Begin typing your search above and press return to search.

తొలి ఫైట్..కాచుకో మోడీ అంటున్న బాబు..

By:  Tupaki Desk   |   9 Jun 2018 5:08 AM GMT
తొలి ఫైట్..కాచుకో మోడీ అంటున్న బాబు..
X
జూనియర్ పీఎం అయితే ఈ సీనియర్ తట్టుకోలేకపోయాడు. రాజధాని కూడా లేని రాష్ట్రం కోసం కాంప్రమైజ్ అయి పొగిడేశాడు. కానీ పాత పగలు మనసులో పెట్టుకున్న ప్రధాన మంత్రివర్యులు చంద్రబాబు అవకాశాన్ని చూసి ఆడుకున్నారు. ఇలా నాలుగేళ్ల కాపురం ముగిసి తెగతెంపులు అయ్యాక మరోసారి ఉప్పు చంద్రబాబు - నిప్పు మోడీలు కలుసుకోబోతున్నారు.. విడిపోయాక దుమ్మెత్తి పోసుకున్న ఈ ఇద్దరి భేటి రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.

ఈనెల 16న ఢిల్లీలో నీతి అయోగ్ సాధారణ మండలి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరు కాబోతున్నారు. ఎన్టీఏ నుంచి బయటకు వచ్చేశాక చంద్రబాబు.. బీజేపీతో కలిసి ఏ మీటింగ్ లోనూ పాల్గొనలేదు. ఎన్టీఏలో ఉన్నప్పుడు కూడా చివరి 6 నెలల్లో చంద్రబాబుకు అపాయింట్ మెంట్ కూడా ఇవ్వకుండా ప్రధాని మోడీ పొగపెట్టాడు. దీంతో 16న జరిగే సమావేశంలో ఇన్నాళ్లు సాఫ్ట్ గా వ్యవహరించిన చంద్రబాబు రెచ్చిపోయి ప్రధాని గాలి తీసేందుకు ప్లాన్ చేశారని తెలుస్తోంది.

నీతి అయోగ్ సమావేశంలో ఎన్నో లెక్కతేల్చాల్సిన అంశాలున్నాయి. కేంద్ర రాష్ట్రాల పన్నుల ఆదాయ పంపిణీ, రాష్ట్రాలకు గ్రాంట్లు విషయంలో నీతి అయోగ్ కు కేంద్రం ఇచ్చిన టీవోఆర్ పై పలు రాష్ట్రాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. సమాఖ్య స్ఫూర్తిని ఇది దెబ్బతిస్తోందని రాష్ట్రాలు మండిపడుతున్నాయి. నిధుల పంపిణీకి 1971 జనాభా లెక్కలను ఇన్నాళ్లు ప్రాతిపదికన నిర్ణయించారు. కానీ ఇప్పుడు మోడీ ప్రభుత్వం 2011 లెక్కలను పరిగణలోకి తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జనాభా నియంత్రణ చేసిన దక్షిణాది రాష్ట్రాలు కేంద్రం నిధుల్లో తక్కువ పొందుతుండగా.. జనాభా ఎక్కువున్న బీహార్, యూపీ సహా ఉత్తరాది రాష్ట్రాలు మెజార్టీ నిధులు తన్నుకుపోతున్నాయి..

ఇలాంటి విషయంలో ఇన్నాళ్లు మిత్రుడిగా ఉన్న చంద్రబాబు కిక్కురుమనకుండా ఏం మాట్లాడలేదు. ఇప్పుడు తాజాగా 16న జరిగే సమావేశంలో నిధులు విషయం సహా ఏపీకి అన్యాయంపై నీతి అయోగ్ లో ప్రధానిని నిలదీసేందుకు సిద్ధమైనట్లు తెలిసింది. ఇందుకోసం భారీగా లెక్కల పత్రాలను కూడా తనవెంట తీసుకెళుతున్నాడని సమాచారం . దీంతో ఇన్నాళ్లు దోస్తులుగా ఉన్న చంద్రబాబు-మోడీల మధ్య నీతి అయోగ్ ఫైట్ ఆసక్తికరంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.