Begin typing your search above and press return to search.

కేసీఆర్ సెంటిమెంట్ పండింది.. బాబు మాటో?

By:  Tupaki Desk   |   28 March 2019 5:56 AM GMT
కేసీఆర్ సెంటిమెంట్ పండింది.. బాబు మాటో?
X
ఎన్నిక‌ల్లో గెల‌వాలంటే మన‌సును దోచే హామీలు ఇవ్వాలి. అరే.. ఆ పార్టీ అధికారంలోకి వ‌స్తే కానీ మ‌న స‌మ‌స్య‌లు తీర‌వ‌న్న భ‌రోసా ఉండాలి. మ‌రి.. దీనికి భిన్నంగా సెంటిమెంట్ మంట‌లు మండిస్తూ.. ఓట్లు దండుకోవాల‌న్న స‌రికొత్త వ్యూహం ఎలాంటి ఫ‌లితాన్ని ఇవ్వ‌నుంది? అన్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారింది.
సుమారు మూడున్న‌ర నెల‌ల క్రితం తెలంగాణ‌లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో చంద్ర‌బాబును బూచిగా చూపిస్తూ టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ చెప్పిన మాట‌లు.. ర‌గిల్చిన సెంటిమెంట్ వ‌ర్క్ వుట్ కావ‌ట‌మే కాదు.. గులాబీ బాస్ కోరుకున్న‌ట్లుగా వంద‌కు ద‌గ్గ‌ర‌గా సీట్లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఎవ‌రి ఊహ‌ల‌కు అంద‌ని రీతిలో టీఆర్ఎస్ సాధించిన ఘ‌న విజ‌యానికి పార్టీలే కాదు ప్ర‌జ‌లు సైతం అవాక్కు అయ్యే ప‌రిస్థితి. ఎన్నిక‌ల్లో తాము బంప‌ర్ మెజార్టీతో గెలుస్తామంటూ చెప్పిన కేసీఆర్ మాట‌ల్నిచాలామంది న‌మ్మ‌లేదు. కానీ.. ఆయ‌న మాట‌లు అక్ష‌ర స‌త్య‌మ‌న్న విష‌యం ఎన్నిక‌ల ఫ‌లితాల్ని చూసినంత‌నే అంద‌రికి అర్థ‌మైంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల సంద‌ర్భంగా కేసీఆర్ ఏ విధంగా అయితే తెలంగాణ సెంటిమెంట్ అస్త్రాన్ని సంధించారో.. ఇప్పుడు అదే రీతిలో చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల మీద సెంటిమెంట్ అస్త్రాన్ని సంధిస్తున్నారు. చంద్ర‌బాబును బూచిగా చూపించిన కేసీఆర్ తీరును అనుస‌రిస్తున్న బాబు.. ఏపీ ప్ర‌జ‌ల‌కు కేసీఆర్ ను బూచిగా చూపిస్తూ ఎన్నిక‌ల్లో ల‌బ్థి పొందాల‌ని చూస్తున్నారు. ఇందుకు త‌గ్గ‌ట్లే చంద్ర‌బాబు త‌న ప్ర‌సంగాల్లో అదే ప‌నిగా కేసీఆర్ ను ఉద్దేశిస్తూ తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు.

మ‌రి.. కేసీఆర్ సెంటిమెంట్ వ్యూహాన్ని కాపీ కొట్టిన బాబు ప్లాన్ స‌క్సెస్ అవుతుందా? అంటే సందేహ‌మేన‌ని చెప్పాలి. ఎందుకంటే తెలంగాణ సెంటిమెంట్ తెలంగాణ ప్ర‌జ‌ల్లోఎక్కువ‌గా ఉంటుంది. కానీ.. ఏపీలో అందుకు భిన్న‌మైన ప‌రిస్థితి. ఏపీలో ఆంధ్రా సెంటిమెంట్ కంటే కులానికి ఎక్కువ ప్రాధాన్య‌త ఉంటుంది. కేసీఆర్ ను బూచిగా చూపించే బాబు మాట‌ల్ని పెద్ద‌గా న‌మ్మ‌ర‌న్న మాట వినిపిస్తోంది. మ‌రి.. బాబు కాపీ కొట్టిన కేసీఆర్ వ్యూహం ఏపీలో వ‌ర్క్ వుట్ అవుతుందా? లేదా అన్న విష‌యం తేలాలంటే మే నాలుగో వారం వ‌ర‌కూ వెయిట్ చేయాల్సిందే.