Begin typing your search above and press return to search.

చంద్రబాబు దిల్లీ దీక్ష... ఏపీ ఖజానాకు చిల్లులు

By:  Tupaki Desk   |   9 Feb 2019 4:57 PM GMT
చంద్రబాబు దిల్లీ దీక్ష... ఏపీ ఖజానాకు చిల్లులు
X
ప్రత్యేక హోదా వద్దని... వేస్టని.. ప్యాకేజీయే ముద్దని చెప్పి - మళ్లీ ఇప్పుడు హోదా పేరుతో దీక్షలు చేస్తున్న ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఇందుకోసం భారీ ఎత్తున ప్రజాధనం దుర్వినయోగం చేస్తున్నారని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. చంద్రబాబు దీక్ష వెలవెలబోకుండా ఉండేందుకు... జనాన్ని ఏపీ నుంచి పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే రెండు ప్రత్యేక రైళ్లు ఏపీ నుంచి బయలుదేరాయి. అవి ఆదివారం దిల్లీ చేరుకుంటున్నాయి. ఈ రెండు రైళ్ల కోసం ఏపీ ప్రభుత్వ ఖజానా నుంచే రూ.కోటికి పైగా చెల్లించారు. కేవలం ఈ రెండు రైళ్లకే ఇంత ఖర్చు చేస్తే మొత్తంగా చంద్రబాబు దీక్షకు ఎంత ఖర్చు చేస్తున్నారో లెక్కే లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

ఒక్కొక్కటి 20 బోగీలతో రెండు రైళ్లు ఇందుకోసం కావాలని దక్షిణ మధ్య రైల్వేను ఏపీ ప్రభుత్వం కోరింది. ఇందులో ఒకటి శుక్రవారం శ్రీకాకుళం నుంచి బయలుదేరగా.. రెండోది అనంతపురం నుంచి అదే రోజు బయలుదేరింది.

ఈ రైళ్ల కోసం మొత్తం రూ.కోటి 12 లక్షల 16 వేల 465 రూపాయలు చెల్లిస్తోంది ఏపీ. శ్రీకాకుళం నుంచి వెళ్తున్న రైలుకు రూ.59,49,380.... అనంతపురం నుంచి వెళ్తున్న రైలుకు రూ.42,67,085 చెల్లిస్తోంది. దీంతో పాటుగా కోచ్ డిపాజిట్‌ గా 10 లక్షలు చెల్లించింది. ఈ డిపాజిట్ మొత్తం మాత్రం వెనక్కు వస్తుంది.

అయితే... ఈ రైళ్లు కేవలం సాధారణ కార్యకర్తలు - చోటామోటా నాయకులు ప్రయాణించడానికే వాడుతున్నారు. ఇక ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు - ఎంపీలు - జిల్లాల్లోని ఇతర నాయకులకు సంబంధించి కూడా ప్రబుత్వ ఖజానా నుంచి భారీ ఎత్తున ఖర్చు చేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి.