Begin typing your search above and press return to search.

రోజాకు ఏడాది అయితే..బాబుకు ఎంత కాల‌మేయాలో?

By:  Tupaki Desk   |   21 March 2017 4:40 AM GMT
రోజాకు ఏడాది అయితే..బాబుకు ఎంత కాల‌మేయాలో?
X
చ‌ట్ట‌స‌భల్లో స‌భ్యుల ప్ర‌వ‌ర్త‌న‌కు సంబంధించి నియ‌మావ‌ళి ప‌క్కాగానే ఉంది. అది ఇటు విప‌క్షంతో పాటు అటు అధికార ప‌క్షానికి కూడా వ‌ర్తిస్తుంద‌న్న‌ది అక్ష‌ర స‌త్యం. నియ‌మావ‌ళి ప‌క్కాగానే ఉన్నా... దాని అమ‌లు తీరు చూస్తేనే ఆశ్చ‌ర్యం వేయ‌క మాన‌దు. ఎందుకంటే... నియ‌మావ‌ళి ఉన్న‌ది ఒక్క విప‌క్షం కోస‌మేన‌న్న రీతిలో ఏపీలో అధికార ప‌క్షం టీడీపీ వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న అంత‌కంత‌కూ పెరుగుతోంది. కాల్ మ‌నీ రాక్ష‌సుల దుర్మార్గాల‌ను ప్ర‌శ్నించే క్ర‌మంలో టీడీపీకి చెందిన ద‌ళిత ఎమ్మెల్యే వంగ‌ల‌పూడి అనిత‌ను అస‌భ్య ప‌ద‌జాలంతో దూషించార‌న్న ఓ నెపంతో వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజాను ఏకంగా ఏడాది పాటు స‌భ‌లోకి అడుగుపెట్ట‌నీయ‌కుండా టీడీపీ స‌ర్కారు వేటు వేసింది. అయినా మ‌రో ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ వేటు వేసేందుకు కార్య‌రంగం సిద్ధం చేసింది. అస‌లు నాడు రోజా చేసిన వ్యాఖ్య‌లు ఏమిట‌న్న విష‌యం బ‌య‌ట‌కే రాలేదు. కాల్ మ‌నీ రాక్ష‌సుల‌కు వ‌త్తాసుగా నిల‌బ‌డుతున్నారంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్న క్ర‌మంలో సంధించిన విమ‌ర్శ‌ల్లో రోజా కాస్తంత ఆవేశ‌పూరితంగా మాట్లాడి ఉండ‌వచ్చు గానీ... ఎక్క‌డ కూడా ఆమె చేసిన వ్యాఖ్య‌లేమిట‌న్న విష‌యం తెలియ‌దు.

స‌రే... రోజా విప‌క్షానికి చెందిన ఎమ్మెల్యే కాబ‌ట్టి... అధికార ప‌క్షం హోదాలో టీడీపీ స‌ర్కారు ఆమెపై వేటు వేసింది. శిక్ష పూర్త‌య్యే దాకా నిద్ర‌పోయిన ప్రివిలేజెస్ క‌మిటీ... ఆన‌క తీరిగ్గా నిద్ర మేల్కోని మ‌రో నివేదిక‌ను స‌భ‌కు స‌మ‌ర్పించింది. రోజా క్ష‌మాప‌ణ చెప్పార‌ని, అయితే ఈ క్ష‌మాప‌ణ బేష‌ర‌తుగా లేద‌ని, దీంతో మ‌రో ఏడాది పాటు ఆమెపై స‌స్పెన్ష‌న్ వేటు వేయాల‌ని స్పీకర్‌ కు సిఫార‌సు చేసింది. దీనిపై ప్ర‌భుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్న‌ల్ వ‌స్తే... అప్పుడు రోజాపై వేటు వేసేందుకు స్పీక‌ర్ కార్యాల‌యం సిద్ధంగా ఉంద‌న్న విష‌యం దాదాపుగా సామాన్య జ‌నానికి కూడా అర్థ‌మైన ప‌రిస్థితి. ఇదంతా బాగానే ఉన్నా... నిన్న నిండు స‌భ‌లో స‌భా నాయ‌కుడి హోదాలో ఉన్న సీఎం నారా చంద్ర‌బాబునాయుడు... విపక్షానికి చెందిన 50 మంది దాకా స‌భ్యుల‌ను దునుమాడారు. అన‌రాని మాట‌ల‌న్నారు. అల‌గా జ‌నం జ‌నం అంటూ జ‌గ‌న్ స‌హా, విప‌క్ష స‌భ్యుల‌పై ఆయ‌న ఘాటు వ్యాఖ్య‌లు చేశారు. మీ గుండెల్లో నిద్ర‌పోతా. మీ బండారం బ‌య‌ట‌పెడ‌తా, మీ అంతు చూస్తా. పుట్ట‌గ‌తులు ఉండ‌వు అంటూ బాబు నోట అన‌రాని మాట‌లు వెల్లువ‌లా వ‌చ్చాయి.

అంటే విప‌క్ష స‌భ్యుల‌పై చంద్ర‌బాబు బెదిరింపు ధోర‌ణిలోనే మాట్లాడి స‌భా నియ‌మాల ఉల్లంఘ‌న‌కు పాల్ప‌డ్డార‌న్న మాటేగా. ఇదే విష‌యంపై స‌మాలోచన చేసిన విప‌క్షం ఆయ‌న‌పై స‌భా హక్కుల ఉల్లంఘ‌న నోటీసు జారీ చేసే దిశ‌గా యోచిస్తున్న‌ట్లు స‌మాచారం. అయినా... నియ‌మావ‌ళి ఒక్క విప‌క్షానికే వ‌ర్తిస్తుంద‌న్న భావ‌న‌తో ఉన్న టీడీపీ స‌ర్కారు...ఈ విష‌యాన్ని అంత‌గా ప‌ట్టించుకునే పాపాన పోలేదులే అన్న విశ్లేష‌ణ సాగుతోంది. అలా కాకుండా... స‌భా నియ‌మావ‌ళి అటు విప‌క్షంతో పాటు ఇటు అధికార ప‌క్షానికి కూడా స‌మానంగా వ‌ర్తింప‌జేస్తే... ఒక్క స‌భ్యురాలిపైనే ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన రోజాపై ఏడాది పాటు స‌స్పెన్ష‌న్ వేటు ప‌డితే... దాదాపు 50 మందిని క‌ట్ట‌గ‌ట్టి నిండు స‌భ‌లో నోటికొచ్చిన‌ట్లు మాట్లాడిన చంద్ర‌బాబుకు ఎన్నేళ్లు స‌స్పెన్ష‌న్ విధించాలో అంటూ విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/