Begin typing your search above and press return to search.

బాబు ఈజ్ బ్యాక్‌... గెట్ రెడీ

By:  Tupaki Desk   |   28 Aug 2015 5:04 AM GMT
బాబు ఈజ్ బ్యాక్‌... గెట్ రెడీ
X
ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడులోని సౌమ్య మూర్తి మాయ‌మైపోతున్నాడా ?! ఆయ‌న ఓపిక‌ను గౌర‌వించే ప‌రిస్థితులు లేక‌పోవ‌డం, ఏపీలో ప‌రిపాల‌న‌, ప్ర‌భుత్వ ఉద్యోగుల తీరుతో ఏపీ ప్ర‌భుత్వం ప‌రువు పోతున్న క్ర‌మంలో చంద్ర‌బాబు ఉగ్ర‌రూపం దాల్చుతారా? అంటే అవున‌నే అంటున్నారు. ఢిల్లీలో ఏపీకి ప్ర‌త్యేక హోదా, ఇత‌ర‌త్రా అంశాల‌పై ప‌ర్య‌టించి వ‌చ్చిన అనంత‌రం విజ‌య‌వాడ‌ లోని సీఎం క్యాంపు కార్యాల‌యంలో బాబు విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు జూలు విదిల్చిన‌ట్లు మాట్లాడారు.

ఉద్యోగులు నిర్లిప్తంగా ఉన్నా, నిర్లక్ష్యంగా వ్యవహరించినా గతంలో సహించేవాడిని కాదు. అయితే గతంలో మాదిరిగా కాకుండా ఉద్యోగుల విషయంలో ప్ర‌స్తుతం సానుకూలంగా వ్యవహరిస్తున్నాను. కానీ....నేనెంత కష్టపడుతున్నా.. ఉద్యోగుల నుంచి కూడా ఆ స్థాయి కృషి జరగడం లేదు. ఈ నేప‌థ్యంలో కొందరు రాష్ట్ర ప్రభుత్వ అధికారుల మొద్దు నిద్ర వదిలించటానికి సన్నద్ధంగా ఉన్నాను"అని బాబు ప్ర‌క‌టించేశారు. దీంతో పాటు ఉద్యోగుల విషయంలో మరో మూడు నెలల్లో "పాత చంద్రబాబు పెర్‌ ఫార్మెన్స్‌ చూస్తారు" అంటూ సీఎం చంద్రబాబు హెచ్చ‌రించారు.

తాను రాష్ర్టాన్ని అభివృద్ధి చేయడానికి, ఆదాయం తీసుకు రావడానికి 24 గంటలూ కష్టపడుతుంటే, వివిధ ప్రభుత్వ శాఖల నిర్వాకం కారణంగా ప్రభుత్వ పరువు మంటగలుస్తోందని బాబు ఫైర్ అయ్యారు. పనిచేసే అధికారులే తన దగ్గర ఉంటారని, పని చేయని వారిని ఉపేక్షించేది లేదన్నారు. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో ఎలుక కొరికి శిశువు మరణించడం.. పశ్చిమ గోదావరి జిల్లాలో సైకో ఇంజక్షన్లు చేసి పారిపోవడం వంటి ఘటనల నేప‌థ్యంలో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరుపై చంద్రబాబు మండిపడ్డారు. గుంటూరు ఆస్ప‌త్రిలో ఎలుకలు కొరకడం ద్వారా శిశువు మరణించడంపై తీవ్రంగా స్పందించారు. ‘ఆ డాక్టర్‌ కు బుద్ధి లేదు’ అంటూ మండిప‌డ్డారు. ఇంజక్షన్లు చేసి పారిపోతున్న సైకో ఉదంతాలపై కూడా అంతే తీవ్రంగా స్పందించారు. ఒక సైకో ఇంజక్షన్లు చేసి పారిపోతుంటే పోలీసులు వాడిని పట్టుకోవడానికి భయపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైకోను పట్టుకోకపోవడంపై తాను డీజీపీ నుంచి అన్ని స్థాయిల అధికారులతో మాట్లాడి వాయించి పారేశానన్నారు.

అంటే బాబు ఈజ్ బ్యాక్ అన్న‌ట్లేనా? ఏపీ ఉద్యోగులు ఇక బాబు గారి మార్కు ప‌రిపాల‌న చూస్తారా? స‌మ‌యం తేల్చుతుందేమో.