Begin typing your search above and press return to search.

హోదా స్థానే ప్యాకేజీ దిశగా అడుగులు..?

By:  Tupaki Desk   |   13 Aug 2015 4:18 AM GMT
హోదా స్థానే ప్యాకేజీ దిశగా అడుగులు..?
X
విభజన సందర్భంగా ఏపీకి ఇచ్చిన ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం తన పట్టుదలను కొనసాగిస్తోంది. ఏపీలో తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. ప్రధాని మోడీతో సహా పలువురు కేంద్రమంత్రులతో ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ప్రత్యేక హోదా విషయంలో రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలపై బాబు వివరించినట్లు చెబుతున్నారు.

ఏపీ ప్రత్యేక హోదా విషయంలో ఏ మాత్రం తేడా వచ్చినా.. తామిద్దరం మునిగిపోతామని.. విపక్షాలు బలోపేతం కావటం ఖాయమన్న విషయాన్ని కేంద్రానికి అర్థమయ్యేలా బాబు చెప్పారంటున్నారు. ప్రత్యేకహోదా అంశం ఏపీలో భావోద్వేగ అంశంగా మారిందని.. కేంద్రం తమను పట్టించుకోవటం లేదని.. తమ సమస్యల పరిష్కారం కోసం గతంలో ఇచ్చిన హామీల విషయంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందన్న భావన ఏపీలో పెరుగుతోందని.. అదే జరిగితే ఏపీలో తమకు ఎదురుగాలి వీయటం ఖాయమన్న వాదన వినిపించినట్లు చెబుతున్నారు.

అయితే.. ఈ వాదనపై బీజేపీ ప్రముఖులు అంగీకరిస్తూనే.. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో మాత్రం వెనక్కి తగ్గటం లేదు. ప్రత్యేక హోదా ఇవ్వటం ద్వారా సమస్యలు వస్తాయని.. దీనికి బదులు మంచి ప్యాకేజీ ఇస్తామని ఆశ చూపుతున్నట్లుగా చెబుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే ఏడాదికి రూ.3 నుంచి రూ.5వేల కోట్లకు మించి ప్రయోజనం కలిగే అవకాశం ఉండదని.. అంతకు మించి మంచి ప్యాకేజీ ప్రకటనకు సిద్ధమని చెప్పినట్లుగా చెబుతున్నారు.

అయితే.. ప్రత్యేక హోదా విషయంపై ఏపీ ముఖ్యమంత్రి బలంగా ఉన్నట్లుగా చెబుతున్నప్పటికీ.. ఒకవేళ ప్యాకేజీ కానీ.. బాగుండేటట్లు అయితే.. కేంద్రం మాటకు అనుగుణంగా నడుచుకుంటామన్న మాట బాబు అన్నట్లు తెలిసిందే. అయితే.. ముందుగా కేంద్రం ప్యాకేజీ రూపంలో ఏమేం ఇవ్వనుందన్న విషయంపై స్పష్టమైన సమాచారం ఇస్తే.. చర్చించి తమ అభిప్రాయం చెబుతామని చెప్పినట్లుగా చెబుతున్నారు.

మొత్తంగా చూస్తే.. ఏపీ ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం సుముఖంగా లేనప్పటికీ.. ప్రత్యేక ప్యాకేజీ విషయంలో గతం కంటే చురుకు పెరిగిందని.. అన్నీ బాగుంటే ఆగస్టు చివరి నాటికి కేంద్రం నుంచి ప్రకటన వచ్చే వీలుందంటున్నారు.

ఇదే అంశంపై మరోవాదన కూడా వినిపిస్తోంది. కేంద్రం చెప్పే ప్యాకేజీ స్థానే..తామే కొన్ని ప్రతిపాదనలు చేసి కేంద్రానికి ఇద్దామన్న భావనలో చంద్రబాబు ఉన్నట్లు చెబుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు ఆకర్షణీయమైన రాయితీలతోపాటు.. విదేశాల నుంచి తెచ్చే రుణాల్లో 90 శాతం గ్రాంటుగా ఇచ్చే ప్రతిపాదన.. ఉత్తరాంధ్ర.. రాయలసీమలోని వెనుకబడి ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక సాయం అలాంటి అంశాలు కేంద్రం వెల్లడించే ప్యాకేజీలో ఉండాలని బాబు కోరుకుంటున్నట్లు చెబుతున్నారు.

ఏది ఏమైనా.. ఏపీకి ఏదో ఒకటి చేయాలన్న భావన కేంద్రానికి వచ్చినట్లుగా చెబుతున్నారు. ఇప్పుడొచ్చిన కదలికను కంటిన్యూ చేయాలని ఏపీ ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారంటున్నారు. కేంద్రమంత్రుల్ని కలవటం.. ఏపీకి లాభం చేకూరేలా అంశాల మీద దృష్టి పెట్టాలన్నారు. ఏపీకి ప్రకటించే ప్యాకేజీ ఏపీ ప్రజలకు వూరటనిచ్చేలా ఉంటుందా? ప్రత్యేక హోదా కంటే ప్రత్యేక ప్యాకేజీనే మెరుగు అన్న భావనను ఏపీ ప్రజలకు కలిగించటంలో మోడీ.. బాబులు సక్సెస్ అవుతారా? అన్నవి కీలకమయ్యాయి. అవే.. ఏపీలో వారి భవిష్యత్తుకు దోహదం చేస్తాయని చెప్పక తప్పదు.