Begin typing your search above and press return to search.

'సాక్షి'పై చంద్రనిప్పులు

By:  Tupaki Desk   |   6 March 2016 7:53 AM GMT
సాక్షిపై చంద్రనిప్పులు
X
వైసీపీ అధినేత జగన్ కు చెందిన సాక్షి పత్రికపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ప్రజల సొమ్మును దోచుకుని జగన్ పెట్టిన సాక్షి పేపర్లో నాలుగు రోజులుగా పిచ్చి రాతలు రాస్తున్నారని ఆయన ఆరోపించారు. రాజధాని నిర్మాణంపై బురద జల్లే ప్రయత్నంలోనే ఇవన్నీ చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన రాజధాని ప్రాంతంలోని భూ లావాదేవీల వివరాలు మీడియాకు వెల్లడించారు.

కొత్త రాజధాని అభివృద్ధి చెందుతున్న నమ్మకంతో ఆ ప్రాంతంలో ఇల్లు ఉండాలని, కొంత భూమి ఉండాలని అందరూ కోరుకుంటారని... అందుకోసం భూములు - స్థలాలు కొంటారని... అందులో తప్పేముందని చంద్రబాబు అన్నారు. ఇటీవల కాలంలో మొత్తం 20306 లావాదేవీలు జరిగి 9231 ఎకరాలు చేతులు మారాయని చంద్రబాబు చెప్పారు. ఇందులో రెండు మూడు సార్లు చేతులు మారిన లావాదేవీలు కూడా ఉన్నాయని ఆయన అన్నారు. ఇళ్ల స్థలాల కోసం 7942 మంది 418 ఎకరాలు కొన్నారని చెప్పిన ఆయన టాప్ 100 లావాదేవీల వివరాలు వెల్లడించారు. అత్యధిక మొత్తంలో కొన్న భూమి విస్తీర్ణం 7.5 ఎకరాలని.... టాప్ 100 లో చిన్న మొత్తం 2.7 ఎకరాలని చెప్పారు. ఈ 100 లావాదేవీల్లో 365.6 ఎకరాలు చేతులు మారాయని చంద్రబాబు చెప్పారు. కాగా రైతులు అమ్మిన పొలాల విస్తీర్ణం 1724 ఎకరాలని తెలిపారు. సాక్షి పత్రిక పథకం ప్రకారం తప్పుడు రాతలతో బురద జల్లుతోందని ఆరోపించారు. అంతేకాదు... తన కుమారుడు లోకేశ్ 425 కోట్ల విలువైన హాయ్ ల్యాండ్ కొన్నారన్న ఆరోపణల్లో నిజం లేదని చంద్రబాబు చెప్పారు. జప్తులో ఉన్న భూమిని ఎలా కొంటారని ప్రశ్నించారు. నిజానికి తాను రాజధాని ప్రాంతంలో భూముల క్రయవిక్రయాలు నిషేధించాలని అనుకున్నానని... కానీ, రైతుల ప్రయోజనాల కోసం ఆ నిర్ణయం మార్చుకున్నానని చంద్రబాబు చెప్పారు.

రాజధానిని అడ్డుకోవడానికి గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ కు వెళ్లారని, అవి ఫలించలేదని ఆయన పేర్కొన్నారు. కొందరు కావాలని రాజధాని పంట భూములను తగులబెట్టారని ఆరోపించారు.