Begin typing your search above and press return to search.

‘గల్లా’ పట్టుకుంటున్న చంద్రబాబు

By:  Tupaki Desk   |   6 Jun 2017 7:57 AM GMT
‘గల్లా’ పట్టుకుంటున్న చంద్రబాబు
X
ఏపీ యువ ఎంపీ గల్లా జయదేవ్ పై చంద్రబాబు ఆగ్రహిస్తున్నారు. చాలాకాలంగా రగులుతున్న ఆంధ్రప్రదేశ్ ఒలింపిక్ అసోసియేషన్(ఏపీఓఏ) గొడవ నేపథ్యంలో ఆయనపై చంద్రబాబు ఫైరవుతున్నారు. ఆ సంస్థ పదవి నుంచి తప్పుకోవాలని గల్లా జయదేవ్‌ ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశించారు. ఏపీఓఏలోని రాజకీయాల కారణంగా 2018లో జరిగే జాతీయ క్రీడల(నేషనల్ గేమ్స్)కు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని ఏపీ కోల్పోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

జాతీయ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని ఏపీ కోల్పోవడంపై చంద్రబాబు కొంత ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది. ఏపీఓఏలో తెలుగుదేశం రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ - గల్లా జయదేవ్ వర్గం చాలాకాలంగా కొట్లాడుకుంటున్నాయి. వీరిద్దరి మధ్య రాజకీయాలు తారస్థాయికి చేరుకోవడంతో సీఎం చంద్రబాబు సీన్లోకి ఎంటరయ్యారు. ఇప్పటికే సీఎం రమేష్ ఏపీఓఏ నుంచి వైదొలగగా, గల్లా మాత్రం కొనసాగుతున్నారు. అయితే, ఇండియన్ ఓలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అతని గ్రూపును గుర్తించింది. కానీ, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఏపీ(శాప్) మాత్రం ఈ గ్రూపులను గుర్తించేందుకు నిరాకరించింది. గల్లా గ్రూప్ కేసు కోర్టులో పెండింగ్‌ లో ఉన్న కారణంగా నేషనల్ గేమ్స్‌ కు ఆతిథ్యం ఇచ్చేందుకు బిడ్ వేయాలని ఐఓఏ కోరినప్పటికీ అది సాధ్యం కాలేదు. దీంతో ఈ గ్రూపు రాజకీయాల కారణంగా నేషనల్ గేమ్స్‌కు ఏపీ ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని కోల్పోవడంతో ఏపీ బ్రాండింగ్ పై సీరియస్ గా ఉన్న చంద్రబాబుకు కోపం తెప్పించింది.

దీంతో చంద్రబాబు ఈ విషయంలో స్పష్టమైన ఆదేశాలిచ్చారు . తన మాట సీఎం రమేశ్ విన్నప్పటికీ గల్లా వినకపోవడంతో ఆయన్ను టార్గెట్ చేసి నేరుగా ఆదేశాలిచ్చారు. స్పోర్ట్స్ అసోసియేషన్ నుంచి రాజకీయ నేతలు తమ ప్రాతినిథ్యాన్ని వదులుకోవాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. గల్లా జయదేవ్‌ ను ఒలింపిక్ గ్రూప్ నుంచి వైదొలగాలని చంద్రబాబు మరోసారి తేల్చి చెప్పారట. మరి జయదేవ్ ఏం చేస్తారో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/