Begin typing your search above and press return to search.

బాబు ఫైర్ః ప్ర‌తిప‌క్షం పాక్ ఉగ్ర‌వాదులు ఒక్క‌టే

By:  Tupaki Desk   |   23 Oct 2016 6:55 AM GMT
బాబు ఫైర్ః ప్ర‌తిప‌క్షం పాక్ ఉగ్ర‌వాదులు ఒక్క‌టే
X
ప‌దేళ్ల పాటు ఉమ్మ‌డి రాష్ట్రంలో ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు న‌వ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి హోదాలో విప‌క్షాల‌పై విరుచుకుప‌డుతున్నారు. సంద‌ర్భం చిక్కిన‌పుడల్లా ప్ర‌తిప‌క్షాల‌పై ఫైర్ అయ్యే చంద్ర‌బాబు తాజాగా తూర్పు గోదావరి జిల్లా కేంద్రం కాకినాడలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ - దోమలపై దండయాత్ర కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ప్ర‌తిప‌క్షాల‌ను ఉగ్ర‌వాదుల‌తో పోల్చారు.

రాష్ట్రంలో ప్రతిపక్షం తీవ్రవాదుల కంటే దారుణంగా మారిందని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. పాకిస్తాన్ మిలిటెంట్లు - తీవ్రవాదులు మన దేశంపై ఏ విధంగా అక్రమంగా దాడులకు దిగుతున్నారో - అదేవిధంగా రాష్ట్రంలో కొందరు ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కొందరు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, మరికొందరు రాష్ట్రంలో కులాలను రెచ్చగొడుతున్నారని బాబు అన్నారు. సమాజాన్ని అతలాకుతలం చేయడం మంచిది కాదని, ఒక వర్గంపై అభిమానం,

ఒక వర్గంపై విద్వేషం ఎంతమాత్రం సమర్ధనీయం కాదన్నారు. హైదరాబాద్ నగరం నేడు మతకలహాలు లేకుండా ప్రశాంతంగా ఉందంటే అందుకు కారణం తానేనని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. తాను ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌ లో మతకలహాలు రూపుమాపానని - అప్పట్లో రాష్ట్రంలో తీవ్రవాదాన్ని నిర్మూలించడానికి ప్రయత్నించి, అలిపిరిలో తీవ్రవాదుల దాడికి గురయ్యానన్నారు. ఆ ఘటనలో 24 క్లైమోర్ మైన్స్‌ ను ఉపయోగించినప్పటికీ బతికి బట్టకట్టానంటే అందుకు శ్రీ వేంకటేశ్వరస్వామి దయ మాత్రమే కారణమని చంద్ర‌బాబు చెప్పారు. .

గత ఎన్నికల్లో పిఠాపురంలో కాపులను బీసీల్లో చేరుస్తామంటూ తానే హామీనిచ్చి - ఎన్నికల మ్యానిఫెస్టోలో ఉంచానని బాబు గుర్తు చేశారు కాపుల కోసం వెయ్యి కోట్లు కేటాయించి - కార్పొరేషన్‌ ను ఏర్పాటుచేశానన్నారు. కమిషన్‌ ను కూడా ఏర్పాటుచేశామని - స్మార్ట్‌ పల్స్ సర్వే ప్రక్రియ పూర్తయిన పిమ్మట ఎలా చేయాలన్న దానిపై ఒక నిర్ణయం తీసుకుంటామని బాబు తెలిపారు. చెప్పారు. రాష్ట్రంలో బీసీలకు అన్యాయం జరగదని - ఎస్సీ ఎస్టీ బీసీ సబ్‌ ప్లాన్స్‌ ను అమలుచేస్తున్నట్టు చెప్పారు. అగ్రవర్ణాలలో పేదల అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలను స్మార్ట్‌ సర్వే ప్రక్రియ అనంతరం చేపట్టనున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు. ఉభయ గోదావరి జిల్లాలు తనకు అత్యంత ప్రియమైనవన్నారు. ఇక్కడి ప్రజలు సౌమ్యులని అన్నారు. గ్రామగ్రామాన పశువుల పేడను డ్వాక్రా మహిళలు తూకం విధానంలో సేకరించి, దానిని వర్మీ కంపోస్ట్‌ గా మార్చేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. గ్రామాలలో పశువుల హాస్టల్స్ ఏర్పాటుచేసి - డ్వాక్రా సంఘాలకు వాటి నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తామని తెలిపారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/