Begin typing your search above and press return to search.

ఇది బాబు అసమర్థతకు చిహ్నం కాదా?

By:  Tupaki Desk   |   1 April 2018 6:27 AM GMT
ఇది బాబు అసమర్థతకు చిహ్నం కాదా?
X
కొండంత రాగం తీసి లొల్లాయి పాట పాడడం అంటే ఇదే. తానేదో జాతిని ఉద్ధరించేస్తున్నంత బిల్డప్ ఇచ్చి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. అసలు ప్రత్యేకహోదా అనేదే జిందా తిలిస్మాత్ కాదంటూ.. కొన్ని సంవత్సరాల పాటూ.. ఏపీ ప్రజలను వంచించిన నాయకుడు.. చివరికి అఖిలపక్షం అనేది సర్వరోగనివారిణి జిందా తిలిస్మాత్ అయినట్లుగా (అది తన ఐడియా అయినట్లుగా) దానిని గురించి కొన్ని వారాలుగా పదేపదే ఊదరగొట్టాడు. ఇదిగో అఖిలపక్షం.. అదిగో అఖిలపక్షం అంటూ.. చాలాకాలంగా ఊరించి.. ఎట్టకేలకు గత వారం నిర్వహించారు.

అఖిలపక్షం అనేది చంద్రబాబు సొంత ఐడియా ఎంత మాత్రమూ కాదు. రాష్ట్రానికి హోదా రావాలంటే.. ఇలాంటి ఉమ్మడి సమైక్య ప్రయత్నం జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. గత నాలుగేళ్లుగా చెబుతూనే వస్తోంది. కానీ చంద్రబాబునాయుడు చెవికి ఆ హితవాక్యములు ఎక్కలేదు. ఇన్నాళ్లూ పట్టించుకోకుండా ఉండిపోయిన ఆయన.. ఇప్పుడు ఎన్నికల సంవత్సరం వచ్చేసిన తర్వాత.. వెనక్కి తిరిగి చూసుకుంటే.. తన ఖాతాలో వైఫల్యాలు తప్ప.. విజయాలు ఏమీ కనిపించడం లేదనే భయంతో.. వైఫల్యాల విషయంలో రాష్ట్రంలో అందరమూ కలిసే పనిచేస్తున్నాం అనే ముద్రకోసం ఈ పన్నాగం పన్నారు. కానీ.. ఈ కుయుక్తికి వైకాపా - భాజపా - జనసేన దూరంగా ఉండిపోయాయి.

కేవలం ఉద్యోగ సంఘాలు - వామపక్షాలతో నిర్వహించిన సమావేశంలో చంద్రబాబు చేసిన ప్రతిపాదనలు మరీ ఘోరంగా ఉన్నాయని ఛీత్కరించుకుని.. అఖిలపక్షం అనే ప్రతిపాదనకు జెల్లకొట్టి.. ఎర్ర పార్టీలు ‘మా పోరాటం మాదే’ అని ప్రకటించుకుని వెళ్లిపోయాయి.

చంద్రబాబు మరోసారి అఖిలపక్షం నిర్వహించడానికి కూడా ప్రయత్నించారు గానీ.. అందుకు అనుకూలంగా ఏ పార్టీ కూడా స్పందించలేదు. ఆ రకంగా సమష్టి ప్రయోజనాల్ని ఆశించే స్ఫూర్తితో కాకుండా.. స్వప్రయోజనాల లక్ష్యంతో ఏర్పాటుచేసిన అఖిలపక్షం మంటగలిసిపోయింది. ఇప్పుడు చంద్రబాబునాయుడు ‘ఒంటరి’గా ఢిల్లీ వెళ్లి అన్ని పార్టీల నేతలతో మాట్లాడి రాష్ట్రానికి న్యాయం చేస్తా అంటున్నారు. అన్ని పార్టీలను తీసుకువెళ్లడానికి ఆయన వ్యవహారసరళిని ఎవ్వరూ నమ్మకపోవడం వల్ల వీలు కావడం లేదు. అయితే.. ఇలా అధికార పార్టీగా ఉండికూడా.. కనీసం అఖిలపక్షాన్ని సమన్వయంతో రూపుదిద్దలేకపోవడం.. చంద్రబాబు అసమర్థతకు చిహ్నమే అనే విమర్శలు బహుధా వినిపిస్తున్నాయి.