Begin typing your search above and press return to search.

జనాలను భయపెట్టే వార్త చెప్పిన బాబు... ?

By:  Tupaki Desk   |   4 Jan 2022 3:30 PM GMT
జనాలను భయపెట్టే వార్త చెప్పిన బాబు... ?
X
ప్రజలు ఎపుడూ మాట్లాడరు, ఎన్నికల ప్రజాస్వామ్యంలో ప్రజల పాత్ర అతి పరిమితం. ఓటు రోజున మాత్రమే వారు మహరాజులు. ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రభువులు అంటే ప్రజలే అని చెబుతారు. కానీ నిజానికి ప్రజల చేతిలో ఏమీ లేదు. మన ఎన్నికల విధానంలో సంస్కరణలు కొన్ని తీసుకువస్తేనే తప్ప జనాలు ఇచ్చే తీర్పులో క్లారిటీ రాదు, మొత్తం పోలైన ఓట్లలో యాభై శాతం కంటే ఎక్కువ వచ్చిన వారే విజేత అని ప్రకటిస్తేనే ప్రజల తీర్పునకు సార్ధకత. అయితే అవన్నీ ఇప్పట్లో జరిగేవి కాదు కాబట్టి ప్రజలు ఓటు వేస్తారు, కానీ వారికి నచ్చిన వారే ప్రజా ప్రతినిధులు అవుతున్నారా అంటే దానికి జవాబు చెప్పడం ఎపుడూ కష్టమే.

ఇక అయిదేళ్ల పాటు ఒక నాయకుడిని నమ్మి ప్రజలు అధికారమిస్తారు. ఆ నాయకులు వందల ఏళ్లకు సరిపడా అప్పులు చేస్తే ఎవరిది బాధ్యత అంటే అందరికీ తెలిసిందే. జనాలే వాటికి బాధ్యులు. అయితే దీన్ని ఎవరూ పట్టించుకోరు. ఉచితంగా ఏదైనా ఇస్తే వెర్రిత్తి మరీ ఎగబడతారు. తమకు ఆ ఉచితాలు దక్కితే చాలు అనుకుంటారు. దేశం ఏమైపోతేనేమని కూడా ఆలోచించేవారు ఉన్నారు.

ఇలాగే ప్రతీవారూ ఉండబట్టే ఎన్నికలైన వారు తామే శాశ్వత ప్రభువులు అనుకుని జనాల నెత్తిన అయిదేళ్లకు కాదు శాశ్వతంగానే అప్పులు బరువు పెడుతున్నారు. ఇదే విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా చెబుతున్నారు. జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఈ రోజుకు ఏపీకి ఉన్న అప్పు అక్షరాలా ఏడు లక్షల కోట్లు. ఈ అప్పు ఇంకా పెరుగుతుంది కానీ తగ్గదు, మరి దీన్ని ఎవరు తీర్చాలి. కచ్చితంగా జనాలే అంటూ బాబు పెద్ద బాంబే పేల్చారు.

నిజానికి ప్రభుత్వాలు చేసే ప్రతీ పైసా అప్పును చమటోడ్చి మరీ తీర్చేది ప్రజలే. నాయకులు తెలిసీ తెలియక చేసే పనులకు బాధ్యత వహించేది కూడా వారే. కానీ ఇలా చంద్రబాబు చెబితే మాత్రం వినే జనాల గుండెలు అదరడం ఖాయం. ఏపీకి ఇన్నేసి లక్షల అప్పులు, దాని మీద వడ్డీలు, ఇంకా కొత్తగా చేసే అప్పులు, మరో రెండున్నరేళ్ల జగన్ సర్కార్ పాలన ముగిసే సమయానికి అప్పులు చూసుకుంటే కచ్చితంగా పది లక్షల కోట్లు అప్పు ఉంటుందని ఒక అంచనా.

మరి ఆ అప్పులను తీర్చాల్సింది మీరే సుమా అని చంద్రబాబు హెచ్చరిస్తున్నారు. అప్పులు తేవడం తప్ప సంపదను సృష్టించని జగన్ సర్కార్ జనాల నెత్తిన భారాలు పెడుతోంది అని ఆయన నిప్పులే చెరుగుతున్నారు. ఇక సంక్షేమం అని ముద్దుగా పేరు పెట్టి మరీ జనాలను జగన్ మభ్యపెడుతున్నారని బాబు విమర్శలు చేశారు. మొత్తానికి ఏపీకి అప్పులు అని అందరికీ తెలుసు. అవి ఇన్ని లక్షల కోట్లు అని అందరూ చెబుతున్నారు. చంద్రబాబు కాస్తా అడుగు ముందుకేసి వీటిని తీర్చాల్సింది జనాలే అంటూ చేదు నిజాన్ని చెప్పేశారు.

అయినా జనాలు ఉచితాలను కాదనుకుంటారా. సంక్షేమాన్ని వద్దనుకుంటారా. ఇక ఎవరో అప్పులు తీరుస్తారు మేమెందుకు అని ఉచిత పధకాల లబ్దిదారులు భావిస్తారా. ఇవన్నీ ఒక వైపు ప్రశ్నలు అయితే మరో వైపు ఏపీకి అప్పులు ఇన్నేసి లక్షల కోట్లు అని చెప్పిన చంద్రబాబు ఆ అప్పుల్లో తమ ప్రభుత్వ వాటా రెండున్నర లక్షల కోట్లు అన్న సంగతిని మాత్రం చెప్పడం మరచారు. అంతే కాదు, రేపటి రోజున అధికారంలోకి రావాలనుకుంటున్న తాను ఒక్క పైసా కూడా అప్పులు చేయకుండా రాష్ట్రాన్ని పాలిస్తాను అని ఎన్నికల వేళ హామీ ఇవ్వగలరా. అది అసలు కుదిరేది కాదని అందరికీ తెలుసు.

ఇక చంద్రబాబుకు ఒక విజన్ ఉందని అంతా అంటారు. ఆయన ఉమ్మడి ఏపీలో సంస్కరణవాదిగా పేరు తెచుకున్నారు. ఏదీ ఉచితంగా రాదు అని బాబుకు తెలుసు. అలాంటి బాబు 2014 నాటికి చాల ఉచితాలు తాయిలాలు ప్రకటించారు. ఇక 2024 నాటికి ఆయన సంక్షేమానికి నేను వ్యతిరేకమని అనగలరా. ఏపీ అప్పుల కుప్ప కాబట్టి పధకాలు వద్దు అభివృద్ధి ముద్దు అలా నేను చేస్తాను, నాకు ఓటేయండి అని జనాల ముందుకు వచ్చి చెప్పగలరా.

మొత్తానికి బాబు ఆవేదన అప్పులు చేసినందుకా లేక తాను అధికారంలో లేనందుకా అన్న ప్రశ్న కూడా ఇక్కడ వస్తోంది. ఏది ఏమైనా బాబు చెప్పిన మాట కరెక్ట్. ఎవరు అప్పు చేసినా తీర్చాల్సింది జనాలే. కాబట్టి నేతలు ఉచితం అని చెబితే వారికి ఓటేయకుండా అభివృద్ధి చేస్తామన్న వారికి ఓటేస్తామని కచ్చితమైన నిర్ణయం తీసుకుంటే తప్ప ఏపీ బాగుపడదు, ఇది ఆర్ధిక నిపుణులు చెబుతున్న మాట.