Begin typing your search above and press return to search.

సీఐఐ సాక్షిగా బాబు ప‌రువుపోయిందా?

By:  Tupaki Desk   |   28 Jan 2017 8:03 AM GMT
సీఐఐ సాక్షిగా బాబు ప‌రువుపోయిందా?
X
భారీ ఏర్పాట్లు... హంగు ఆర్భాటాలు..పాశ్చాత్య దేశాల నుంచి వందలాది మంది ప్రముఖులు.. స్వదేశం నుంచి అంతకు మించి పారిశ్రామిక - వాణిజ్య ప్రతినిధులు.. వీరిలో చాలామంది అత్యున్నత స్థానాల్లో ఉన్న వారు హాజ‌రవుతున్నారు. కోట్ల రూపాయిల ఖర్చుతో లక్షల కోట్లు పెట్టుబడుల వెల్లువ అంటూ కార్పొరేట్‌ ప్రచారాలు... ప్రస్తుతం విశాఖపట్నంలో సీఐఐ భాగస్వామ్య సదస్సు ప‌రిచ‌య‌డం ఇది. ఇలాంటి అత్యున్న‌త స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యే వారికోసం ఏర్పాట్లు ఎంత సౌకర్యవంతంగా - విస్తృతంగా ఉండాలి!.. కానీ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటూ నిర్వహిస్తున్న సీఐఐ సదస్సులో ఆ అంశాన్ని నిర్వాహకులు - అధికారులు విస్మరించినట్టు కనిపిస్తోంది. ఏకంగా ప‌రిపాల‌న అనుభ‌వ‌జ్ఞుడు అని చెప్పుకొనే బాబు ఏలుబ‌డిలో మూత్ర‌శాల‌ల‌కు దిక్కులేకుండా పోయింది. సదస్సు కోసం ఆర్భాటంగా ఏర్పాట్లు చేసిన అధికారులు మౌలిక వసతుల గురించి మరిచిపోయినట్టు అనిపిస్తోంది. కనీసం టాయిలెట్లు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయాలన్న ఆలోచన లేకపోవడంతో సదస్సుకు హాజరైన ప్రతినిధులు - ముఖ్యంగా మహిళలు నానా అవస్థలు పడాల్సి వచ్చింది. తాగునీరు - టాయిలెట్లు కొరవడ్డ పరిస్థితి కొట్టొచ్చినట్టు కనిపించింది.

సీఐఐ స‌మ్మిట్ సంద‌ర్భంగా వేదిక‌ను అట్ట‌హాసంగా తీర్చిదిద్దారు. కార్య‌క్ర‌మ వేదిక‌లో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కట్టడాలను అందంగా తీర్చిదిద్దడంపై ఉన్న శ్రద్ధను అధికారులు టాయిలెట్లు - తాగునీరు ఏర్పాటు చేయడంలో పెట్టలేదు. వచ్చిన రెండు వేలకు పైగా అతిథులకు కేవలం రెండు, మూడు చోట్ల మాత్రమే టాయిలెట్లు ఏర్పాటు చేశారు. మహిళల కోసమైతే ఒకే ఒక్క చోట టాయిలెట్ ఉండ‌టం నిర్వాహ‌కుల ప‌నితీరుకు గొప్ప‌త‌నం. ఆఖ‌రికి రాష్ట్ర మంత్రులతో పాటు విదేశీ ప్రముఖులు కూడా టాయిలెట్ల వద్ద లైన్లలో వేచి ఉండాల్సి వచ్చింది. ఇక మిగతా వారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది. సభ నిర్వహణలో భాగమైన కార్మికులు - జిల్లా అధికారులతో సహా అందరూ సదస్సు నుంచి బయటకు వెళ్లి కాలకృత్యాలు తీర్చుకోవాల్సిన పరిస్ధితి తలెత్తింది. ఇక టాయిలెట్లలో లోపలి గడియలు కూడా లేవు. దీంతో ఒకరు లోనికి వెళితే బయట ఒకరు కాపలా ఉంటున్నారు. మధ్యాహ్నం నీరు లేదంటూ దాదాపు రెండు గంటల పాటు టాయిలెట్లు మూసేశారు. మధ్యాహ్న భోజనాల సమయంలో నీరు లేకపోవడంతో అతిథులు చాలా అవస్థలు పడాల్సి వచ్చింది. గత సదస్సుతో పోల్చితే ఈ సదస్సు మరీ వెలవెలబోయింది.

ఇక అసౌకర్యాల నేపథ్యంలో అతిథులు ఎక్కువ సమయం ప్రాంగణంలో ఉండలేక అతిథి గృహాలకు, నగర పర్యటనకు వెళ్లిపోవడంతో సదస్సులో హాజరు పల్చగా కనిపించింది. కనీసం అతిథులకు సౌకర్యాలు అందుతున్నాయో లేదో, వారికైమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయోనని పట్టించుకునేవారు కూడా అక్కడ ఒక్కరూ కనిపించలేదు. స్వచ్ఛ భారత్‌ లో గతేడాది దేశంలోనే ఐదో స్థానంలో నిలిచిన విశాఖలో అంతర్జాతీయ సదస్సు జరుగుతుంటే మౌలిక సదుపాయాల గురించి పట్టించుకోకపోవడం విమర్శలకు గురయింది. అంత‌ర్జాతీయ స‌ద‌స్సు అంటూ ఊద‌ర‌గొట్టి అధ్వాన ఏర్ప‌ట్లు చేశారంటూ ప‌లువురు బ‌హిరంగంగానే గొణుక్కున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/