Begin typing your search above and press return to search.

బాబు.. మీ మాటలతో వారిని దూరం చేసుకుంటున్నారుగా?

By:  Tupaki Desk   |   18 Sep 2019 5:36 AM GMT
బాబు.. మీ మాటలతో వారిని దూరం చేసుకుంటున్నారుగా?
X
రాజకీయం అన్నాక సవాలక్ష ఉంటాయి. అన్నింటికి మించిన రాజకీయ క్రీడ కారణంగా తరచూ బద్నాం అయ్యేది పోలీసులే. అధికారంలో ఉన్న వారి ఆదేశాల్ని అమలు చేయటం పోలీసుల బాధ్యత. పవర్ లో ఏ ప్రభుత్వం ఉన్నా.. పోలీసులు యస్ బాస్ టైపులో వ్యవహరిస్తారే తప్పించి.. సారీ అండి.. మీరు చెప్పినట్లు మేం చేయలేమన్న మాట పోలీసుల నోటి నుంచి రావటం అన్నది ఉండదు.

దీన్ని తప్పు పట్టాల్సిన పనేం లేదు. నీతి.. నిజాయితీ లాంటి మాటల్ని పక్కన పెడితే.. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే పోలీసు వ్యవస్థ తరచూ విపక్షానికి టార్గెట్ అవుతుంటుంది. తమను నిందించే విపక్షం అధికార పక్షం అయ్యాక వారి అవసరం ఒకటైతే.. అప్పటివరకూ అధికారపక్షంగా ఉన్నోళ్లు విపక్షంగా మారినోళ్లు పోలీసుల్ని నిందిస్తారు. ఏమైనా.. ప్రతి సందర్భంలోనూ మాట పడే పరిస్థితి పోలీసుల మీద ఉంటుంది.

ఈ విషయం చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నేతకు తెలియంది కాదు. తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖలో ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని భావించిన నిరసన కార్యక్రమాన్ని అడ్డుకోవటమే కాదు.. నాటి విపక్ష నేత జగన్ ను కనీసం ఎయిర్ పోర్ట్ లాంజ్ లోకి కూడా రానివ్వని వైనం తెలిసిందే. నాడు పోలీసుల తీరును ఖండించే కన్నా.. బాబు ప్రభుత్వ నిర్ణయాన్ని నిందించే ప్రయత్నం చేశారు.

తాజాగా కోడెల ఎపిసోడ్ విషయానికి వచ్చేసరికి.. చంద్రబాబు మాత్రం పోలీసుల మీద దారుణాతి దారుణమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మాటలు పోలీసులకు ఒళ్లు మండేలా చేయటమే కాదు.. కాస్తో కూస్తో ఉండే అభిమానం ఎగిరిపోతుందన్న విషయాన్ని బాబు మిస్ అవుతుంటారు. తాను పవర్లో ఉన్నప్పుడు పోలీసుల్ని ఏ రీతిలో అయితే పని చేయించారో.. తాజా ప్రభుత్వం కూడా అలానే చేస్తుంది. ఆ విషయంలో ఎలాంటి కొత్త విషయం ఉండదన్నది మర్చిపోకూడదు.

అలాంటప్పుడు పని చేయించే ప్రభుత్వాన్ని ప్రశ్నించాలే కానీ.. పోలీసుల్ని నిందించటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండకపోగా.. వారి మనసులకు కలిగే వేదన కారణంగా బాబుపై మరింత గుర్రు పెరగటం ఖాయం. పోలీసుల్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేసినట్లు మాట్లాడటం.. వారిపై తీవ్రమైన ఆరోపణలు చేయటం లాంటి వాటి వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నది మర్చిపోకూడదు. కోడెల ఆత్మహత్య నేపథ్యంలో మాట్లాడిన చంద్రబాబు పోలీసులపై చేసిన వ్యాఖ్యలు చూస్తే.. విస్మయం కలగక మానదు. పోలీసుల్ని మరీ అంత పర్సనల్ గా టార్గెట్ చేయాల్సిన అవసరం ఏమిటన్న సందేహంతో పాటు.. ఇలాంటి పొరపాట్లు బాబు లాంటోళ్లు చేయటమా అనిపించక మానదు.

‘పోలీసులూ.. జాగ్రత్త! మాజీ స్పీకర్‌ కోడెలపై నమోదుచేసిన ప్రతి కేసుకూ మీరు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. చిన్న చిన్న కేసులకూ జీవిత ఖైదు విధించే సెక్షన్లు మోపుతారా? పోలీసులతో పాటు ఆలిండియా సర్వీసెస్‌ ఉద్యోగులు మొత్తం జగన్ ప్రభుత్వానికి సరెండర్ అయ్యారు. ఈ పరిణామం రాష్ట్రానికి అరిష్టం. రెండు నెలల్లో కోడెలపై 19 కేసులు పెట్టారు. ఇవన్నీ గత మూడేళ్లలో జరిగాయంటున్నారు. వేటిలోనూ అవి ఏ తేదీన జరిగాయో చెప్పలేదు. కోడెలకు వ్యతిరేకంగా కేసులు వేయాలని ట్విటర్‌ లో.. జగన్‌ పత్రికలో.. చానల్లో పదే పదే ఆయన్ను విమర్శిస్తూ కథనాలు రాయించారు. చిన్న కేసులకు జీవిత ఖైదు సెక్షన్లు మోపుతారా..? ఒక సైకో ముఖ్యమంత్రి పాలనలో పోలీసులు తమ విధులు మరచిపోతున్నారు’ అంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఇలాంటివి పోలీసులకు ఒళ్లు మండటమే కాదు.. బాబు మీద మరింత గుర్రు పెరుగుతుందన్న విషయాన్ని గుర్తిస్తే మంచిది.