Begin typing your search above and press return to search.

పాత రోజులు పోయాయి అంటే ఏంటి బాబు?

By:  Tupaki Desk   |   3 Jan 2016 5:43 AM GMT
పాత రోజులు పోయాయి అంటే ఏంటి బాబు?
X
పాలకుడు ఎలా ఉండాలి? ప్రజలకు జవాబుదారీగా ఉండే వ్యక్తి తన ధర్మాన్ని నిర్వర్తించే క్రమంలో ఎలా వ్యవహరించాలా? ఈ రెండు ప్రశ్నలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎప్పటికి సరిగా అర్థం కావేమో. ఆయనకు అర్థంకాకపోవటం కంటే కూడా అర్థం చేసుకోవటంలో ఎప్పుడూ తప్పులు చేస్తుంటారన్న భావన కలుగక మానదు. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించిన సమయంలో అధికారుల విషయంలో కఠినంగా వ్యవహరించి.. వారి ఆగ్రహానికి గురి కావటం తెలిసిందే. పదేళ్లు ప్రతిపక్షంలో ఉన్న ఆయనకు సహకరించేందుకు ప్రభుత్వ ఉద్యోగులు ఎలాంటి ఆసక్తి ప్రదర్శించలేదు. తానేం తప్పు చేశానని ఇంతలా దూరం పెడుతున్నారంటూ ప్రభుత్వ ఉద్యోగుల వైఖరిని ఆయన తన సన్నిహితుల దగ్గర తరచూ ప్రస్తావించేవారు.

పని చేయమని చెప్పటం కూడా తప్పేనా? అంటూ ఆయన ప్రశ్నించేవారు. పని చేయాలని గట్టిగా చెబితే.. ప్రభుత్వ ఉద్యోగులు అంతలా ఫీల్ కావాల్సిన అవసరం ఏమిటన్న భావన కూడా చంద్రబాబు అండ్ కో దగ్గర వ్యక్తమయ్యేది. అయితే.. ఇలాంటి ప్రశ్నలతో లాభం ఉండదనుకొని.. ఫ్రభుత్వ ఉద్యోగులకు ఫ్రెండ్లీ సర్కారు అంటూ తన రెండో ఇన్నింగ్స్ స్టార్టింగ్ నుంచి చెప్పారు.

దీనికి తగ్గట్లే ఆయన.. అదే వైఖరిని ప్రదర్శించారు. కాకపోతే.. చంద్రబాబుతో వచ్చిన ఇబ్బందేమంటే.. అయితే కఠినంగా ఉండటం. లేదంటే.. నెత్తికి ఎక్కించుకోవటం. తొమ్మిదిన్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో ఆయన చాలా కఠినంగా ఉండేవారు. తాజాగా ముఖ్యమంత్రి అయిన తర్వాత.. ప్రభుత్వ ఉద్యోగులకు తాను దూరం కాకూడదని.. వారికి తన పట్ల వ్యతిరేకత రాకూడదన్న ఉద్దేశ్యంతో వారేం చేసినా చూసీచూడనట్లుగా వ్యవహరించటం మొదలు పెట్టారు.

దీంతో.. ప్రభుత్వ ఉద్యోగులు ఆడిందే ఆటగా.. పాడిందే పాటగా మారిపోయింది. గతంలో చంద్రబాబు సీఎం అంటే గజగజ వణికిపోయే ఉద్యోగులు కాస్తా.. ఇప్పుడు లైట్ తీసుకోవటంతో పాలన పడకేసిన పరిస్థితి. మారిన చంద్రబాబు కారణంగా ప్రభుత్వ ఉద్యోగుల్లో అలసత్వం భారీగా పెరిగిపోయింది. ఈ విషయాన్ని గుర్తించి.. చంద్రబాబు తన వైఖరిని మార్చుకోవాలని నిర్ణయించుకునేసరికి 18 నెలల పుణ్యకాలం గడిచిపోయింది.

ఈ మధ్య కాలంలో బాబు మెతకగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. పార్టీ నేతల దగ్గర నుంచి ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారం వరకూ ఆయన చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారని.. దీని వల్ల పాలనలో ఇష్టారాజ్య తత్వం ఎక్కువైందన్న విమర్శ ఉంది. ఈ వ్యవహారం చర్చ బాగా పెరిగి.. బాబు దృష్టికి వెళ్లటంతో ఆయనలోని ‘‘అసలు బాబు’’ నిద్ర లేచారు.

అయితే.. మరీ కఠినంగా.. అలా అని మరీ మెతకదనంతో కాకుండా వయా మీడియాగా వ్యవహరించాలన్న విషయాన్ని బాబు మిస్ కావటమే ఈ మొత్తం ఎపిసోడ్ లో గుర్తించాల్సిన అంశం. తాజాగా శనివారం మొదలైన జన్మభూమి కార్యక్రమంలో భాగంగా అటు డాక్టర్లను.. ఇటు రెవెన్యూ సిబ్బందిపైనా తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. ‘‘పాత రోజులు పోయాయి. పని చేయకుంటే ఇంటికే’’ అంటూ నిప్పులు చెరగటంతో పాటు.. ‘‘లాంగ్ లీవ్ తీసుకొని దీర్ఘకాలం ఉద్యోగాలకు హాజరు కాని వైద్యుల్నిశాశ్వితంగా సస్పెండ్ చేస్తాం’’ అంటూ వైద్యుల విషయంలో కన్నెర్ర చేశారు. నిన్నమొన్నటివరకూ అసలేమీ పట్టించుకోని చంద్రబాబు.. రాత్రికి రాత్రే మారిపోయినట్లుగా వ్యవహరించటం అంత మంచిది కాదన్న విషయాన్ని గుర్తించాలి. మార్పు ఒక క్రమపద్ధతిలో ఉండలే కాదు.. ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలా ఉండాలి. కెరటం ఎంత ఎత్తు ఎగిసినా.. మళ్లీ వెనక్కి మళ్లుతుందన్న విషయం బాబు గుర్తిస్తే మంచిదే. ఆగ్రహం మంచిదే కానీ అది ఎవరూ వంకపెట్టలేనిదిగా.. ఎవరి మనసుల్ని కష్టపెట్టని విధంగా ఉండాలే కానీ.. అందరి ముందు ఒకరిని అవమానించి.. తానో సూపర్ హీరోలా అవతరించాలనే ప్రయత్నమే అభ్యంతరకరమన్నది మర్చిపోకూడదు.