Begin typing your search above and press return to search.
రాజధాని రైతుపై బాబు ఎంతెత్తున లేచారంటే!
By: Tupaki Desk | 12 Feb 2018 10:58 AM GMTనవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కలలు కంటున్నారు. ఈ క్రమంలో ఎక్కడికి వెళ్లినా కూడా అమరావతిని ఆకాశానికెత్తేస్తున్న చంద్రబాబు... పెట్టుబడులతో అమరావతికి రావాలని, మంచి అవకాశాలతో పాటు భారీ సబ్సీడీలు కూడా ఇస్తామని, అనుమతులన్నీ కేవలం రోజుల వ్వవధిలోనే అందజేస్తామని చెప్పిన మాటనే మళ్లీ మళ్లీ చెప్పేస్తున్నారు. బాబు మాటలు ఎంతమంది పారిశ్రామికవేత్తల చెవికి ఎక్కాయో తెలియదు గానీ... అతి కొద్ది మంది ప్రవాసాంధ్రులు మాత్రం అమరావతి వైపు దృష్టి సారిస్తున్నారు. ఒకటి రెండు విద్యా సంస్థలు తప్పించి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కంపెనీలేవీ ఇప్పుడు అమరావతి వైపు చూసిన దాఖలా కనిపించలేదనే చెప్పాలి. అయినా అమరావతి వైపు వారెందుకు చూడటం లేదన్న విషయాన్ని పక్కనపెడితే... ఇక్కడ ఏమున్నాయి కాబట్టి వారంతా ఇక్కడికి క్యూ కడతారు చెప్పండి. నిజమే... గడచిన నాలుగేళ్లుగా మాటల మీద మాటలు చెప్పేస్తున్న టీడీపీ సర్కారు... ఒక్కటంటే ఒక్క శాశ్వత నిర్మాణాన్ని కూడా అమరావతిలో ఏర్పాటు చేయలేదు.
రాజధాని నిర్మాణం కోసమంటూ వేలాది మంది రైతుల నుంచి 35 వేల ఎకరాల భూమిని లాగేసిన చంద్రబాబు సర్కారు.. ఆ భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకే ప్రాధాన్యం ఇస్తోందన్న ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. అయినా అమరావతిలో ప్రజలకు రక్షణ ఉందా? అంటే... ఇటీవల అక్కడ చోటుచేసుకుంటున్న పలు పరిణామాలను చూస్తుంటే... లేదనే చెప్పాల్సి వస్తోందన్న వాదన వినిపిస్తోంది. మొన్నటికి మొన్న సీఎం అధికారిక నివాసానికి కూతవేటు దూరంలో రోజుల తరబడి ఓ మావోయిస్టు మకాం వేసిన ఘటన పెను కలకలమే రేపింది. ఆ తర్వాత కూడా అమరావతి పరిధిలో చాలా ఘటనలే చోటుచేసుకున్నాయి. అయితే ఈ ఘటనలు ఎలా ఉన్నా... అమరావతిలో ప్రజలకు రక్షణ కరువైందంటే మాత్రం... చంద్రబాబుకు కాలిపోతోందనే చెప్పాలి. ఓ వైపు అమరావతిని ప్రపంచంలోనే మేటి నగరంగా తీర్చిదిద్దాలని తాను భావిస్తుంటే... అమరావతిలో ప్రజలకు రక్షణ లేదని ఆరోపణలు చేస్తే... ఆయనకు నిజంగానే కోపం రావడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే అమరావతికి తన భూమిని ఇచ్చిన ఓ రైతు నోట ఇదే మాట వినిపిస్తే... బాబు రియాక్షన్ లో ఎంతో కొంత మార్పు కనిపిస్తుందని అనుకుంటాం. కానీ... అమరావతిలో ప్రజలకు రక్షణ లేదన్న మాట వినిపించినంతనే... సదరు మాట అన్నది రైతా? ఇంకొకరా అన్న విషయంతో సంబంధం లేకుండా చంద్రబాబు ఫైర్ అయిపోతారంతే.
ఇదే ఘటన ఇప్పుడు తుళ్లూరు మండలం వెంకటపాలెంలో నిర్వహించిన సభలో జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం హోదాలో చంద్రబాబు పాల్గొనగా... అక్కడికి వచ్చిన రైతులు తమ బాధలను చంద్రబాబుతో చెప్పుకొనే ప్రయత్నం చేశారు. సభలో తనపై జరిగిన దాడిని ఓ రైతు చంద్రబాబుకు చెప్పే ప్రయత్నం చేశాడు. సుబ్బయ్య అనే రైతు తనపై దాడి చేశాడని, ఈ విషయంపై పోలీసులుకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని రామాంజనేయులు అనే రైతు చంద్రబాబుకు వివరించాడు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించారు. అయితే తనకు జరిగిన అన్యాయంపై ఆవేదనతో ఉన్న రామాంజనేయులు అమరావతిలో ప్రజలకు రక్షణ లేదు అంటూ మరో కామెంట్ చేశాడు. అంతే... అప్పటిదాకా శాంతంగానే ఉన్న చంద్రబాబు... ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చారు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడొద్దంటూ ఆయన రామాంజనేయులుకు వార్నింగ్ ఇచ్చారు. ఈ ఘటనతో రామాంజనేయులుతో పాటుగా అక్కడికి వచ్చిన రైతులంతా షాక్‌కు గురయ్యారట. మొత్తానికి అమరావతిలో ప్రజలకు రక్షణ లేకుండా పోయిందన్న మాట ఎవరి నోట వినిపించినా సహించేది లేదన్నట్లుగా చంద్రబాబు వ్యవహరించారన్న మాట.