Begin typing your search above and press return to search.

చంద్రబాబుకు ఇక సీటు కింద కుంపటే

By:  Tupaki Desk   |   12 March 2017 1:19 PM IST
చంద్రబాబుకు ఇక సీటు కింద కుంపటే
X
ఉత్తరప్రదేశ్‌ను గెలిచిన ఊపుతో ఏపీలో పాగా వేసేందుకు బీజేపీ పెద్దలు ప్రయత్నిస్తారని ఏపీ సీఎం - టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆందోళన మొదలైందట. మోడీ కనుక ఏపీపై పూర్తి స్థాయిలో కన్నేస్తే ప్రస్తుత పరిస్థితుల్లో తట్టుకోవడం కష్టమని ఆయన తెగ కంగారు పడుతున్నారట. ప్రస్తుత పరిస్థితుల్లో మోడీని వదల్లేక.. ఆయనతో కొనసాగలేక ఏం చేయాలో తెలియక చంద్రబాబు తెగ టెన్షన్ పడుతున్నారట.

ఏపీలో బీజేపీ పూర్తి స్థాయిలో విస్తరించాలన్న ఆలోచనకు వస్తే మొట్టమొదటగా టార్గెట్ చేసేది టీడీపీనే. ప్రస్తుతం వైసీపీ ఓటు బ్యాంకులో అధిక శాతం బీజేపీ వ్యతిరేక భావాలున్న వర్గాలే ఉన్నాయి. ఎస్సీఎస్టీలు మొదటి నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఏపీలో కాంగ్రెస్‌ పూర్తిగా ధ్వంసమైపోవడంతో మైనార్టీ - ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంకు వైసీపీకి బదిలీ అయింది. వారిని తమవైపు తిప్పుకోవడం అంత సులభం కాదు కాబట్టి బీజేపీ వైసీపీ ఓటు బ్యాంకు జోలికి పోనే పోదు. పైగా వైసీపీని బలహీనపరిస్తే ప్రత్యామ్నాయంగా ఆ స్థానంలో కాంగ్రెస్‌ తిరిగి పుంజుకునే అవకాశం ఉంటుంది. అది జరిగితే జాతీయ స్థాయిలో బీజేపీకి ఇబ్బంది అవుతుంది. సో... ప్రాంతీయ పార్టీ అయిన టీడీపీ స్థానాన్ని ఆక్రమిస్తే తమకు కొన్నాళ్ల పాటు తిరుగు ఉండదన్నది బీజేపీ ఆలోచన. ఈ లెక్క చంద్రబాబుకు ఇప్పటికే బాగా అర్థమవడంతో ఆయనలో టెన్షన్ మొదలైందట. ఎప్పటికైనా ఇలాంటి పరిస్థితులు వస్తాయన్న భయంతో చంద్రబాబు యూపీలో బీజేపీ గెలవకూడదని మనసులో కోరుకున్నా ఆయన కోరిక మాత్రం తీరలేదు. బీజేపీ బంపర్ మెజార్టీతో గెలవడంతో చంద్రబాబు మెడపై మోడీ కత్తి వేలాడుతోంది.

నిజానికి చంద్రబాబు అంత తేలిగ్గా లొంగే మనిషి కాకపోయినా ఆయనపై ఉన్న కేసులు ఆయన్ను నోరెత్తనివ్వకుండా చేస్తున్నాయి. ఓటుకు నోటు కేసుతో పాటు, 18 కేసుల్లో చంద్రబాబుపై స్టేలు కొనసాగుతుండడంతో చంద్రబాబును కట్టడి చేయడం బీజేపీకి సులువైన పనే. బీజేపీతో తెగతెంపులు చేసుకుంటే ఈ కేసులు బిగుసుకునే ప్రమాదముంది. అంతేకాదు.. కొత్త రాష్ట్రానికి కేంద్రం సాయం కూడా ఉండదు. సో... బీజేపీ తమ కుర్చీ కింద కుంపటి పెడుతున్నా ఆ పార్టీతోనే కొనసాగిల్సిన పరిస్తితి చంద్రబాబుది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/