Begin typing your search above and press return to search.

బాబు ఆఖ‌రి ప్ర‌య‌త్నం విఫ‌లం..పార్టీకి ఎమ్మెల్యే గుడ్‌ బై

By:  Tupaki Desk   |   5 Feb 2019 6:06 PM GMT
బాబు ఆఖ‌రి ప్ర‌య‌త్నం విఫ‌లం..పార్టీకి ఎమ్మెల్యే గుడ్‌ బై
X
తెలుగుదేశం పార్టీకి షాక్ ఖాయ‌మైంది. అధికార పార్టీ ఎమ్మెల్యే త‌న ప‌ద‌విని - పార్టీని వదిలేయనున్నారు. ఆ నాయ‌కుడే చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌. టీడీపీని వీడాల‌ని నిర్ణ‌యం తీసుకున్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్ మంగళవారం రాత్రికి హైదరాబాద్‌ చేరుకుని... బుధవారం వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డిని ఆయన కలవనున్నారని.. ఆ తర్వాత ఆమంచి వైసీపీలో చేరతారనే వార్తలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. అయితే, ఈ న‌ష్టాన్ని పూడ్చుకునేందుకు టీడీపీ అధ్య‌క్షుడు - ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు చేసిన ఆఖ‌రి ప్ర‌య‌త్నం విఫ‌లం అయింది.

తెలుగుదేశం పార్టీ ప‌ట్ల తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఆమంచి కృష్ణ‌మోహ‌న్ ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం పందిళ్లపల్లిలో కార్యకర్తలతో స‌మావేశ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ భేటీ ఆయ‌న పార్టీ మారేందుకేన‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఇలా ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ మోహన్ సమావేశమై పార్టీ మారే విషయంలో కార్యకర్తల అభిప్రాయం సేకరిస్తుండగా ఆమంచి కృష్ణమోహన్‌ ను బుజ్జగించేందుకు మంత్రి శిద్దా రాఘవరావును టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రంగంలోకి దించారు. దీంతో కార్య‌క‌ర్త‌ల స‌మావేశం స‌మ‌యంలో ఆమంచిని కలిసిన మంత్రి శిద్దా రాఘవరావు.. తెలుగుదేశం పార్టీలో కొనసాగాలని కోరారు. ఈ సందర్భంగా పార్టీలో తనకు ఎదురైన ఇబ్బందులను శిద్దా రాఘవరావు దృష్టికి ఆమంచి తీసుకెళ్లారు. అనంతరం సీఎం చంద్రబాబుతో మంత్రి శిద్దా రాఘవరావు ఫోన్లో మాట్లాడినట్టు తెలుస్తోంది. అయితే, చర్చల తర్వాత కూడా ఆమంచిలో ఎలాంటి మార్పు కనిపించకపోగా తన అనుచరులతో సమావేశం కొనసాగిస్తున్నారు. ఆమంచి వైసీపీలో చేరడం ఖాయమని అంటున్నారు.

ఏపీ పాలిటిక్స్‌లో హాట్ టాఫిక్‌ గా మారిన ఆమంచి పార్టీ వీడ‌టం అంశం తెలుగుదేశం పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని ప‌లువురు విశ్లేషిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మీపిస్తున్న స‌మ‌యంలో అధికార పార్టీని వీడిన మూడో ఎమ్మెల్యేగా ఆమంచి నిల‌వ‌నున్నారు. మాజీమంత్రి రావెల కిశోర్‌ బాబు - ఎమ్మెల్యే మేడా మ‌ల్లిఖార్జున్ రెడ్డి త‌ర్వాత మూడో వ్య‌క్తిగా ఆమంచి నిలుస్తున్నారు. రావెల జ‌న‌సేన‌లో చేర‌గా మ‌ల్లిఖార్జున్ రెడ్డి వైసీపీ కండువా క‌ప్పుకున్నారు. ఆమంచి సైతం అదే దారిలో ఉన్న‌ట్లు టాక్‌.