Begin typing your search above and press return to search.

బాబూ... ఇప్పటికే ఆలస్యమైపోయింది

By:  Tupaki Desk   |   1 March 2016 8:08 AM GMT
బాబూ... ఇప్పటికే ఆలస్యమైపోయింది
X
ఏపీ సీఎం చంద్రబాబు తొలిసారి కేంద్రంపై గట్టిగా నిరసన గళం వినిపించారు. ఇంతవరకు ముఖ్య నేతలతోనో.. లేదంటే నేరుగా కేంద్రంలోని పెద్దల వద్దనో నిరసన గళం వినిపించే ఆయన ఈసారి బహిరంగంగా కేంద్రంపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి తీరని అన్యాయం చేశారంటూ మండిపడ్డారు. నిజానికి నిన్న బడ్జెట్ అనంతరమే ఆయన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ముఖ్య నేతల వద్ద ఈ అభిప్రాయం వ్యక్తంచేశారు. తాజాగా మంగళవారం విజయవాడలో జరిగిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో చంద్రబాబు కేంద్రం తీరును నిరసించారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీని పట్టించుకోలేదని... అన్యాయం చేశారని ఆయన అన్నారు.

విభజన దెబ్బకు ఆర్థికంగా నష్టాల్లో ఉన్న ఏపీ పొరుగు రాష్ట్రాలతో సమానంగా అభివృద్ధి చెందేవరకు చేయూత ఇవ్వాలని కేంద్రాన్ని తాను కోరానని... అయినా, కేంద్రం మాత్రం పట్టించుకోలేదని ఆయన అన్నారు. రాష్ట్రంలో వెనుకబడిన ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ, రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోరామని... అయినా, కేంద్రం మాత్రం మొండిచేయి చూపించిందని చంద్రబాబు బహిరంగంగానే విమర్శించారు. దీనిపై వెంటనే తాను జైట్లీతో మాట్లాడానని... ఏపీలో ఉన్న అసంతృప్తిని ఆయనకు తెలిపానని చంద్రబాబు చెప్పారు.

కాగా చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడంతో బీజేపీ నేతలు అందుకు కౌంటర్ ఎలా ఇవ్వాలా అని ఆలోచిస్తున్నారు. ఇంతవరకు ఎప్పుడూ లేనట్లుగా చంద్రబాబు ఓపెన్ గా కామెంట్లు చేయడంతో దాన్ని ఖండించాలని అనుకున్నా అధిష్ఠానంతో మాట్లాడాకే స్పందించాలని ఏపీ బీజేపీ నేతలు అనుకుంటున్నారు.

కాగా చంద్రబాబు ఇప్పటికే ఆలస్యం చేశారని... బడ్జెట్ కు ముందే ఈ స్థాయిలో ఆయన అసంతృప్తి వ్యక్తంచేస్తే ఫలితం ఉండేదని... ఇప్పుడు ఆయన ఇలా మాట్లాడడం వల్ల లాభంలేదన్న వాదన వినిపిస్తోంది.