Begin typing your search above and press return to search.
బాబు దీక్ష..ఏపీ ఖజనా చమురు వదులుతోంది
By: Tupaki Desk | 19 April 2018 5:30 PM GMTఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నోరెత్తితే చెప్పే మాట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థిక కష్టాల్లో ఉందని....కేంద్రం సహకరించడం లేదని..అందుకే పొదుపుగా ముందుకు సాగుతున్నామని... అయితే ఇన్ని మాటలు చెప్పే చంద్రబాబు అవకాశం దొరికితే నిధులు దుబార చేయడంలో ముందుంటారనే అపప్రద ఉంది. ప్రత్యేక ఫ్లైట్లు, అట్టహాసంగా సదస్సులు పెట్టడంతో బాబు ఈ నిందారోపణను భరించాల్సి వస్తోంది. ఇప్పుడు అదే రీతిలో ప్రత్యేక హోదా పోరులో తన గ్రాఫ్ పెంచుకునేందుకు చేపడుతున్న ధర్మదీక్ష ఏపీ ఖజానా చమురు వదిల్చేలా ఉందని పలువురు భగ్గుమంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా డిమాండ్‌తోపాటు రాష్ట్ర విభజన బిల్లులోని హామీలని నెరవేర్చాల్సిందిగా కోరుతూ కేంద్రానికి వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దీక్షకు సర్కారు చమురు వదులుతోందని, ప్రభుత్వ పాలన స్తంభిస్తుందని తెలుస్తోంది. టీడీపీ శ్రేణులందరినీ దింపుతున్నందున రెవెన్యూ - పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. భారీగా జనసమీకరణ చేయాలని సిద్ధమై..డ్వాక్రా మహిళలను - ప్రైవేటు కళాశాలల నుంచి విద్యార్థులను దీక్షాస్థలికి తరలించేందుకు ఆదేశాలు ఇచ్చారు. ఈ క్రమంలో 200 ఆర్టీసీ బస్సులు - 100 ప్రైవేటు బస్సులను ప్రభుత్వం సిద్ధం చేసింది. అన్ని జిల్లాల కేంద్రాల్లో ప్రభుత్వ నిధులతోనే ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు దీక్షలు సాగిస్తున్నారు. వీటితో పాటు మీడియాలో ప్రకటనలు, పబ్లిసిటీ కోసం చేసే మొత్తం ఖర్చులు కలిపి ఖజానా నుంచి ప్రభుత్వ దీక్షల కోసం 20 కోట్ల రూపాయలు ఖర్చు అవుతోందని సమాచారం. ఈ మొత్తంలో సుమారు 4-5 కోట్లు రాష్ట్ర ప్రభుత్వ సొమ్ము అని, వివిధ శాఖల ద్వారా ఈ మొత్తాన్ని ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది.ఇంత పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడంపై ప్రభుత్వ వర్గాల్లోనే విస్మయం వ్యక్తమవుతోంది.
కేంద్రంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసేందుకు అంటూ బాబు చేస్తున్న దీక్షను పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీక్ష పర్యవేక్షణను కళావెంకట్రావ్ నేతృత్వంలో ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం పరిశీలిస్తోంది. ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా జరుగుతున్న 'ధర్మపోరాట దీక్ష' నిర్వహణకు ఆయా శాఖల అధికారులకు మంత్రుల ఉప సంఘం దిశానిర్దేశం చేసింది. ఇక దీక్ష వేదిక వద్ద రెండు వేదికలు ఏర్పాటు చేస్తున్నారు. ఒకదానిపై సీఎం చంద్రబాబు దీక్షకు కూర్చుంటే.. మరో వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారని అధికారులు తెలిపారు. దీక్ష జరుగుతున్నంత సేపు భోజనాలు - మజ్జిగ - మంచినీళ్లు - కూల్ డ్రింక్స్ పంపిణీ చేయాలని ఇప్పటికే ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయని తెలుస్తోంది. అలాగే వేదికగా ఎదురుగా 10 వేల మంది సభికులు ఆశీనులయ్యేలా కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సభా స్థలితో పాటు స్టేడియం బయట కూడా ఎల్ ఈడీ స్క్రిన్లను ఏర్పాటు చేస్తున్నారు. అఖిలపక్ష పార్టీలు బంద్ చేస్తే ఆగ్రహం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పుడు ఆర్భాటంగా దీక్ష చేయడం ఏమిటని పలువురు చర్చించుకుంటున్నారు.