Begin typing your search above and press return to search.

బాబు పరుగును అందుకోలేకపోతున్న తమ్ముళ్లు

By:  Tupaki Desk   |   26 April 2016 5:59 AM GMT
బాబు పరుగును అందుకోలేకపోతున్న తమ్ముళ్లు
X
ప్రతికూల పరిస్థితుల మధ్య ఏపీ సీఎంగా పాలన పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని ఎలాగైన అభివృద్ధి బాట పట్టించాలన్న లక్ష్యంతో పరుగులు తీస్తున్నారు. అయితే... ఆయన పరుగును బృంద సభ్యులు మాత్రం అందుకోలేకపోతున్నారు. ఆయన ఆలోచనలు - ఆకాంక్షలను అమలు చేయడంలో విఫలమవుతున్నారు. విభజన కారణంగా కష్టాల్లో కూరుకుపోయిన రాష్ట్రాన్ని బతికించడానికి చంద్రబాబే సమర్థుడున్నది చాలామంది అభిప్రాయం. ఆయన ఆలోచనలు కూడా అదే స్థాయిలో ఉంటున్నాయి. కానీ, ఆచరణలో మాత్రం ఇంతవరకు ఏమాత్రం ప్రగతి కనిపించడం లేదు. సరైన టీం లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. నిర్ణయాలను త్వరగా అమలు చేయలేకపోవడం.. అంశాలపై పట్టు లేకపోవడం... సొంతంగా ఏ పనీ చేయలేకపోవడం వంటి బలహీనతలు చాలామంది మంత్రుల్లో కనిపిస్తున్నాయి. ఇది తీవ్ర ప్రభావం చూపుతోంది.

విభజన తరువాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం సర్కార్‌ కు రెండు ప్రధాన సవాళ్ళు ఎదురయ్యాయి. ఒకటి రాష్ట్రానికి లోటు బడ్జెట్‌ - రెండో అంశం ఎన్నికల్లో ఓటర్లకు చేసిన వాగ్దానాలు. ఇందులో రైతు రుణ మాఫీ ప్రధానమైంది. ప్రభుత్వానికి ప్రతికూల పరిస్థితి వచ్చినప్పటికీ రైతు రుణమాఫీ పథకం అమలు చేసి చూపించారు చంద్రబాబు. ఇక పాదయాత్ర సమయంలో రాష్ట్ర సమస్యలను నిశితంగా అధ్యయనం చేసిన చంద్రబాబు రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం 7 మిషన్లు - ఐదు గ్రిడ్‌ లు ప్రకటించారు. కేవలం రైతు రుణ మాఫీ కాకుండా, పెన్షన్ల పెంపు - ఎన్టీఆర్‌ సుజల - ఎన్టీఆర్‌ ఆరోగ్య సేవలు - నిరంతర విద్యుత్‌ సరఫరా తదితర అంశాలకు ప్రాధాన్యతనిచ్చారు. అంతేకాక అవశేషాంధ్ర అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా 13 జిల్లాల సమగ్రాభివృద్ధికి ప్రణాళిక ప్రకటించారు. ఇందులో పారిశ్రామికీకరణ - ఓడరేవులు - విమానాశ్రయాలు - విద్యాసంస్థలు - వైద్యసంస్థలు - పర్యాటక కేంద్రాలు - మెగా ఐటీ హబ్‌ - ఫుడ్‌ పార్క్‌ లు టెక్స్‌ టైల్‌ పార్క్‌ - సాగునీటి ప్రాజెక్ట్‌ లు - ఉద్యానవన జోన్‌ లు - జలమార్గాల అభివృద్ధి తదితర అంశాలతోపాటు నీరు చెట్టు - పొలం పిలుస్తోంది - నాలెడ్జ్‌ హబ్‌ వంటి కార్యక్రమాలకు తమ విజన్‌ సాకారమవడానికి తగిన సమయం కూడా ప్రకటించారు. ఇంకో పక్క నదుల అనుసంధాన స్వప్నానికి సాకారంలో భాగంగా పట్టిసీమ ప్రాజెక్ట్‌ తో సాగు - జల వనరులకు నాంది పలికారు. పట్టీసీమ - తోటపల్లితో మొదలైన జలయజ్ఞం ముందుముందు మరింత ఊపందుకోనుంది. అయితే... ఏ పని చేపట్టినా చంద్రబాబు స్వయంగా ఇన్వాల్వ్ అయితే తప్ప అది అనుకున్నది అనుకున్న సమయంలో పూర్తి కావడం లేదు. అందుకు పట్టిసీమే ఉదాహరణే. చంద్రబాబు ప్రత్యేకంగా దానిపై కూర్చుంటే తప్ప అనుకున్న సమయానికి పనికాలేదు.

మరోవైపు విభజన తర్వాత కేంద్ర విభజన హామీలు అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంతో పాటు ప్రత్యేక హోదా - ప్రత్యేక ప్యాకేజీ విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్రం తీరు రాష్ట్ర పురోగతికి గొడ్డలిపెట్టుగా మారనుంది. అదే సమయంలో ప్రతిపక్షాలు కొనసాగిస్తున్న ఆందోళనలను తిప్పికొట్టడంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు సర్కార్‌ సమర్థతను ప్రజలకు వివరించడంలో వైఫల్యం చెందుతున్నాయి. కేంద్ర - రాష్ట్ర మంత్రులు - పార్లమెంట్‌ సభ్యులు - శాసనసభ్యులు - శాసనమండలి సభ్యులు - ఇంకా జిల్లా పరిషత్‌ చైర్మన్‌ లతో పాటు మండల స్థాయిలో వున్న ప్రజాప్రతినిధుల వరకు ప్రభుత్వ నిధులపై ఆధారపడి పనులు చేపట్టడంతో ఉత్సాహం చూపిస్తున్నారే తప్ప పార్టీ శాశ్వత ప్రయోజనాలకోసం దిగువ స్థాయి కార్యకర్తలతో కలిసి సమన్వయంగా పనిచేస్తున్న పరిస్థితులు లేవు. ఇది పార్టీకి - ప్రభుత్వానికి మధ్య దూరం పెంచే ప్రమాదముంది. చంద్రబాబు దీనిపై దృష్టి పెట్టకపోతే ఇబ్బందేనంటున్నారు రాజకీయ విశ్లేషకులు.