Begin typing your search above and press return to search.

సీఎం మాట: పాత్రికేయులా? ఉగ్రవాదులా?

By:  Tupaki Desk   |   6 Jan 2016 5:19 AM GMT
సీఎం మాట: పాత్రికేయులా? ఉగ్రవాదులా?
X
అధికారంలో ఉన్న‌వారు త‌ప్పొప్పుల‌ను ప్ర‌శ్నిస్తే స‌హించి స‌ర్దుకొని పోవాల్సింది పోయి త‌మ ఆక్రోశాన్ని ఆవేశాన్ని వెల్ల‌గ‌క్కుతున్నారు. ప‌రుష ప‌దాల‌ను ఉప‌యోగిస్తున్నారు. ముఖ్య‌మంత్రి స్థాయిలో ఉన్న‌వారు సైతం ఇందుకు అతీతం కాక‌పోవ‌డం బాధాక‌రం. కొద్దికాలం క్రితం తెలంగాణ సీఎం కేసీఆర్ వ‌రంగ‌ల్‌ లో మాట్లాడుతూ వ్య‌తిరేక వార్త‌లు రాస్తే నిలువునా పాతిపెడ‌తాన‌ని మీడియాను ఉద్దేశించి ఫ‌త్వా జారీ చేశారు. తాజాగా ఈ వ‌రుస‌లో ఏపీ సీఎం చంద్ర‌బాబు చేరిపోయారు.

జ‌న్మ‌భూమి-మా ఊరు కార్య‌క్ర‌మంలో భాగంగా ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం రాయవరం గ్రామంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాత్రికేయులపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. స్థానికంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో వారు వివిధ ప్రశ్న‌లు అడ‌గ‌గా అందుకు స్పందిచిన చంద్ర‌బాబు...పాత్రికేయులా? తీవ్రవాదులా అని ప్ర‌శ్నించారు. దీంతో అవ‌మానంగా భావించిన పాత్రికేయులు మౌన ప్రదర్శన చేపట్టారు. సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం వరకూ ప్లకార్డులు చేతబట్టి ర్యాలీ నిర్వహించారు. అనంతరం సబ్‌ కలెక్టర్‌ కు వినతిపత్రం అందజేశారు. య‌థావిధిగా ఈ కామెంట్లు రాజ‌కీయ రంగును పులుముకున్నాయి. ప్ర‌తిప‌క్ష వైఎస్ ఆర్ కాంగ్రెస్ స‌హా - కాంగ్రెస్‌ - లెఫ్ట్ పార్టీలు చంద్ర‌బాబు కామెంట్ల‌పై అభ్యంత‌రం వ్య‌క్త చేశాయి. దీనిపై తెలుగుదేశం నాయ‌కులు వివ‌ర‌ణ ఇస్తూ...ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌స్తావించ‌కుండా ప‌లు విష‌యాల‌ను వ‌క్రీకరిస్తూ అడిగిన ఓ వ్య‌క్తిని ఉద్దేశించి చంద్ర‌బాబు అలా అన్నారే త‌ప్పితే మొత్తం మీడియాను కాద‌ని తెలిపారు.