Begin typing your search above and press return to search.

బాబు చేజేతులా కొని తెచ్చుకున్న'శిల్పా'లివే

By:  Tupaki Desk   |   13 Jun 2017 7:47 AM GMT
బాబు చేజేతులా కొని తెచ్చుకున్నశిల్పాలివే
X
చేసుకున్నోడికి చేసుకున్నంత మ‌హ‌దేవ అని ఊరికే అన‌లేదు. స‌రిగ్గా ఇదే సామెత ఇప్పుడు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు వ‌ర్తిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల త‌ర్వాత అధికారాన్ని సొంతం చేసుకున్న ఆయ‌న‌.. తమ పార్టీ త‌ప్ప మ‌రే పార్టీ రాష్ట్రంలో బ‌లంగా ఉండ‌కూద‌న్న లక్ష్యంతో మొద‌లెట్టిన ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ ఇప్పుడు విక‌ర్ష్ గా మారుతోంది.

ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో బ‌ల‌మైన రెండు వ‌ర్గాల నేత‌ల్ని పార్టీలోకి ఆహ్వానించి.. కండువా క‌ప్పిన ఆయ‌న‌కు ఇప్పుడో పెద్ద త‌ల‌పోటుగా మారింది. ప‌వ‌ర్ చేతిలో ఉంటే ఏదైనా చేసేయొచ్చ‌న్న ఆలోచ‌న తప్ప‌ని నిరూపిత‌మ‌వుతోంది.

క‌ర్నూలు జిల్లా నంద్యాల నియోజ‌క‌వ‌ర్గానికి ప్రాతినిధ్యం వ‌హించే బ‌ల‌మైన నేత శిల్పా మోహ‌న్ రెడ్డి పార్టీలో ఉన్నా.. పార్టీని మ‌రింత బ‌లోపేతం చేయ‌టం.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌ను నామ‌రూపాల్లేకుండా చేయాల‌న్న ల‌క్ష్యంతో భూమాను పార్టీలోకి ఆహ్వానించి లేనిపోని స‌మ‌స్య‌ల్ని తెచ్చి పెట్టుకున్నారు. భూమా ఆక‌స్మిక మ‌ర‌ణంతో త్వ‌ర‌లో షెడ్యూల్ కానున్న నంద్యాల ఉప ఎన్నిక‌కు సీటు త‌మ‌కే ఇవ్వాల‌ని శిల్పా డిమాండ్ చేయ‌టం.. అందుకు బాబు నో అన‌టంతో ఆయ‌న పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇది పార్టీని తీవ్రంగా ప్ర‌భావితం చేస్తుంద‌ని చెబుతున్నారు.

భూమాను పార్టీలోకి ఆహ్వానించ‌టంతో బాబు ఏదైతే కోరుకున్నారో అది నెర‌వేర‌కుండా.. ఇప్పుడు శిల్ప రూపంలో కొత్త త‌ల‌నొప్పులు రావ‌టం పార్టీలో ఇప్పుడు ఆస‌క్తిక‌ర చ‌ర్చ‌కు తెర తీసింది. అత్యాశ‌తో లేని క‌ష్టాల్నికొని తెచ్చుకున్న‌ట్లుగా నేత‌ల్ని ఇష్టారాజ్యంగా పార్టీలోకి తీసేసుకొని.. ఇప్పుడు వారి మ‌ధ్య‌నున్న విభేదాల‌ను త‌గ్గించ‌లేక బాబు స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.

బాబు తీరుతో అసంతృప్తికి గురి అవుతున్న నేత‌లు ప‌లువురు.. ఇప్పుడు జ‌గ‌న్ పార్టీ వైపు చూస్తున్నారు. ఇదంతా జ‌గ‌న్ పార్టీ ఎమ్మెల్యేల్ని పార్టీలోకి ఆహ్వానించ‌టం వ‌ల్లే వ‌చ్చింద‌నేది స్ప‌ష్టం. బాబు ప‌రిస్థితి ఎలా ఉందంటే.. ఎవ‌రికో ఏదో చేయాల‌ని ప్లాన్ చేసిన బాబు.. ఇప్పుడు త‌న‌కు తానే ఇబ్బందుల్లో ప‌డిన వైనం క‌నిపిస్తోంది.

ఈ రోజు క‌ర్నూలు జిల్లాలో ఎలా అయితే శిల్పా ఎపిసోడ్ జ‌రిగిందో.. ఏపీలోని చాలా జిల్లాల్లో ఇలాంటి శిల్పాలు చాలామందే ఉన్నార‌న్న మాట వినిపిస్తోంది. రానున్న రోజుల్లో టికెట్ల పంపిణీలో కానీ ప‌ద‌వుల పంపిణీలో కానీ తేడాలు రావ‌టం ఖాయ‌మ‌ని.. అది జ‌రిగిన వెంట‌నే ఆయా నేత‌లు బాబుకు షాకిస్తూ నిర్ణ‌యాలు తీసుకోవ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.

క‌డ‌ప జిల్లాలో..

ఏపీ విప‌క్ష నేత జ‌గ‌న్ సొంత జిల్లా అయిన క‌డ‌ప‌లో టీడీపీకి అస్స‌లు బ‌లం లేదు. ఏదోలా జ‌గ‌న్ ను దెబ్బ తీయాల‌న్న ఉద్దేశంతో.. పార్టీలోకి ఆహ్వానించి ఆదినారాయ‌ణ‌రెడ్డికి మంత్రి ప‌ద‌వి ఇవ్వటంపై పార్టీలో ఎప్ప‌టి నుంచో ఉన్న రామ‌సుబ్బారెడ్డి వ‌ర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. అయితే.. రామ సుబ్బారెడ్డిని బుజ్జ‌గించేందుకు గ‌వ‌ర్న‌ర్ కోటాలో ఎమ్మెల్సీని చేసి విప్ ప‌ద‌విని ఇస్తామ‌ని.. అన్ని విష‌యాల్లో ఆదినారాయ‌ణ రెడ్డితో స‌మానంగా ప్రాధాన్య‌త ఇస్తామ‌ని బాబుహామీ ఇచ్చిన‌ప్ప‌టికీ సుబ్బారెడ్డికి ఉన్న అసంతృప్తి మాత్రం చ‌ల్లార‌టం లేదు. ఆయ‌న ఎన్ని రోజులు టీడీపీలో కొన‌సాగుతార‌న్న‌ది సందేహ‌మేన‌ని చెబుతున్నారు.

ప్ర‌కాశం జిల్లాలో..

ఈ జిల్లాలోని అద్దంకి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌.. ఎమ్మెల్సీ క‌ర‌ణం బ‌ల‌రాం వ‌ర్గాల మ‌ధ్య ఉన్న పంచాయితీ అంద‌రికి తెలిసిందే. వీరిద్ద‌రూ బాహాటంగా ఒక‌రినొక‌రు ఢీ అంటే ఢీ అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించ‌టం పార్టీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. పార్టీలో త‌గ్గుతున్న క్ర‌మ‌శిక్ష‌ణ‌కు వీరి ఉదంతాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెబుతుంటారు. వీరిద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రు పార్టీ నుంచి వెళ్లిపోవ‌టం ఖాయ‌మ‌ని చెబుతారు. గొట్టిపాటి పార్టీని వీడే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉన్నాయ‌ని చెబుతారు.

మ‌రో వైపు గిద్ద‌లూరు ఎమ్మెల్యే అశోక్ రెడ్డి.. టీడీపీ నేత అన్నె రాంబాబు మ‌ధ్య స‌ఖ్య‌త లేదు. వీరి మ‌ధ్య నెల‌కొన్న ర‌చ్చ కార‌ణంతో పార్టీ ఇమేజ్ భారీగా డ్యామేజ్ అవుతోంది.

కందుకూరులో ఎమ్మెల్యే పోతుల రామారావు.. దివి శివ‌రాంలు క‌లిసే ఉన్న‌ట్లు క‌నిపించినా వారి మ‌ధ్య విభేదాలు పార్టీని ఇబ్బంది పెట్టేలా మారుతున్నాయ‌ని చెబుతున్నారు.

అనంత‌పురం జిల్లాలో..

జిల్లాలోని క‌దిరి నియోజ‌క‌వ‌ర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వ‌హిస్తున్న చాంద్ బాషా.. కందికుంట వెంక‌ట ప్ర‌సాద్ లు ఎడ‌ముఖం పెడ‌ముఖం అన్న‌ట్లుగా ఉంటారు. వీరి మ‌ధ్య లోపించిన స‌యోధ్య‌తో పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ అంత‌కంత‌కూ త‌గ్గిపోతుంద‌ని చెబుతున్నారు.

నెల్లూరు జిల్లా..

జిల్లాలోని గూడూరులో ఎమ్మెల్యే సునీల్‌ కు బ‌ల్లి దుర్గా ప్ర‌సాద్‌ కు మ‌ధ్య నెల‌కొన్న విభేదాలు స‌మిసిపోతాయ‌న్న మాట చెబుతున్నా.. చేత‌ల్లో మాత్రం అలాంటివేవీ చోటు చేసుకోవ‌టం లేదంటున్నారు.

తూర్పుగోదావ‌రి జిల్లా..

జ‌గ్గంపేట నియోజ‌క‌వ‌ర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రుకు.. జ్యోతుల చంటిబాబు వ‌ర్గాల మ‌ధ్య వ‌ర్గ పోరు అంత‌కంత‌కూ పెరిగి పార్టీని ఇబ్బంది పెడుతోంది. అంతేకాదు కాకినాడ ఎంపీ తోట న‌ర‌సింహానికి మ‌రికొంద‌రు అధికార‌పక్ష ఎమ్మెల్యేల‌కూ మ‌ధ్య ర‌చ్చ న‌డుస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/