Begin typing your search above and press return to search.

కీల‌క పోస్టుల్ని బాబు ఎవ‌రికి ఇచ్చారంటే?

By:  Tupaki Desk   |   11 April 2018 5:18 AM GMT
కీల‌క పోస్టుల్ని బాబు ఎవ‌రికి ఇచ్చారంటే?
X
అధికారంలోకి వ‌చ్చి నాలుగేళ్లు గ‌డుస్తున్నా.. నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీ విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రించే ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు తాజాగా 17 సంస్థ‌ల‌కు చెందిన ఛైర్మ‌న్ల‌ను నియ‌మిస్తూ నిర్ణ‌యం తీసుకున్నారు. సామాజిక న్యాయం పేరుతో ప‌ద‌వులు ఇచ్చిన‌ట్లుగా చెప్పిన‌ప్ప‌టికీ.. విధేయుల‌కు.. ప‌ద‌వుల కోసం ఆశ‌గా ఎదురు చూస్తున్న వారికి ప‌ద‌వుల్ని అప్ప‌గించారు.

సామాజిక స‌మీక‌ర‌ణాల విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్న ఆయ‌న‌.. దీక్షా ద‌క్ష‌త కంటే కూడా త‌న ప‌ట్ల విధేయ‌త ప్ర‌ద‌ర్శించే వారికే ప‌దవుల్ని ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది. ముందే అనుకున్న‌ట్లు తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం బోర్డు అధ్య‌క్ష ప‌ద‌విని క‌డ‌ప జిల్లాకు చెందిన పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌కు అప్ప‌గించారు. గ‌తంలో టీటీడీ పాల‌క మండ‌లి స‌భ్యుడిగా వ్య‌వ‌హ‌రించిన ఆయ‌న‌కు కీల‌క‌మైన టీటీడీ ఛైర్మ‌న్ పోస్టు ద‌క్కింది.

ఇటీవ‌ల రాజ్య‌స‌భ స‌భ్య‌త్వాన్ని ఆశించి.. ఆఖ‌రి నిమిషంలో మిస్ అయిన వ‌ర్ల రామ‌య్య‌కు ఆర్టీసీ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కింది. రాజ్య‌స‌భ సీటు మిస్ అయిన సంద‌ర్భంలో ఆయ‌న పాటించిన సంయ‌మ‌నం.. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు బాబు మెచ్చి ఈ కీల‌క ప‌ద‌వి ఇచ్చిన‌ట్లుగా చెబుతున్నారు.

ఎస్సీ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గా మ‌రో ద‌ళిత నేత జూపూడి ప్ర‌భాక‌ర్ ను కొన‌సాగించ‌గా.. మాజీ ముఖ్య‌మంత్రి కిర‌ణ్ కుమార్ రెడ్డి సోద‌రుడు కిశోర్ కుమార్ రెడ్డికి సాగునీటి అభివృద్ధి సంస్థ అధ్య‌క్ష ప‌ద‌వి ల‌భించింది. ఇటీవ‌లే పార్టీలో చేరిన ఆయ‌న‌కు.. ముందుగా అనుకున్న క‌మిట్ మెంట్ ప్ర‌కార‌మే ఈ ప‌ద‌వి ద‌క్కింద‌ని చెబుతున్నారు. గ‌తంలో పార్టీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించి త‌ర్వాత కాలంలో పార్టీ మారి తిరిగి వ‌చ్చిన మాజీ మంత్రి కొత్త‌ప‌ల్లి సుబ్బారాయుడుకు కాపు కార్పొరేష‌న్ అధ్య‌క్ష ప‌ద‌వి వ‌రించింది.

ఇటీవ‌ల స‌ర్దుబాట్ల‌లో జ్యోతుల నెహ్రు కొడుకు కోసం జెడ్పీ ప‌ద‌విని వ‌దులుకొన్న తూర్పుగోదావ‌రి జిల్లాకి చెందిన పార్టీ నేత నామ‌న రాంబాబుకు గృహ నిర్మాణ సంస్థ అధ్య‌క్ష ప‌ద‌విని అప్ప‌గించారు. ప్ర‌కాశం జిల్లా కందుకూరు మాజీ ఎమ్మెల్యే దివి శివ‌రాంకు అట‌వీ అభివృద్ధి సంస్థ అధ్య‌క్ష ప‌ద‌వి ద‌క్కింది.

సీనియ‌ర్ నేత లాల్ జాన్ బాషా సోద‌రుడు జియావుద్దీన్ కు మైనార్టీ క‌మిష‌న్ ఛైర్మ‌న్ ప‌ద‌వి ద‌క్కింది. మైనార్టీ ఆర్థిక సంస్థ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ గా హిదాయ‌త్ కు మ‌రోసారి అవ‌కాశం ల‌భించింది. మ‌రో ముగ్గ‌రు నేత‌లు రాజా మాస్టార్ (గుంటూరు జిల్లా).. సుభాస్ చంద్ర‌బోస్ (చిత్తూరు జిల్లా).. చ‌ల్లా రామ‌కృష్ణా రెడ్డి (క‌ర్నూలు జిల్లా) ఆర్టీసీ రీజ‌న‌ల్ ఛైర్మ‌న్ ప‌ద‌వులు ల‌భించాయి. మ‌రికొద్ది రోజుల్లో భారీ ఎత్తున నామినేటెడ్ ప‌ద‌వుల పందేరం జ‌ర‌గ‌నున్న‌ట్లు చెబుతున్నారు.