Begin typing your search above and press return to search.

పోలవరం రివ్యూలో బాబు మాటల మంటలు

By:  Tupaki Desk   |   15 Nov 2016 4:45 AM GMT
పోలవరం రివ్యూలో బాబు మాటల మంటలు
X
వారం ప్రారంభం అవుతుందంటేనే అధికారులు హడలిపోతున్నారు. మరి.. ముఖ్యంగా పోలవరం పనుల బాధ్యతలు తీసుకున్న అధికారులకైతే గొంతు తడారిపోతున్న పరిస్థితి. ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోభివృద్ధి మీద రివ్యూ చేస్తానని.. ఏ వారానికి ఆ వారం చొప్పున పనులు జరిగిన తీరును సమీక్షిస్తానని.. ఆ విషయంలోఏ మాత్రం పొరపాటు దొర్లినా ఊరుకునేది లేదని బాబు ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా.. పోలవరం ప్రాజెక్టు పనుల మీద చంద్రబాబు రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారుల్ని.. కాంట్రాక్టర్లను తన మాటలతోఉతికి ఆరేయటమే కాదు.. ఒక దశలో తాట తీసినంత పని చేశారని చెప్పాలి.

షెడ్యూల్ సమయానికి కంటే కాస్త ఆలస్యంగా మొదలైన పోలవరం రివ్యూ మీటింగ్.. జరగాల్సిన దాని కంటే హాట్ హాట్ గా సాగినట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టు సీఈ రమేష్ బాబును ఉద్దేశించి చంద్రబాబు చెడామడా మాటలు అనేసినట్లుగా తెలుస్తోంది. ‘‘ఏం రమేవ్ బాబు.. అక్కడ గోళ్లు గిల్లుకుంటూ కూర్చున్నావా?’’ అంటూ మండిపడ్డారు. దీనికి స్పందించిన ఆయన కొన్ని యంత్రాలు రావాల్సి ఉందని చెప్పే ప్రయత్నాన్నివారించిన బాబు.. మరింత సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు. రమేశ్ బాబుతో పాటు.. జలవనరుల శాఖ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న శశిభూషణ్ పైనా ఫైర్ కావటం గమనార్హం.

‘‘నువ్వేదో బాగా పని చేస్తామని కీలకమైన జలవనరుల శాఖ కార్యదర్శి బాధ్యతలు అప్పగించా. కానీ.. ఏం బాగోలేదు. అప్ టు ద మార్క్ గా పని చేయటం లేదు. ముందు కిందకు దిగి.. వాస్తవాల్ని గమనించు’’ అంటూ తీవ్రస్వరంగా ఆక్షింతలు వేయటం గమనార్హం. ఈ సందర్భంగా కల్పించుకొని పనులు జరుగుతున్నాయని.. గతంతో పోలిస్తే పనుల్లో వృద్ధి ఉందని చెప్పే ప్రయత్నం చేసే వారిపైనా పెద్ద స్వరంతో మండిపడిన బాబు తీరుతో అధికారులు కామ్ అయిపోయినట్లుగా తెలుస్తోంది.

సమీక్షా సమావేశాల్లో వీడియో దృశ్యాలు కట్ కావటంతో ఫోన్ లో రివ్యూ చేసిన ఆయన.. అధికారుల తాట తీసినట్లుగా చెబుతున్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తున్నా.. కాంట్రాక్ట్ సంస్థ మాత్రం అందుకు తగినట్లుగా స్పందించటం లేదన్న అసంతృప్తి బాబు స్పష్టంగా వ్యక్తం చేయటం గమనార్హం. అనుకున్న సమయానికి అనుకున్నట్లుగా పని జరగాలని లేకుండా చర్యలు తప్పవని కాంట్రాక్టు సంస్థను సైతం బాబు హెచ్చరించారు. అంతేకాదు.. కాంట్రాక్టు సంస్థ ప్రతి వారం ఏదో ఒక సాకు చూపించి పనులు ఆలస్యం చేస్తున్నారని ఫైర్ అయిన చంద్రబాబు త్రివేణి సంస్థల ప్రతినిధిని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

‘‘మీరు చీటింగ్ చేశారు. పనులు చేయటాన్ని తేలిగ్గా తీసుకుంటున్నారు. రోజుకు లక్షన్నర క్యూబిక్ మీటర్ల మేర స్పిల్ వే.. స్పిల్ ఛానల్ మట్టిపనులు చేపట్టకపోతే ఉపేక్షించను. వచ్చేసోమవారం పోలవరం వద్దే సమీక్ష చేస్తా. పనులు చేయటంలో నిర్లక్ష్యం చేసినట్లు కనిపించినా.. ఫెయిల్ అయినట్లు తేలితే మాత్రం చర్యలు తప్పవు’’ అని బాబు తేల్చేశారు. పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతి మీద సీఎం చాలా కచ్ఛితంగా ఉన్నారని.. ఏ మాత్రం తేడా వచ్చినా ఊరుకోరన్న విషయాన్ని తాజా రివ్యూ మీటింగ్ లో చంద్రబాబు తేల్చేసినట్లుగా చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/