Begin typing your search above and press return to search.

అదేంది బాబు.. విమర్శ రాస్తే కొనేసినట్లేనా?

By:  Tupaki Desk   |   14 Feb 2017 4:49 AM GMT
అదేంది బాబు.. విమర్శ రాస్తే కొనేసినట్లేనా?
X
ఉప్పు కారం తిన్న మనిషికి కోపం.. అసహనం లాంటివి మామూలే. కాకుంటే.. అది హద్దుల్లోనే ఉండాలి. హద్దులు దాటితే దానితో మా చెడ్డ చిరాకు. ఏపీ సీఎం చంద్రబాబు తీరు ఇప్పుడు ఇంచుమించు ఇదే తీరులో ఉందని చెప్పాలి. తనకు నిత్యం భజన చేసే మీడియాకు భిన్నంగా విమర్శల్ని వేలెత్తి చూపించే ఏ చిన్న వైఖరిని ఆయన తట్టుకోలేకపోతున్నారు. మీడియా తన పని తాను చేసుకోనివ్వకుండా నేతలు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటం సమకాలీన రాజకీయాల్లో చాలా మామూలైంది. ఏ స్థాయి అధినేత అయినా.. మీడియా విషయంలో తమకున్న అసంతృప్తిని.. అసహనాన్ని వ్యక్తం చేసేందుకు ఎంతమాత్రం వెనుకాడటం లేదు.

తాజాగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యవహారమే తీసుకోండి. ఆయన పాలనపైనా.. ఆయన నిర్ణయాలపైనా ఆయనకు ఓపెన్ గా మద్దతు ఇచ్చే మీడియా సంస్థలు నెగిటివ్ వార్త రాసేందుకు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. గతంలోఇలాంటి తీరు ఉండేది కాదు. మద్దతు ఇచ్చినా..తప్పు చేస్తే.. తప్పు చేసిందన్న మాటను సూటిగా చెప్పేసేవారు. కానీ.. ఇప్పుడు ట్రెండ్ మారింది. తాము తప్పు చేస్తే.. దాన్ని కవర్ చేయాలన్నట్లుగా ప్రభుత్వాధినేతలు ఫీల్ కావటం ఎక్కువైంది. ఒకవేళ విమర్శలు చేస్తే.. సదరు మీడియాపైన ఫైర్ కావటం కనిపిస్తోంది.

మీడియా ఫ్రెండ్లీ ముఖ్యమంత్రిగా పలువురు అభివర్ణించే ముఖ్యమంత్రి చంద్రబాబు లాంటి వారు సైతం తమపైన వచ్చే చిన్న చిన్న నెగిటివ్ వార్తలకు సైతం భారీగా స్పందిస్తున్న ధోరణి ఈ మధ్యన ఎక్కువ అవుతోంది. తనను ఎవరూ తప్పు పట్టకూడదు.. లోపాలు వెతక్కూడదన్నట్లుగా ఆయన వైఖరి ఉండటం గమనార్హం. ఇటీవల జరిగిన జాతీయ మహిళా పార్లమెంటరీ సదస్సుపై కొన్ని మీడియా సంస్థల్లో వచ్చిన వార్తలపై బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు.

కొందరు డెలిగేట్స్ ఆవులిస్తే.. నిద్రపోతున్నట్లుగా కొన్న పత్రికల్లో రాశారన్న బాబు.. ఇదంతా తప్పంటూ ఫైర్ కావటం విశేషం. ‘‘మీకు అవలింతలు రావా’’ అని ప్రశ్నించటమే కాదు.. జాతీయ మీడియా డబ్బులకు అమ్ముడుబోయిందని మండిపడ్డారు. వ్యతిరేకంగా రాస్తే ఎవరికో అమ్ముడుబోయినట్లగా ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారు వ్యాఖ్యానించటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వ్యతిరేకంగా రాస్తేనే అమ్ముడుబోయినట్లైయితే.. అనుకూలంగా రాసే వారు కూడా అమ్ముడుబోయినట్లేనా? అంటూ ప్రశ్నిస్తున్న వారికి బాబు ఏం సమాధానం చెబుతారు? తనను.. తన నిర్ణయాల్ని తప్పు పట్టేవారంతా అమ్ముడుబోయినట్లుగా బాబుకు కనిపించటం చూస్తుంటే.. విమర్శల్ని సానుకూలంగా స్వీకరించే గుణం బాబులో బాగా తగ్గిపోయిందన్న భావన కలుగుతోంది. మొత్తానికి తననుతప్పు పట్టేవారు ఎవరికైనా సరే రంకు అంటగట్టేసే చంద్రబాబు తన టాలెంట్ ను మరోసారి ప్రదర్శించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/