Begin typing your search above and press return to search.

పోల‌వ‌రం ప‌నులు ఆగితే ఏం జ‌రుగుతుంది?

By:  Tupaki Desk   |   1 Dec 2017 3:31 AM GMT
పోల‌వ‌రం ప‌నులు ఆగితే ఏం జ‌రుగుతుంది?
X
ఎన్నో ఆశ‌లు.. మ‌రెన్ని ఆకాంక్ష‌లు. భారీ ప్రాజెక్టుగా.. దేశంలో అతి పెద్ద‌దైన ప్రాజెక్టుల్లో ఒక‌టి పోల‌వ‌రం. వైఎస్ హ‌యాంలో చాలా అనుమ‌తులు పొందిన‌ ఈ భారీ ప్రాజెక్టును పూర్తి చేసి క్రెడిట్ కొట్టేయాల‌న్న‌ది ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఆలోచ‌న‌. అయితే.. అందుకు భిన్నంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీల‌క‌మైన స్పిల్ వే ప‌నుల్ని ఆపివేయాలంటూ మోడీ స‌ర్కారు ఆదేశాలు ఇచ్చింది. దీనిపై ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దాదాపుగా బోరుమ‌న్న ప‌రిస్థితి. ఎప్పుడూ లేని రీతిలో రియాక్ట్ అయిన చంద్ర‌బాబు.. ఇప్ప‌టికిప్పుడు ప్రాజెక్టును ఆపేస్తే జ‌రిగే న‌ష్టం ఎంత‌న్న విష‌యాన్ని వివ‌రంగా చెబుతూ ఎంత న‌ష్టం వాటిల్లిందో చూశారా అంటూ చెబుతున్నారు. మ‌రింత కాలం... కేంద్రం నిర్ల‌క్ష్యం క‌న‌ప‌డ‌టం లేదా బాబూ అని ఆల్రెడీ జ‌నం సెటైర్లు మొద‌ల‌య్యాయి.

ఇంత‌కీ కేంద్రం ఆదేశాల నేప‌థ్యంలో జ‌రిగే న‌ష్టం ఎంత‌న్నది బాబు మాట‌ల్లో వింటే ఆస‌క్తిక‌ర‌మే కాదు.. నిజ‌మా అనిపించ‌క మాన‌దు. బాబు మాట‌ల్ని ప‌క్క‌న పెట్టి.. బాబు కోణంలో కాకుండా న్యూట్ర‌ల్ గా ఈ ఇష్యూను చూస్తే.. జ‌రిగిన దాన్లో బాబు త‌ప్పులు చాలానే క‌నిపిస్తాయి.

పోల‌వ‌రం ప్రాజెక్టు నిర్మాణం ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నం కోసం కాకుండా.. త‌న స‌మ‌ర్థ‌త‌కు.. సామ‌ర్థ్యానికి నిలువెత్తు నిద‌ర్శ‌నంగా ప్రొజెక్టు చేసుకోవ‌టం తెలిసిందే. సొమ్ము ఒక‌రిది.. సోకు మ‌రొక‌రిదంటే ఎవ‌రు మాత్రం ఊరుకుంటారు. అందులోకి కేంద్రంలో ఉన్న‌ది వాజ్ పేయ్ లాంటి పెద్ద మ‌నిషి అయితే లెక్క‌లు మ‌రోలా ఉండేవి.

అక్క‌డ ఉన్న‌ది మోడీ. తాను ఇచ్చే ప్ర‌తి పైసాకు త‌న‌కే రాజ‌కీయ ప్ర‌యోజ‌నం క‌ల‌గాల‌నుకునే ర‌కం. అలాంట‌ప్పుడు.. పోల‌వ‌రం ప్రాజెక్టు కార‌ణంగా త‌మ‌కు క‌లిగే ప్ర‌యోజ‌నం త‌క్కువ‌గా ఉండ‌టం.. వివిధ రాష్ట్రాల నుంచి వ‌చ్చే ఇబ్బందులు ఎక్కువ‌గా ఉన్న‌ప్పుడు రాజ‌కీయంగా ఏపీ మీద ఆశ‌లు పెట్టుకోని మోడీ స‌ర్కారు పోల‌వ‌రం ప్రాజెక్టుకు చెక్ పెట్టేలా చేస్తుందనే చెప్పాలి. ఇందుకు త‌గ్గ‌ట్లే తాజా ప‌రిణామాలు చోటు చేసుకున్నాయ‌ని చెప్పాలి. ఇప్ప‌టికిప్పుడు ప్రాజెక్టును నిలిపివేయ‌టం కార‌ణంగా ప్రాజెక్టుకు.. దాన్ని న‌మ్ముకున్నత‌న‌కు.. ప్రాజెక్టు కార‌ణంగా బోలెడంత ప్ర‌యోజ‌నం క‌లిగే అవ‌కాశం ఉన్న‌ ఏపీ ప్ర‌జ‌ల‌కు జ‌రిగే న‌ష్టం గురించి గుక్క తిప్ప‌కుండా చెప్పుకొచ్చారు చంద్ర‌బాబు. ఆయ‌న మాట‌ల మ‌త్తులో ప‌డ‌కుండా.. ఆ మాట‌ల్నే ప్ర‌శ్న‌లుగా వేసుకుంటే బాబు ఆవేద‌న‌లో అస‌లు అర్థం ఇట్టే అవ‌గ‌త‌మ‌వుతుంది.

చంద్ర‌బాబు: ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రభుత్వం రూ.4 వేల కోట్లు ఖర్చు పెట్టింది. కేంద్రం లేఖతో ఈ ప్రాజెక్టు పనులు ఆలస్యమయ్యే పరిస్థితి ఏర్పడింది. నాలుగైదు నెలలు ఈ ప్రాజెక్టు జోలికెళ్లకపోతే చాలా నష్టం, నిర్మాణ వ్యయం పెరుగుతుంది.

సామాన్యుడి సందేహం: పోల‌వ‌రం ప్రాజెక్టు కేంద్రం నిర్మించేది. అలాంట‌ప్పుడు వారిచ్చిన నిధుల‌తో ప్రాజెక్టును నిర్మించాలి. అలా కాకుండా సొంత డ‌బ్బుల్ని ఎందుకు వెచ్చించిన‌ట్లు? ఈ ప్ర‌శ్న మ‌రింత బాగా అర్థం కావాలంటే.. మీ స్నేహితుడు డ‌బ్బులు ఇచ్చి ఒక ఇంటిని క‌ట్ట‌మ‌ని బాధ్య‌త అప్ప‌గించార‌నుకుందాం. స్నేహితుడితో భ‌విష్య‌త్తులో ఉండే ప్ర‌యోజ‌నాల దృష్ట్యా మీరు ఓకే అన్నార‌నుకోండి. ఇంటి నిర్మాణం కోసం స్నేహితుడు ఇచ్చిన డ‌బ్బుల కంటే ఎక్కువ ఖ‌ర్చు చేస్తారా? అది కూడా మీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న‌ప్పుడు? అలా చేస్తే స‌ద‌రు స్నేహితుడు ఏమ‌నుకుంటాడు? ఇప్పుడు అలాంటి ప‌నే బాబు చేశార‌ని చెప్పాలి.

చంద్ర‌బాబు: ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే రూ.12 వేల కోట్లు ఖర్చయ్యాయి. మరో రూ.42 వేల కోట్లు వెచ్చిస్తే ప్రాజెక్టు పూర్తవుతుంది. అంచనాలు పెరగడానికి కారణం భూసేకరణ వ్యయం పెరగడమే. రూ.9200 కోట్లు వ్యయం అవుతుంద‌నుకున్న భూసేకరణ, పునరావాస వ్యయం ఇప్పుడు రూ.32 వేల కోట్లకు చేరుకుంది. దానికి కారణం కేంద్రం తీసుకొచ్చిన భూ సేకరణ చట్టమే. అక్కడ నిర్వాసితుల సమస్య చాలా సున్నితమైంది.

సామాన్యుడి సందేహం: ఇప్పుడు ఇన్ని లెక్క‌లు చెబుతున్న చంద్ర‌బాబు.. మొద‌ట్నించి జ‌రిగింది జ‌రిగిన‌ట్లుగా ఎందుకు చెప్ప‌టం లేదు. ఈ రోజు ప్రాజెక్టు వ్యయం ఇంత భారీగా మారింద‌న్న మాట చెబుతున్న ఆయ‌న‌.. భూసేక‌ర‌ణ‌.. పున‌రాస వ్య‌యం ఇంత భారీగా పెర‌గ‌టాన్ని ఇంత స్పష్టంగా చెప్ప‌లేదు. కేంద్రంలోని మోడీ స‌ర్కారు ఒక ప్రాజెక్టు కోసం బాబు చెప్పినంత భారీగా ఖ‌ర్చు చేసేలా ఉన్నారా? ఇంత ఖ‌ర్చు చేసినా ఆ మైలేజీ మొత్తం బాబు ఖాతాలోకే వేసుకుంటాడ‌న్న‌ది వాస్తవం. పోల‌వ‌రం త‌న ఘ‌న‌త అని చెప్పుకునే చంద్ర‌బాబు.. లెక్క తేడా రాగానే మోడీని సీన్లోకి తెస్తున్నారు కానీ.. అంతా బాగుంటే.. మోడీ గురించి మాట మాత్రం చెప్పేవారా?

చంద్ర‌బాబు: దాదాపు 2 లక్షల మంది గిరిజనులు, 90 వేల గిరిజన కుటుంబాలకు పునరావాసం, పరిహారం కల్పించాలి. ఇంకా 60 వేల ఎకరాలు భూ సేకరణ చేయాలి. పెద్దఎత్తున ప్రాజెక్టు పనుల కోసం యంత్రాలు, కార్మికులు, ఏజెన్సీలను ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడు ఈ పనులు ఆగిపోతే వారంతా వెనక్కి వెళ్లిపోతారు. మళ్లీ వారు వచ్చి పనులు చేపట్టాలంటే చాలా ఆలస్యం అవుతుంది.

సామాన్యుడి సందేహం: ఒక పెద్ద ప‌ని పెట్టుకున్న‌ప్పుడు ప‌నులు చేయించే దాని మీద ఎంత జాగ్ర‌త్త‌గా ఉంటామో.. ఆ ప‌నులు జ‌ర‌గ‌టానికి అవ‌స‌ర‌మైన నిధులు ఇచ్చే పెద్ద మ‌నిషి మ‌న‌సు దోచుకోవ‌టానికి అంతే జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఆ విష‌యంలో బాబు ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నారో (అవ‌స‌రానికి మించి ఏపీని ప‌ణంగా పెట్టి) అంద‌రికి తెలిసిందే. అదే ఇప్పటి ప‌రిస్థితికి కార‌ణ‌మైంద‌ని చెప్పాలి.

చంద్ర‌బాబు: ఎన్ని రోజులు ప్రాజెక్టు ఆలస్యమైతే అన్ని వేలకోట్ల రూపాయల అధిక భారం పడుతుంది. దీనిపై మాట్లాడటానికి కేంద్ర‌మంత్రి నితిన్‌ గడ్కరిని కాంట్రాక్ట్ చేసే ప్ర‌య‌త్నం చేశా. ఆయ‌న లండ‌న్‌ లో ఉండ‌టంతో వీలు కాలేదు. ఆయ‌న్ను క‌లుస్తా.. విష‌యాల్ని చెబుతా.

సామాన్యుడి సందేహం: మాంత్రికుడి ప్రాణం చిలుక‌లో ఉంటే..పావురాన్ని ప‌ట్టుకుంటే ప్ర‌యోజ‌నం ఉంటుందా? పోల‌వ‌రం లాంటి పెద్ద విష‌యం మీద లెక్క తేడా వ‌చ్చిన‌ప్పుడు గ‌డ్క‌రీ కంటే ప్ర‌ధాని మోడీ కీల‌కం క‌దా? అయిన‌ప్ప‌టికీ ప్ర‌ధానిని వ‌దిలేసి మంత్రి గ‌డ్క‌రీ వైపు బాబు చూస్తున్నారు?.. ఆయ‌నతో మాట్లాడే ప్ర‌య‌త్నం చేస్తున్నారంటే.. ప్ర‌ధాని మోడీతో లెక్క‌లు తేడా వ‌చ్చాయనే క‌దా?

చంద్ర‌బాబు: ఏపీ బీజేపీ నేత‌ల‌ను ఢిల్లీకి వెళ్లి కేంద్రంతో మాట్లాడ‌మ‌ని చెప్పా. కొర్రీలు వేయ‌కుండా ప‌నులు జ‌రిగేలా చూడాల‌న్నా. అవ‌స‌ర‌మైతే ప్ర‌తిప‌క్షాన్ని కూడా దీనిపై ఢిల్లీకి ర‌మ్మ‌ని అడుగుతాం. మిత్ర‌ప‌క్షం కావ‌టంతో సంయ‌మ‌నంతో ఓపిగ్గా ఉన్నా. ప్రాజెక్టుకు స‌హ‌క‌రిస్తే ఫ‌లితం వ‌స్తుంది. లేదంటే క‌ష్టం మిగులుతుంది.

సామాన్యుడి సందేహం: క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు మిత్రులు.. ప్ర‌ధాన ప్ర‌తిపక్షం గుర్తుకు వచ్చేస్తుంది చంద్ర‌బాబుకు. పోల‌వ‌రం ఇష్యూలో ఇప్ప‌టివ‌ర‌కూ క్రెడిట్ అంతా త‌న‌దేనంటూ చెప్పుకునే చంద్ర‌బాబు.. కేంద్రం నుంచి మొట్టికాయ‌లు వేసే ఆదేశం రాగానే బీజేపీ.. విప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుకు రావ‌టం ఏమిటో? ఏపీ ప్ర‌యోజ‌నాలే ముఖ్య‌మ‌ని అనుకుంటే ముందు నుంచే క‌లిసి క‌ట్టుగా కృషి చేసి ఉంటే ఇవాళ ప‌రిస్థితి మ‌రోలా ఉండేది. బాగా జ‌రిగిన‌ప్పుడు అంతా త‌న‌దేన‌ని.. తేడా వ‌చ్చిన‌ప్పుడు మాత్రం ఎదుటోళ్ల‌ద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం అంత మంచిది కాదు. బాబు తాజామాట‌ల్లో అలాంటి ధోర‌ణే క‌నిపిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.