Begin typing your search above and press return to search.

వైసీపీ పోరాడాలి.. మైలేజీ మాకే కావాలి!

By:  Tupaki Desk   |   7 Feb 2018 8:25 AM GMT
వైసీపీ పోరాడాలి.. మైలేజీ మాకే కావాలి!
X
వారెవ్వా... తెలుగుదేశం పార్టీ వ్యూహం. ఇలాంటి వ్యూహాలు బహుశా రాజకీయ చరిత్ర పుస్తకాల్లో అధ్యయనం చేయడానికి కూడా బహుశా ఎక్కడా దొరకవేమో.. ఎందుకంటే చరిత్రలో చంద్రబాబునాయుడు గారు లేరు కాబట్టి. ఆయనే కనుక్కొనే వ్యూహాలు ఆయన సమకాలీన ప్రపంచంలో మాత్రమే కనిసితాయి.. అని జనం నవ్వుకుంటున్నారు. రాష్ట్రానికి న్యాయం జరగాలంటూ.. ఏపీకి చెందిన ఎంపీలు అందరూ లోక్ సభలో తమ నిరసన గళాలను వినిపిస్తూ ఉన్నారు. ఏదో ఒక రకంగా మొత్తానికి కేంద్రం మీద ఒత్తిడి అయితే పెరుగుతోంది. వీరి పోరాటం మరింత ఫలిస్తే.. కేంద్రం ద్వారా ఏదో లాభం కూడా ఒనగూరవచ్చు.

అయితే అలాంటి లాభం జరగుతుందేమో అని చంద్రబాబునాయుడు భయపడిపోతున్నట్లుగా ఉంది. తమతో పాటూ అందరూ పోరాడుతోంటే.. జరగబోయే లాభాన్ని క్లెయిం చేసుకోవడం ఎలాగా? అందుకే వైసీపీ చేస్తున్న పోరాటం మీద వీలైనంత బురద చల్లాలి.. అని ఆయన తపన పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అందుకే బుధవారం ఉదయం నిర్వహించిన పార్టీ సమన్వయ కమిటీ సమావేశంలో వైసీపీ వాళ్లవి గుంటనక్క వేషాలు అంటూ చంద్రబాబునాయుడు రెచ్చిపోయారు.

పార్లమెంటులో జరుగుతున్న పోరాటానికి సంబంధించి ప్రజల దృష్టిలో కీర్తి మొత్తం తమకు మాత్రమే దక్కాలని తెదేపా అధినేత ఆరాటపడిపోతున్నట్లుందని ప్రజలు అనుకుంటున్నారు. ఇంతకూ వైసీపీ మీద తెదేపా వేస్తున్న నింద ఏంటో తెలుసా? బడ్జెట్ బాగున్నదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారట. రాష్ట్రానికి ఇంత అన్యాయం చేస్తే బడ్జెట్ బాగుందని అంటారా? అంటూ చంద్రబాబు విరుచుకుపడిపోతున్నారు.

మరిప్రజలకు కలుగుతున్న సందేహం ఏంటంటే.. చంద్రబాబుకు అంత చిత్తశుద్ధే ఉంటే గనుక.. ఈ బడ్జెట్ పరమ దరిద్రంగా ఉన్నదని.. ఇది అత్యంత నీచమైన ప్రజాకంటక బడ్జెట్ అని.. తాను ధైర్యంగా ఓ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించవచ్చు కదా.. అనేది ప్రజల మాట.

బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం జరిగిన సంగతి వరకు ఓకె. అంతమాత్రాన బడ్జెట్ లో మిగిలిన అంశాలు చెడ్డవని అనడానికి వీల్లేదు. అలా అంటే అది రాజకీయ దురుద్దేశం అవుతుంది. బాగుందన్న విజయసాయి మాటను పట్టుకుని తెలుగుదేశం పార్టీ నాటకాలు ఆడుతున్నట్లుగా కనిపిస్తోంది అని ప్రజలు అనుకుంటున్నారు. రాష్ట్రానికి న్యాయం కోసం పోరాడుతున్న వైసీపీ - కాంగ్రెస్ ల మీద పడి ఆడిపోసుకోవడం మానేసి.. చంద్రబాబు అండ్ కో.. వారి పోరాటాన్ని స్వాగతిస్తూ తమ పోరాటం సాగిస్తే మేలు జరుగుతుందని ప్రజలు అంటున్నారు.