Begin typing your search above and press return to search.

స‌మ‌స్య‌ల సుడి గుండంలో చంద్ర‌బాబు

By:  Tupaki Desk   |   6 Sep 2016 10:54 AM GMT
స‌మ‌స్య‌ల సుడి గుండంలో చంద్ర‌బాబు
X
ఏపీ సీఎం చంద్ర‌బాబుకి అస్స‌లు నిద్ర ప‌ట్ట‌డం లేద‌ట‌! రాష్ట్రంలో ఉన్న సమ‌స్య‌లే ఆయ‌న‌కు త‌ల‌నొప్పిగా ఉంటే ఇప్పుడు కొత్త‌గా మ‌రికొన్ని స‌మ‌స్య‌లు చంద్ర‌బాబును సుడిగుండంలోకి నెట్టాయ‌ని వాపోతున్నారు టీడీపీ నేత‌లు. రాష్ట్ర విభ‌జ‌న నేప‌థ్యంలో ఏపీకి ప్ర‌త్యేక హోదా అంశం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. మొద‌టి నుంచి ఈ విష‌యాన్ని తొక్కిపెడుతూ వ‌చ్చిన కేంద్రం.. ఇప్పుడు కూడా స్ప‌ష్ట‌మైన వైఖ‌రి వెల్ల‌డించ‌డం లే దు. అయితే, హోదాపై మాత్రం కేంద్రం ఖచ్చిత‌మైన వైఖ‌రితో ఉన్న‌ద‌ని మాత్రం రుజువైంది. హోదాను ఎట్టిప‌రిస్థితిలోనూ ఇచ్చేదిలేద‌ని ఇప్ప‌టికే సిగ్న‌ల్స్ పంపింది. దీంతో ఇప్పుడు ఇదే విష‌యం ఏపీలో పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ఇది అధికార టీడీపీ అధినేత‌ - సీఎం చంద్ర‌బాబు మెడ‌కు చుట్టుకుంది. ఇటీవ‌ల కొన్ని వారాలుగా రాష్ట్రాన్ని ఈ అంశ‌మే షేక్ చేస్తోంది.

విప‌క్ష జ‌గ‌న్ పార్టీ స‌హా కాంగ్రెస్ నేత‌లు కూడా చంద్ర‌బాబు సెంట‌ర్‌ గా కామెంట్లు చేస్తున్నారు. కేంద్రంతో లాలూచీ ప‌డ్డార‌ని బాబు పై విరుచుకుప‌డ్డారు. ఇక‌, వీరికి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ తోడయ్యారు. ఇటీవ‌ల తిరుప‌తిలో స‌డెన్‌ గా నిర్వ‌హించిన స‌భ‌లో ప్ర‌త్యేక హోదాపై గ‌ళం వినిపించారు. ఇది కూడా చంద్ర‌బాబుకు ఇబ్బందిగానే ప‌రిణ‌మించింది. ఇదిలావుంటే, ఈ నెల 9న కాకినాడ‌లో ప‌వ‌న్ మ‌రోసారి బ‌హిరంగ స‌భ నిర్వ‌హిస్తున్నారు. దీనికి తెలుగువారి ఆత్మ గౌర‌వ స‌భ‌గా ఆయ‌న పేరు పెట్టారు. దీంతో ఇప్పుడు అంద‌రి దృష్టీ ఈ స‌భ‌ మీదే ప‌డింది. ఇప్ప‌టికే తిరుప‌తి స‌భ‌లో అటు బీజేపీని - ప‌రోక్షంగా టీడీపీ ఎంపీల‌ను ఏకేసిన ప‌వ‌న్... వ‌చ్చే బ‌హిరంగ స‌భ‌లో ఇంకెంత‌గా రెచ్చిపోతాడోన‌ని అనుకుంటున్నారు.

అయితే, ఈ సంద‌ర్భంగా టీడీపీని టార్గెట్ చేసే ఛాన్స్ ఉంద‌ని అంటున్నారు విశ్లేష‌కులు. ఇది కూడా చంద్ర‌బాబుకు తీవ్ర ఇబ్బందిక‌ర ప‌రిణామ‌మే. మిత్ర ప‌క్షంగా ఉన్న జ‌న‌సేన అధినేత ఏం మాట్లాడ‌తారోన‌ని ఆయ‌న కూడా ఎదురు చూస్తున్నారు. ఇంక మూడో స‌మ‌స్య అసెంబ్లీ స‌మావేశాలు. ఈ నెల 8 నుంచే ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు జ‌ర‌గ‌నున్నాయి. కేవ‌లం ఐదు రోజులే జ‌రుగుతాయ‌ని అంటున్నా.. ఈ ఐదు రోజులు ప్ర‌భుత్వాధినేత‌గా చంద్ర‌బాబు విప‌క్షాల విమ‌ర్శ‌ల‌ను త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మ‌నే భావంతో ఉన్నారు. ముఖ్యంగా ఏపీకి ప్ర‌త్యేక హోదాపైనే అసెంబ్లీలోనూ తాను ఇరుకున ప‌డ‌తాన‌ని ఆయ‌న అనుకుంటున్న‌ట్టు తెలిసింది.

దీంతో ప్ర‌త్యేక హోదా అంశం త‌న‌కు తీవ్ర ఇబ్బందిగా ప‌రిణ‌మించింద‌ని గుర్తించిన చంద్ర‌బాబు.. అసెంబ్లీ భేటీకి ఒక రోజు ముందే 7వ తారీకున ఢిల్లీ వెళ్లి దీనిపై కేంద్రం పెద్ద‌ల‌తో చర్చించాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలిసింది. ప్ర‌త్యేక హోదాపై అన్ని ప‌క్షాలూ త‌మ‌ను ఇరుకున పెడుతున్న విష‌యాన్ని ఆయ‌న కేంద్రానికి వినిపించే అవ‌కాశం ఉంది. అదేస‌మ‌యంలో ఏవిధంగా విప‌క్షాలు స‌హా మిత్ర‌ప‌క్షం జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ కు దీటుగా స‌మాధానం ఇవ్వాల‌నే విష‌యంపైనా చంద్ర‌బాబు - ఆయ‌న మంత్రి వ‌ర్గం ఇప్ప‌టికే ఓ స్కెచ్ సిద్ధం చేసుకున్న‌ట్టు తెలిసింది. ఏదేమైనా.. ప్ర‌స్తుతం మాత్రం చంద్ర‌బాబు సుడిగుండంలో చిక్కుకున్నార‌నేది వాస్త‌వం!