Begin typing your search above and press return to search.

బాబుకు మ‌ళ్లీ అది గుర్తుకువ‌చ్చింది

By:  Tupaki Desk   |   25 April 2018 7:06 AM GMT
బాబుకు మ‌ళ్లీ అది గుర్తుకువ‌చ్చింది
X
ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు త‌న‌దైన శైలిలో కొత్త చ‌ర్చ‌ను తెర‌మీద‌కు తెచ్చారు. దాదాపుగా మూడేళ్ల త‌ర్వాత ఆయ‌న‌కు గ‌వ‌ర్న‌ర్‌ పై మ‌ళ్లీ కోపం వ‌చ్చింది. ఇంకాస్త క్లియ‌ర్‌గా చెప్పాలంటే...చంద్ర‌బాబు జీవితంలో అత్యంత ఘోర ప‌రాభ‌వంగా విప‌క్షాలు వ‌ర్ణించే `ఓటుకు నోటు` ఎపిసోడ్ వెలుగులోకి వ‌చ్చిన‌ స‌మ‌యంలో ఎలా వ్య‌వ‌హ‌రించారో అలాగే ఇప్పుడు చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రిస్తున్నారని అంటున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు బ‌య‌ట‌ప‌డిన‌ స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు కొన‌సాగిస్తుంటే గ‌వ‌ర్న‌ర్‌పై విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. ఉమ్మడి రాజ‌ధాని ర‌క్ష‌కుడిగా గ‌వ‌ర్న‌ర్ స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదంటూ చంద్ర‌బాబు ఫైర‌య్యారు. దానికి టీడీపీ నేత‌లు వంత‌పాడారు. ఇప్పుడు మ‌ళ్లీ అదే పాట ఎత్తుకున్నారు. అయితే మూడేళ్ల గ్యాప్‌ లో ఏం జ‌రిగింద‌నే విష‌యాన్ని బాబు మ‌ర్చిపోయారు. అంతెందుకు తాను గ‌వ‌ర్న‌ర్‌ ను ఎలా వాడుకున్న‌ది కూడా ఆయ‌న వ‌దిలిపెట్టార‌ని అంటున్నారు.

ఇంత‌కీ ఏం జ‌రిగిదంటే...తూర్పుగోదావరి జిల్లా మండపేట మండలం ద్వారపూడి గ్రామంలో జ‌రిగిన‌ పంచాయతీరాజ్‌ దినోత్సవ వేడుకల‌కు ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఎప్ప‌ట్లాగే సుదీర్ఘంగా రాష్ట్ర ప్రభుత్వ - సంక్షేమ - అభివృద్ధి పథకాల్ని సభికులకు వివరించిన సీఎం ప్రసంగం చివరికి వ‌చ్చేసరికి కేంద్రంపై నిప్పులు చెరిగారు. కేంద్రంపై తాను పోరాటం చేస్తున్నాన‌ని చెప్తూ గవర్నర్‌ వ్యవస్థను నిర్మూలించాలన్నారు. ఎన్‌ డీఏ నుంచి తెలుగుదేశం వైదొలిగిన అనంతరం రాష్ట్రాన్ని ఏదో విధంగా ఇబ్బందులపాల్జేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఇందుకోసం గవర్నర్ల వ్యవస్థను దుర్వినియోగం చేసే అవకాశం లేకపోలేదని అయితే గవర్నర్లు హుందాగా వ్యవహరించాల్సిన అవసరముందని బాబు వివ‌రించారు. అసలీ వ్యవస్థను పునర్‌ నిర్వచించాలంటూ దేశంలో తొలిసారిగా తమ పార్టీ వ్యవస్థాపకులు దివంగత ఎన్‌ టిఆర్‌ జాతీయ స్థాయిలో చర్చకు తెరదీశారని గ‌తం త‌వ్వారు. తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ ఆయన స్పష్టం చేశారు.

అయితే, ఇదే గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ ఆధారంగా ఇదే చంద్ర‌బాబు రాజ్యాంగాన్ని అప‌హాస్యం చేసిన ఉదంతాన్ని ఎందుకు ప్ర‌స్తావించ‌డం లేద‌ని ప్ర‌శ్నిస్తున్నారు. ప్ర‌జాస్వామ్యాన్ని అప‌హాస్యం చేసేలా ఎమ్మెల్యేల‌ను పార్టీ ఫిరాయింపును ప్రోత్స‌హించిన చంద్ర‌బాబు, వారితో ఇదే గ‌వ‌ర్న‌ర్‌ తో వారిచే మంత్రులుగా ప్ర‌మాణ స్వీకారం చేయించిన సంగ‌తిని ప‌లువురు గుర్తుచేస్తున్నారు. దేశంలో తానే సీనియ‌ర్ అని ప‌దే ప‌దే డ‌బ్బా కొట్టుకునే బాబు రాజ్యాంగాన్ని ప్ర‌శ్నార్థకం చేసేలా చేసిన ప‌నికి గ‌వ‌ర్న‌ర్ ఓకే చెప్తే ఆనాడు న‌ర‌సింహ‌న్ మంచి వారు అయ్యారు...నేడు సంయ‌మ‌నం పాటించాల‌ని చెప్తే చెడ్డ‌వారు అయ్యారా అంటూ నిల‌దీస్తున్నారు.