Begin typing your search above and press return to search.

బెజవాడోళ్ల మీద బాబుకెంత కోపమో?

By:  Tupaki Desk   |   20 Feb 2016 4:31 AM GMT
బెజవాడోళ్ల మీద బాబుకెంత కోపమో?
X
బాబు నవ్వుతూ మాట్లాడటం తక్కువే. విపక్ష నేతగా పదేళ్లు అధికారానికి దూరంగా ఉన్న ఆయన.. తనకు తానుగా మార్చుకున్నకొన్ని అలవాట్లలో అప్పుడప్పుడు నవ్వటం ఒకటి. ఎప్పుడూ సీరియస్ గా వర్క్ మైండ్ తో ఉండే బాబు.. జోవియల్ గా అస్సలు కనిపించరు. కానీ.. ఇలాంటి వైఖరితో లాభం కంటే నష్టమే ఎక్కువని తెలుసుకున్న ఆయన.. ఇప్పుడు కలివిడి మాటలు మాట్లాడటంతోపాటు.. నవ్వటం.. జోకులు వేయటం.. మనసులో ఉన్న కోపాన్ని సూటిగా చెప్పే కన్నా.. నవ్వుతూ నర్మగర్భంగా మాట్లాడే ధోరణిని అలవాటు చేసుకున్నారు.

ఏపీ తాత్కాలిక రాజధాని బెజవాడ పరిస్థితి గురించి.. అక్కడి ప్రజల మైండ్ సెట్ గురించి ఆయన ఇప్పటికే పలుమార్లు మాట్లాడారు. బెజవాడోళ్లు తమ మైండ్ సెట్ మార్చుకోవాలన్న హితవు పలికారు. తాత్కాలిక రాజధాని ప్రకటన తర్వాత.. విజయవాడలో ఇళ్ల అద్దెలు భారీగా పెంచేశారని.. ఇలాంటి వైఖరి కారణంగా బెజవాడకు రావటానికి జనాలు భయపడిపోతున్నారన్నారు. ఎక్కడా లేనంత అద్దెలు బెజవాడలో ఉండటం మంచిది కాదని.. విశ్వనగరంగా మారటానికి ఇలాంటి మైండ్ సెట్ అస్సలు మంచిది కాదంటూ చెప్పారు. తాను పలుమార్లు సున్నితంగా చెప్పినా బెజవాడ ప్రజల మైండ్ సెట్ మారటంపై తాజాగా ఆయన మరోసారి సీరియస్ అయ్యారు.

అద్దెల్ని విపరీతంగా పెంచేయటంపై మండిపడుతూ.. బెజవాడకు రావాలంటేనే భయపడిపోతున్నారని చెబుతూ.. బెజవాడ కంటే సింగపూర్ లో వ్యాపారాలు చేయటం చాలా తేలికన్నారు. సింగపూర్ కన్నా విజయవాడలోనే రేట్లు ఎక్కువగా ఉన్నాయని.. భూముల విలువ పెరిగిందని.. వాటిని అమ్మటం మానేశారని.. ఇంటి అద్దెల్ని యజమాలు పెంచేశారంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.

భూమి మీద.. ఇంటి అద్దెల మీద డబ్బు సంపాదించాలని భావిస్తే చాలా సమస్య వస్తుందని.. వ్యాపారాలు చేసి డబ్బు సంపాదించాలే కానీ.. భూముల మీదా.. అద్దెలతో సంపాదన పెంచుకోవాలన్న బెజవాడోళ్ల మైండ్ సెట్ తో బయటవాళ్లు ఎవరూ రావటం లేదంటూ సీరియస్ అయ్యారు. బెజవాడోళ్ల మైండ్ సెట్ కారణంగా.. బెజవాడకు ఎవరూ రావటం లేదని.. కానీ.. బెజవాడోళ్లు మాత్రం ప్రపంచమంతా సంస్థలు పెట్టటం గమనించాలంటూ చురక అంటించారు. బెజవాడోళ్లకు ఆశ ఎక్కువంటూ ఎందుకలా మండిపడటం బాబు. ఇలాంటి మాటలు బెజవాడోళ్లను ఎంతగా బాధిస్తాయన్న విషయాన్ని మర్చిపోయారా? ఇలాంటి మాటలతో లేనిపోని భావోద్వేగాలు రెచ్చగొట్టి.. హోల్ సేల్ గా దూరంగా చేసుకునే కన్నా.. ఆచితూచి మాట్లాడటం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

నాలుగు రూపాయిలు అదనంగా వచ్చే అవకాశం ఉన్నప్పుడు తీసుకోకుండా వద్దు.. వద్దు అనటానికి ఇదేమైనా సత్య కాలమా? జనాల దాకా ఎందుకు ప్రభుత్వాల సంగతే చూద్దాం. ఏన్నో చేస్తామంటూ.. పవర్ లోకి వచ్చే వారంతా ఏదో ఒకటి చెప్పి ప్రజల నెత్తి మీద కొత్త పన్నులు వేస్తారే కానీ.. ఉన్న పన్నుల్లో 50 శాతం మేర ఎందుకు తగ్గించరు? మిగిలిన పన్నుల వరకూ ఎందుకు.. పెట్రోల్ మీద అదనంగా విధించిన పన్నును వదులుకోవటానికే బాబు ఇష్టపడరు. అలాంటిది.. వ్యక్తిగతంగా అనుకోకుండా వచ్చిన డిమాండ్ తో సొమ్ము చేసుకోకూడదని బెజవాడోళ్లకు బాబు ఎలా చెప్పగలరు? ప్రభుత్వానికి ఆదాయం పెంచాలన్న తపన ప్రభుత్వాధినేతగా బాబుకు ఉన్నట్లే.. డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రూపాయిలు వెనకేసుకోవాలని బెజవాడోళ్లకు ఉండటం తప్పు ఎలా అవుతుంది చంద్రబాబు..?