Begin typing your search above and press return to search.

జగన్ అండ్ కో గాలి తీసేసిన చంద్రబాబు

By:  Tupaki Desk   |   17 Dec 2015 10:33 AM GMT
జగన్ అండ్ కో గాలి తీసేసిన చంద్రబాబు
X
ఏపీ అసెంబ్లీ తొలి రోజునే పాలక - విపక్షాల మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి. వైసీపీ గొడవ ఎక్కువ కావడంతో చివరకు చంద్రబాబు కూడా జోక్యం చేసుకుని జగన్ పార్టీని దుమ్మెత్తి పోయాల్సి వచ్చింది. వైసీపీ తీరుపై చంద్రబాబు విరుచుకుపడ్డారు. వైసీపీ మొండిపట్టు కారణంగా శాసనసభలో అంబేద్కర్‌ అంశం చర్చకు రాకుండా పోయిందని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అంబేద్కర్‌ 125వ జయంతి ఉత్సవాల గురించి చర్చించాల్సి ఉండగా వైకాపా నేతలు అడ్డుపడ్డారని చంద్రబాబు అన్నారు. వైకాపా అధినేత జగన్‌ ఏం చెబితే ఆ పార్టీ సభ్యులు అదే చేస్తున్నారని ఆయన అన్నారు. వైకాపాలో జగన్‌ తో సహా అందరూ సభకు కొత్తవారే కావడం వల్ల ఇబ్బంది తలెత్తుతోందని ఆయన చెప్పారు. చంద్రబాబు ఆ మాట అనగానే పాలక పక్ష సభ్యులు పెద్దపెట్టున బల్లలు గుద్ది మద్దతు ప్రకటించారు. జగన్ - ఆయన బృందం అనుభవ శూన్యతను ఎత్తి చూపడంతో పాటు ''కొత్త బిచ్చగాళ్లు పొద్దెరగరు'' అన్న అర్థం వచ్చేలా ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు చెప్తున్నారు. శాసన సభ మొదలైంది మొదలు నిమిషం గ్యాప్ ఇవ్వకుండా వైసీపీ ఎమ్మెల్యేలు అల్లరి చేస్తుండడం... వారిలో ఎక్కువగా తొలిసారి ఎన్నికైనవారే ఉండడంతో చంద్రబాబు ఈ కామెంట్ చేశారు.

కాగా అంతకు ముందు చంద్రబాబు... విపక్ష సభ్యుల నిరసనలు - నినాదాల మధ్యనే కాల్ మనీ వ్యవహారంలో ఎవరినీ విడిచిపట్టేది లేదని ప్రకటించారు. అదే విధంగా సభలో విపక్ష సభ్యుల ప్రవర్తన సిగ్గుతో తలదించుకునేలా ఉందని అన్నారు. సభా మర్యాదలూ - నిబంధనలను పట్టించుకోకుండా వారు ప్రవర్తిస్తున్న తీరు ప్రజాస్వామ్యాన్ని కించపరిచేదిగా ఉందని పేర్కొన్నారు. కాల్ మనీ వ్యవహారంపై రేపు చర్చకు సిద్ధమని ప్రభుత్వం స్పష్టం చేసినా వారు ఆందోళన కొనసాగించడం సరికాదన్నారు.