Begin typing your search above and press return to search.

ఆ మార్పుల‌తో కేంద్రానికి సంబంధ‌మేంటి బాబు?

By:  Tupaki Desk   |   9 Jan 2019 6:04 AM GMT
ఆ మార్పుల‌తో కేంద్రానికి సంబంధ‌మేంటి బాబు?
X
అగ్ర‌వ‌ర్ణాల్లోని పేద‌ల‌కు విద్య‌ - ఉద్యోగ రంగాల్లో 10 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించే దిశ‌గా కేంద్ర‌ప్ర‌భుత్వం ముంద‌డుగు వేసింది. సంబంధిత బిల్లును లోక్ స‌భ మంగ‌ళ‌వారం ఆమోదించింది. బుధ‌వారం రాజ్య‌స‌భ‌లోకి బిల్లు ప్ర‌వేశించ‌నుంది. ప్ర‌తిప‌క్షాల నుంచి తీవ్ర నిర‌స‌న‌లు ఎదురైనా పెద్ద‌ల స‌భ‌లోనూ బిల్లుకు ఆమోదం ల‌భించ‌డం దాదాపు ఖాయ‌మే.

ఇదంతా బానే ఉంది. అయితే - అగ్ర‌వ‌ర్ణ పేద‌ల‌కు కోటా క‌ల్పిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణ‌యాన్ని మ‌రో కోణంలో త‌న మైలేజీకి వాడుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ట ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు. అదేంటి.. కేంద్రం రిజ‌ర్వేష‌న్ ఇస్తే దాన్ని చంద్ర‌బాబు త‌నకు అనుకూలంగా మార్చుకోవ‌డ‌మేంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? అక్క‌డే అస‌లు మ‌త‌ల‌బు ఉండి అంటున్నారు విశ్లేష‌కులు.

కొన్ని ఓసీ కులాలను బీసీలుగా మారుస్తానని - బీసీల్లోని కొన్ని కులాలను ఎస్సీ - ఎస్టీ జాబితాలో చేరుస్తాన‌ని గ‌త ఎన్నిక‌ల‌కు ముందు చంద్ర‌బాబు ఊద‌ర‌గొట్టారు. ముఖ్యంగా కాపుల‌ను బీసీల్లో చేరుస్తామ‌న్నారు. ర‌జ‌కుల‌ను ఎస్సీల్లో - వాల్మీకీల‌ను ఎస్టీల్లో చేర్చుతామ‌న్నారు. త‌ద్వారా ఆయా వ‌ర్గాల ఓట్లు రాబ‌ట్టుకున్నారు. అధికారంలోకి వ‌చ్చాక మాత్రం హామీల‌ను విస్మ‌రించారు. నాలుగున్న‌రేళ్లుగా మాయ‌మాట‌లతో త‌ప్పించుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా కర్నూలు జిల్లా జన్మభూమి సభలో చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌లు ఆయ‌న చేత‌గానిత‌నానికి నిద‌ర్శ‌న‌మ‌ని విమ‌ర్శ‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. "వాల్మీకులను గిరిజనుల్లో చేర్చమని - కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని - రజకులను ఎస్సీల్లో చేర్చాలని కేంద్రానికి నివేదికలు పంపాం. ఈబీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినపుడు ఇవి కూడా చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నా" అని చంద్ర‌బాబు క‌ర్నూలులో అన్నారు.

అయితే - చంద్ర‌బాబు మాట‌ల‌పై రాజ‌కీయ విశ్లేష‌కులు తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. కాపుల‌ను బీసీల్లో - ర‌జ‌కుల‌ను ఎస్సీల్లో - వాల్మీకీల‌ను ఎస్టీల్లో చేర్చ‌డం రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌రిధిలోని విష‌యాల‌ని వారు గుర్తుచేశారు. వాటిపై ఏవైనా అభ్యంత‌రాలుంటే రాష్ట్రమే కోర్టుల్లో పోరాడాల‌ని సూచించారు. ఆ ప‌ని చేత‌గాక చంద్ర‌బాబు అన‌వ‌స‌రంగా కేంద్రంపై చిందులు వేస్తున్నార‌ని విమ‌ర్శించారు. బీసీ రిజ‌ర్వేష‌న్ల‌ను ఈబీసీల‌తో ముడిపెట్టి వివాదం చేసేందుకు బాబు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని ఆరోపించారు. అగ్రవర్ణ పేదల(ఈబీసీ)కు ఇచ్చే 10 శాతం రిజర్వేషన్లకు - ప్రస్తుతం అమల్లో ఉన్న రిజర్వేషన్లకు ఎలాంటి సంబంధం లేదని కేంద్రం ఇప్ప‌టికే స్ప‌ష్టం చేసిన సంగ‌తిని గుర్తుచేశారు. ఎన్నిక‌లు స‌మీపిస్తుండ‌టంతో కాపులు - వాల్మీకీలు - ర‌జ‌కుల ఆగ్ర‌హాన్ని త‌ప్పించుకునేందుకే చంద్ర‌బాబు ఇలా కేంద్రంపై దుష్ప్ర‌చారం చేస్తున్నార‌ని ఆరోపించారు.