Begin typing your search above and press return to search.

ఆ ఇద్దరు మంత్రులనూ సీఎం ఎందుకు తిట్టారు?

By:  Tupaki Desk   |   16 Feb 2016 10:59 AM GMT
ఆ ఇద్దరు మంత్రులనూ సీఎం ఎందుకు తిట్టారు?
X
చంద్రబాబు మంత్రివర్గంలో కీలక మంత్రుల్లో వారిద్దరూ ఉన్నారు. ఇద్దరూ కీలక శాఖలు చూస్తున్నారు. ఇద్దరూ సీనియర్లే. ఇద్దరిపైనా చంద్రబాబుకు నమ్మకం ఎక్కువే. కానీ, ఇటీవల పరిణామాల ప్రభావమో ఏమో కానీ ఆ ఇద్దరినీ చంద్రబాబు దుమ్ము దులిపేశారు. అవును... మంత్రులు యనమల - దేవినేనిలకు చంద్రబాబు క్లాస్ పీకడం ఇప్పుడు ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.

విజయవాడలో సోమవారం ఐదు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన క్యాబినెట్‌ సమావేశంలో సిఎమ్ చంద్రబాబు పలువురు మంత్రుల తీరుపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రభుత్వంలో ఎంతో కీలకమైన ఆర్థిక, జలవననరులశాఖలకు సంబంధించిన విషయాలు బయటకు పొక్కటంపై చంద్రబాబు సీరియస్‌ అయినట్లు తెలిసింది. అందరికీ ఇసుక అందుబాటులో ఉండి, తక్కువ ధరకు లభించాలనే ఉద్దేశంతో నూతన ఇసుక విధానాన్ని తీసుకువస్తే, దానిని కూడా అభాసుపాలు చేసేలా ఎక్కువ మొత్తానికి టెండర్లు దాఖలు కావటంపై ఆగ్రహించినట్లు సమాచారం. ఇసుక విధానంపై ఏర్పాటైన క్యాబినెట్‌ సబ్‌ కమిటీ పనితీరు సరిగాలేదని ఆగ్రహించారని సమాచారం. ఆర్థికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు -జలవనరులశాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పనితీరుపైనా అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ రెండు శాఖలలోని విషయాలు లీకవటం వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని వ్యాఖ్యానించినట్లు సమాచారం. గాలేరు - నగరి, హంద్రీ - నీవా ప్రాజెక్టులలో ప్యాకేజీల పెంపు, అంచనా వ్యయాలు భారీగా పెరగటంపై మంత్రి ఉమాను ప్రశ్నించినట్లు తెలిసింది. ఆర్థిక - జలవనరులశాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్లే ప్రభుత్వం అభాసుపాలవుతుందని అన్నట్లు సమాచారం. ఇకనైనా రెండు శాఖల మంత్రులు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించినట్లు తెలిసింది.

అయితే... చంద్రబాబు ఆగ్రహానికి శాఖాపరమైన లోపాలే కారణం కాదని సమాచారం. ఇటీవల మంత్రి యనమల నియోజకవర్గంలోని నాయకుడు ముద్రగడ పద్మనాభం కాపు రిజర్వేషన్ల పేరుతో రచ్చరచ్చ చేయడం... తాజాగా విజయవాడలో గన్నవరంఎమ్మెల్యే వంశీతో దేవినేనికి ఉన్న విభేదాలు ముదరడం వంటి కారణాలతో చంద్రబాబు వారిపై ఆగ్రహంగా ఉన్నారని.... అయితే, ఆ కారణాలు చెప్పకుండా శాఖాపరమైన కారణాలతో క్లాసు పీకినట్లు తెలుస్తోంది.