్చ విష‌యంలో ఆచితూచి అడుగులు వేయాల్సిన వేళ‌.. అద్భుతం.. మ‌హాద్భుతం పేరుతో చేస్తున్న ఖ‌ర్చు లెక్క అంతిమంగా ఏపీ వాసుల మెడ‌కు చుట్టుకోవ‌టం ఖాయం. ఖ‌ర్చు విష‌యంలో ఏపీ స‌ర్కారు బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రిస్తే బాగుంటుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.