Begin typing your search above and press return to search.

వాళ్ల‌ను అణిచివేసి, కేసులు పెడ‌తా : బాబు

By:  Tupaki Desk   |   3 July 2017 7:07 AM GMT
వాళ్ల‌ను అణిచివేసి, కేసులు పెడ‌తా : బాబు
X
త‌న‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ప్ర‌చారంపై ఏపీ ముఖ్య‌మంత్రి - తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు మ‌రోమారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అది కూడా త‌న‌కు అత్యంత ప్రీతిపాత్ర‌మైన రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో కావ‌డంతో స‌రైన స‌మ‌యం కోసం ఎదురుచూసిన బాబు త‌న ఆగ్ర‌హాన్ని అధికారుల ముందు ప్ర‌ద‌ర్శించారు. రాజధాని నగరాభివృద్ధి ప్రణాళికల అమలు - సింగపూర్ కన్సార్టియం ఆఫ్ కంపెనీలతో త్వరలో చేసుకోనున్న కన్సార్టియం అగ్రిమెంట్ - తదితర అంశాలపై రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సిఆర్‌ డిఎ) అధికారులతో ముఖ్యమంత్రి టెలికాన్ఫరెన్స్‌లో సమీక్షించారు. ఈసందర్భంగా రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులకు ఆర్థిక సహకారం అందించవద్దంటూ ప్రపంచ బ్యాంకుకు రైతుల పేరిట లేఖలు రాయడంపై మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలను ఏమాత్రం ఉపేక్షించేందుకు వీల్లేదని అధికారులకు సూచించారు.

అభివృద్ధి పనుల నుంచి ప్రభుత్వ దృష్టిని మరల్చేందుకే ఇలాంటి కుట్రలన్నీ చేస్తున్నారని చంద్ర‌బాబు ఆరోపించారు. ‘రాజధాని నగరం అమరావతి రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణమయ్యేలా కడతా. భగవంతుడు నాకు ఇచ్చిన ఆ బాధ్యతను నెరవేర్చి జన్మను చరితార్థం చేసుకుంటా. అప్పటిదాకా ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించాలని ప్రయత్నించినా వాటిని అధిగమించుకుంటూ ముందుకెళతా. రాజధాని ప్రాంత రైతులు నాపై ఉంచిన విశ్వాసాన్ని ఎన్నటికీ వమ్ము చేయను. ప్రపంచంలోనే మేటి నగరంగా అమరావతిని నిర్మించేదాకా విశ్రమించను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ‘కోపం ఉంటే నాపైనే నేరుగా తీర్చుకోండి. రాష్ట్రంపైనా, అమాయకులైన రాజధాని ప్రాంత రైతులపైనా కొందరికి ఎందుకంత కక్ష? వారి పేరిట ప్రపంచ బ్యాంకుకూ, కేంద్ర ప్రభుత్వ సంస్థలకూ తప్పుడు లేఖలెందుకు రాయడం? రైతుల నోట్లో మట్టికొట్టే ప్రయత్నాలు ఎందుకు చేయడం? నన్ను నమ్మి దాదాపు 40వేల కోట్ల రూపాయల విలువైన 33,500 ఎకరాల భూమిని ఇవ్వడమే రైతులు చేసిన పాపమా? ఇలాంటి చర్యలకు పాల్పడి అమరావతిని అడ్డుకునే ప్రయత్నం చేయడం న్యాయమా? ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకునేది లేదు. ఇలాంటి వాటిని గట్టిగా అణచివేస్తాం’ అని స్పష్టం చేశారు. న్యాయపరంగా చర్యలు తీసుకుంటామని, ఇదే సమయంలో రాజధాని ప్రాంత అభివృద్ధి పనులను వేగవంతం చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరికీ హక్కు - అధికారం ఉండేలా రాజధానిని నిర్మిస్తామన్నారు. అమరావతి అభివృద్ధికి ప్రపంచ బ్యాంకు రుణాన్ని సాధించి తీరుతామన్నారు.

రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులు 1,27,505 మంది కాగా, తాము నిర్వహించిన సర్వేలో కేవలం 150 మందే పాల్గొన్నారని ప్రపంచ బ్యాంకు వెబ్‌ సైట్ పేర్కొందని చంద్రబాబు చెప్పారు. ప్రభుత్వ నిబద్ధతపై రాజధాని ప్రాంత రైతుల్లో ఉన్న విశ్వాసానికి ఇంతకంటే ప్రతీక ఇంకేమి కావాలని ప్రశ్నించారు. వాస్తవానికి రాజధాని నగర నిర్మాణంపై అడ్డుపడే కుట్రలు ఈనాటివి కావని, 2016 అక్టోబర్ 8 నుంచే మొదలయ్యాయన్నారు. ‘సవాళ్లు నాకు కొత్తకాదు. భారత్‌ లో తొలిసారిగా 1997-98లోనే విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చాను. అందులో భాగంగా ఆనాడు దాదాపు రూ.4,500 కోట్ల రుణం అందించేందుకు ప్రపంచ బ్యాంకు ముందుకొస్తే అప్పుడు అడ్డంకులు సృష్టించారు. మరేమైంది? వారి ఆశ అడియాస అయింది. మేం చేపట్టిన విద్యుత్ సంస్కరణలు విజయవంతం అయ్యాయి. ఇప్పుడు విద్యుత్ స్వయం సమృద్ధి సాధించి ప్రజలకు కరెంట్ సరఫరా చేయటానికి నేను ప్రవేశపెట్టిన ఈ సంస్కరణలే కారణమయ్యాయి’ని పేర్కొన్నారు. రాజధాని నగరాభివృద్ధిని అడ్డుకునేందుకు చేసే ప్రయత్నాలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూనే ఈ కుట్రల వలలో ఎక్కడా పడకుండా రాజధాని ప్రాంత అభివృద్ధి కార్యక్రమాలను పక్కా ప్రణాళికల ప్రకారం సాగే ద్విముఖ వ్యూహంతో అధికారులు ముందుకు సాగాలని ముఖ్యమంత్రి సూచించారు.

రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేసేలా చేస్తున్న కుట్రలను ప్రజలు గుర్తిస్తున్నారని చంద్ర‌బాబు తెలిపారు. రాష్ట్ర ప్రజలకు జీవనరేఖ లాంటి పోలవరం ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఈ వ్యక్తులు చేయని ప్రయత్నాలు లేవని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వానికి, అటవీ, పర్యావరణ శాఖకు - గ్రీన్ ట్రిబ్యునల్‌ కూ - సుప్రీంకోర్టుకూ వెళ్లారని, అమరావతి విషయంలోనూ ఇదే విధానాన్ని అవలంబించారన్నారు. మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి అమరావతి డెవలప్‌ మెంట్ కార్పొరేషన్ త్వరలో కన్సార్టియం ఆఫ్ సింగపూర్ కంపెనీలతో షేర్ హోల్డర్ల అగ్రిమెంట్లను త్వరగా చేసుకోవాలని ఆదేశించారు. రాజధాని ప్రాంతంలో శాసనసభ, శాసనమండలి భవన సముదాయాలు - రాజ్‌ భవన్ - హైకోర్టు - ప్రభుత్వ కార్యాలయ సముదాయాల సచివాలయం వంటి భవనాలతో సహా, నవ నగరాల రూపకల్పనలోనూ జోరు పెంచాలని సిఆర్‌డిఎ అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు రాజధానిలో కార్యకలాపాలను చేపట్టేందుకు ముందుకొచ్చిన ప్రముఖ విద్యాసంస్థలు ఈ విద్యా సంవత్సరం నుంచే తరగతులు ప్రారంభిస్తున్నాయని ఆయన వివరించారు. విట్ - ఎస్‌ ఆర్‌ ఎం వంటి సంస్థలు ఈ ఏడాది నుంచే తమ కార్యకలాపాలను చేపట్టాయని, మిగిలిన సంస్థలూ ఇదే తరహాలో సంస్థలను నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/