Begin typing your search above and press return to search.

బాబు ఇష్టంతో చేసిన ప‌నే బీపీ పెంచేస్తోంద‌ట‌

By:  Tupaki Desk   |   29 July 2017 6:24 AM GMT
బాబు ఇష్టంతో చేసిన ప‌నే బీపీ పెంచేస్తోంద‌ట‌
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో తెలంగాణ సీఎం కేసీఆర్ స‌మావేశం త‌ర్వాత టీడీపీ అధినేత - సీఎం చంద్రబాబునాయుడులో కొత్త టెన్ష‌న్ మొద‌లైంద‌ని అంటున్నారు. మోడీతో స‌మావేశం త‌ర్వాత తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన ప్ర‌క‌ట‌న బాబుకు కొత్త ఆందోళ‌న‌కు కారణంగా మారింద‌ని రాజ‌కీయవ‌ర్గాల్లో చ‌ర్చ సాగుతోంది. ప్ర‌ధానమంత్రితో స‌మావేశం త‌ర్వాత సీఎం కేసీఆర్ స‌మావేశం అవుతూ అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం సుముఖంగా లేదని స్వయంగా ప్రకటించారు. దీంతో తెలుగుదేశంలో కొనసాగుతున్న కొత్త-పాత నేతల్లో అయోమయం, తమ రాజకీయ భవితవ్యంపై గందరగోళం మొదలయింది. త‌ద్వారా పార్టీ నేత‌ల్లో సాగుతున్న చ‌ర్చ బాబుకు బీపీ పెంచేస్తోంద‌ని అంటున్నారు.

అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల సీట్ల పెంపు విష‌యంపై భారీగా ఆశ‌లు పెట్టుకున్న ఏపీ సీఎం చంద్రబాబు ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష‌మైన‌ వైసీపీ నుంచి ఎమ్మెల్యేల‌ను పార్టీ ఫిరాయింపుల‌కు ప్రోత్స‌హించారు. దాదాపుగా 20 మంది ఎమ్మెల్యేలతోపాటు, కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆనం బ్రదర్స్ వంటి సీనియర్లకు వచ్చే ఎన్నికల్లో ఫలానా నియోజకవర్గం కేటాయిస్తామని, నియోజకవర్గాల సంఖ్య పెరుగుతున్నందున రాజకీయ భవిష్యత్తుపై బెంగ పెట్టుకోవలసిన పనిలేదని, పార్టీలో చేరేముందు వారికి బాబు భరోసా ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, ఇప్పుడు ఆ ఆశలు నీరుగారిపోయి ఇప్పట్లో నియోజకవర్గాల సంఖ్య పెరగవని తేలిపోవడంతో వైసీపీ నుంచి చేరిన ఎమ్మెల్యేల్లో ఆందోళన మొదలయింది. సదరు ఎమ్మెల్యేలు టీడీపీలో చేరే సమయానికి, అప్పటికే నియోజకవర్గ ఇన్ చార్జులుగా ఉన్న టీడీపీ సీనియర్లతో ఇంకా వైరం కొనసాగుతూనే ఉంది.

మ‌రోవైపు వైసీపీ నుంచి చేరిన వారితో కలసి సమన్వయంతో పనిచేసుకోవాలని, బాబు ఎన్నిసార్లు ఆదేశించినా ఎవరూ ఖాతరు చేయడం లేదు. అక్కడికీ సమస్యాత్మకంగా మారిన కరణం బలరాం, పోతుల సునీత (ప్రకాశం), రామసుబ్బారెడ్డి (కడప) వంటి నేతలకు ఎమ్మెల్సీ, కేఈ ప్రభాకర్‌కు కార్పొరేషన్ చైర్మన్ పదవులిచ్చి సర్దుబాటు చేసినా, అవేమీ ఫలించిన దాఖలాలు కనిపించలేదు. ఎమ్మెల్సీ ఇచ్చిన తర్వాత కూడా వైసీపీ నుంచి చేరిన గొట్టిపాటి రవితో కరణం బలరామ్, జమ్మలమడుగులో వైసీపీ నుంచి చేరిన మంత్రి ఆదినారాయణరెడ్డితో రామసుబ్బారెడ్డికి ఇంకా వైరం కొనసాగుతూనే ఉంది. వచ్చే ఎన్నికల్లో సీట్లు పెరుగుతున్నందున, కొత్తగా ఏర్పడే నియోజకవర్గం నుంచి అవకాశం కల్పిస్తామని కరణం వెంకటేష్, రామసుబ్బారెడ్డి వంటి నేతలకు టీడీపీ అధిష్ఠానం హామీ ఇచ్చింది. ప్రకాశం జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల చేరిక వల్ల నష్టపోయిన మాజీ ఎమ్మెల్యేలు రాంబాబు, దివి శివరాంకూ నాయకత్వం ఇలాంటి హామీనే ఇచ్చింది. ఇప్పుడు అలాంటి అవకాశం లేకపోవడంతో, పార్టీలో చేరిన వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు, వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే స్థానాలపై ఆశలు పెట్టుకున్న పార్టీ సీనియర్లకు ఎక్కడ స్థానం కల్పించాలో తెలియక టిడిపి నాయకత్వం కొత్త సమస్యల్లో పడింది. ఇకపై పార్టీ నాయకత్వానికి సర్దుబాటు సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వ‌ర్గాల్లో చర్చ జరుగుతోంది.

పునర్విభజన జరగకపోతే వచ్చే ఎన్నికల్లో గెలవలేమన్నట్లు పార్టీ వ్యవహారశైలి కనిపించిందని, ఇప్పుడు సీట్ల పెంపు లేదని తెలిసిన తర్వాత తలపట్టుకుందని వివరించారు. ఒకరకంగా ఇది పార్టీ మంచికేనని మెజారిటీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పుడు నిజంగా పార్టీలో కొనసాగేదెవరు? సీట్ల కోసం వచ్చిన వారెవరన్నది తేలిపోతుందని చెబుతున్నారు. సీట్ల కోసం వచ్చిన వారెవరూ పార్టీలో ఉండరని, వైసీపీలో చోటు లేని వారు గత్యంతరం లేక కొనసాగుతారని, జనసేనలో భవిష్యత్తు చూసుకునే వారు కొనసాగబోరని విశ్లేషిస్తున్నారు. అసలు సొంత పార్టీని బలోపేతం చేసుకోకుండా, ఉన్న పార్టీ నేతల భవిష్యత్తును తీర్చిదిద్దకుండా, ఒకపార్టీని బలహీనం చేసి దాని ద్వారా తమ పార్టీని బలోపేతం చేసుకునే విధానమే మంచిదికాదంటున్నారు. ఈ విషయం తమ నాయకత్వానికి ఇప్పటికైనా తెలిసి ఉండాలని అంటున్నారు.