Begin typing your search above and press return to search.

ఇసుక పాలసీ ఆలస్యంపై బాబు విమర్శలు

By:  Tupaki Desk   |   6 Aug 2019 2:59 PM GMT
ఇసుక పాలసీ ఆలస్యంపై బాబు విమర్శలు
X
ఏపీలో ఇసుక కొర‌త‌పై ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శలు చేశారు. ఏపీ ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం తీసుకువ‌చ్చిన ఇసుక విధానంలో సామాన్య ప్ర‌జ‌లు కూడా తీవ్ర‌మైన ఇబ్బందుల‌కు గుర‌వుతున్నార‌న్న అభిప్రాయం ఉంది. ఈ క్ర‌మంలోనే బాబు ముందుగా స‌రైన ప్ర‌ణాళిక లేకుండా పాత ఇసుక విధానం ర‌ద్దు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. కొత్త ఇసుక విధానం ఎప్పుడో తీరిక‌గా వ‌స్తుంద‌ట‌.. ఏంటి ఈ పిల్ల ఆట‌లు అంటూ ట్విట్ట‌ర్‌లో ఫైర్ అయ్యారు.

వ్య‌వ‌స్థ‌లో మార్పులు ఆహ్వానించ‌ద‌గ్గ‌వే అయినా... వాటిని అమ‌లు చేయాల‌నుకున్న‌ప్పుడు ముందుగా ఒక ప్రణాళిక తయారు చేసుకొని, ఆ మార్పుల సాధ్యాసాధ్యాల‌పై బేరీజు వేసుకోవాల‌ని కూడా ఆయ‌న పేర్కొన్నారు. బాధ్య‌తాయుత స్థానంలో ఉండి మొండిగా నిర్ణ‌యాలు తీసుకోవ‌డం స‌బ‌బు కాద‌ని కూడా బాబు అన్నారు. నిర్ణ‌యాలు తీసుకునేట‌ప్పుడు వాటికి త‌గిన ప‌ర్యవ‌స‌నాలు ఆలోచించారా ? అని కూడా నిల‌దీశారు.

ఈ కొత్త ఇసుక విధానం ఆలస్యం వ‌ల్ల ల‌క్ష‌లాది మంది భ‌వ‌న నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయార‌ని, పేదల సొంతింటి క‌ల‌ క‌ల‌గానే మిగిలిపోయింద‌ని... ట్రాక్టర్ ఇసుక 10 వేల రూపాయలు అంటే, వైసీపీ నేతలను మేపడానికే పాత విధానాన్ని రద్దు చేశారా అంటూ విమర్శలు గుప్పించారు.