Begin typing your search above and press return to search.

మైలేజీ మత్తులో తప్పు మీద తప్పేంటి బాబు?

By:  Tupaki Desk   |   3 Aug 2016 11:30 AM GMT
మైలేజీ మత్తులో తప్పు మీద తప్పేంటి బాబు?
X
రాజకీయాల్లో అవకాశం ఇవ్వటానికి మించిన తప్పు మరొకటి ఉండదు. ప్రత్యర్థికి ఏ మాత్రం అవకాశం ఇచ్చినా చెలరేగిపోతారు. ఈ విషయం అపార రాజకీయ అనుభవం ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ.. ఆయన కొన్ని అంశాల్లో తప్పుల మీద తప్పులు చేస్తూ కనిపిస్తారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరి ఏపీ ప్రజల్ని ఎంతగానో బాధిస్తోంది. ఏం తప్పు చేశామని.. కేంద్రం తమ పట్ల ఇలా వ్యవహరిస్తుందన్న ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి. అదే సమయంలో.. హోదా మీద కేంద్రాన్నిగట్టిగా నిలదీసేందుకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్దంగా లేని దుస్థితి. కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు తనకు తానుగా పెట్టిన హోదాపై ప్రైవేటు బిల్లు కారణంగానే ఇంత చర్చ జరుగుతుంది కానీ.. అదే బిల్లు పెట్టకపోయి ఉంటే.. అసలీ అంశం ఇష్యూ అయ్యేదే కాదు.

హోదా విషయంలో వెనక్కి తగ్గేది లేదని... ఏపీకి హోదా ఎంతో అవసరమని చెబుతున్న చంద్రబాబు.. కేవీపీ కంటే ముందే తనకు తానుగా ఈ బిల్లును ఎందుకు పెట్టలేదన్న ప్రశ్నకు సమాధానం లభించదు. కేంద్రంలో తాము మిత్రపక్షంగా ఉండటం వల్లే బిల్లు పెట్టలేదన్న వాదనే తీసుకొస్తే.. ఈ రోజున లోక్ సభలో వాయిదా తీర్మారాన్ని ఇవ్వటం.. లోక్ సభలో కేంద్రానికి మిత్రపక్షంగా ఉండి మరీ పెద్ద ఎత్తున ఆందోళనలు చేయటం లాంటివి చూసినప్పుడు.. కేవీపీ మాదిరే ఎప్పుడో ప్రైవేటు బిల్లు పెట్టాల్సింది.

ఇప్పుడు హోదా మీద ఇన్ని మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు.. హోదా మీద కమిట్ మెంట్ ఉండి ఉంటే.. కేవీపీ కంటే ముందే తానే ప్రైవేటు బిల్లు పెట్టి.. తనకున్న కమిట్ మెంట్ ను చాటుకుంటే సరిపోయేది. కానీ.. అలాంటిదేమీ లేకుండా ఇప్పటికే తప్పుచేసిన బాబు.. ఇప్పుడు హోదా మీద విపక్షాలు చేస్తున్న నిరసనలపై ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు తీరు చూసినప్పుడు అనిపించేది ఒక్కటే.. హోదా అంశంపై కేంద్రం సానుకూలంగా స్పందించినా.. స్పందించకున్నా.. ఈ ఇష్యూకు సంబంధించిన మైలేజీ మొత్తం తనకే సొంతం కావాలన్నట్లుగా ఆయన తీరు ఉందన్న విమర్శ వినిపిస్తోంది. దీనికి నిదర్శనంగా హోదా అంశంపై విపక్షాలు చేసిన బంద్ మీద ఆయన విరుచుకుపడుతున్న వైనం చూస్తే ఇట్టే అర్థమవుతుంది.

బంద్ కారణంగా రాష్ట్రానికి ఎంతో నష్టం జరిగిందని చెబుతున్న ఆయన మాటల్ని పలువురు తప్పుపడుతున్నారు. లాజిక్కుకు ఏ మాత్రం అందని రీతిలో బాబు మాటలు ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ప్రత్యేకహోదా మీద ఇప్పటివరకూ తనకు తానుగా ఏమీ చేయని చంద్రబాబు..ఈ రోజు కేవీపీ పెట్టిన ప్రైవేటు బిల్లు సందర్భంగా రగిలిన రచ్చను క్యాష్ చేసుకోవాలన్న ఆరాటమే తప్పించి హోదా మీద ప్రత్యేకంగా పోరాటం చేయాలన్న భావన ఎక్కడా కనిపించటం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మైలేజీ అన్నది ఆటోమేటిక్ గా రావాలే కానీ.. అందరిని తప్పు పడుతూ.. తాను మాత్రమే ఒప్పలు చేస్తున్నట్లుగా చెప్పుకున్నంతనే పేరు ప్రఖ్యాతులు సొంతం అవుతాయనుకుంటే తప్పులో కాలేసినట్లే.