Begin typing your search above and press return to search.

కేసీఆర్ బాట‌లో న‌డ‌వ‌నున్న చంద్ర‌బాబు!

By:  Tupaki Desk   |   26 Dec 2018 9:59 AM GMT
కేసీఆర్ బాట‌లో న‌డ‌వ‌నున్న చంద్ర‌బాబు!
X
సినిమాల్లో ఎన్టీఆర్ స్టెప్పులు ఎన్టీఆర్ వేస్తేనే అందం చందం. ఆ మాట‌కు వ‌స్తే ఏఎన్నార్ స్టెప్పులు సూప‌ర్ స్టార్ కృష్ణ‌కు సూట్ అవుతాయా? కృష్ణ స్టెప్పులు మెగాస్టార్ చిరుకు న‌ప్పుతాయా? జ‌మానాలో ఎవ‌రి స్టెప్పులు వారివే అన్న‌ట్లు ఉండేవి. కొంద‌రు ప్ర‌ముఖ క‌థానాయ‌కులు స్టెప్పులు వేస్తుంటే న‌వ్వు వ‌చ్చినా.. ఫ్యాన్స్ మాత్రం అస్స‌లు ప‌ట్టించుకునే వారు కాదు. త‌మ అభిమాన న‌టుడు వెండితెర మీద స్టెప్పులు వేస్తుంటే ప‌ర‌వ‌శించేవారు. త‌మ‌కు త‌గిన‌ట్లుగా వాద‌న‌ను వినిపించేవారు.

సినిమాల్లో మాదిరే రాజ‌కీయాల్లోనూ ఎవ‌రి దారి వారిదే. కొంద‌రికి కొన్ని సూట్ అయిన‌ట్లుగా.. వేరే వాళ్ల‌కు అస్స‌లు ఫిట్ కావు. దేశ రాజ‌కీయాల్ని ప‌క్క‌న పెట్టి.. తెలుగు రాజ‌కీయాల్నే చూస్తే.. చంద్ర‌బాబు అభాసుపాలైన‌ట్లుగా మ‌రే నేత క‌నిపించ‌రు. చిన్న‌పోర‌గాడు బాబును తిట్టినా.. నిజ‌మే క‌దా? అనిపిస్తుంది. అదే.. కేసీఆర్‌ ను ఒక స్థాయికి మించి తిట్టినంత‌నే.. ప్ర‌జ‌ల్లో ఆగ్ర‌హం రావ‌ట‌మే కాదు.. అరే.. కేసీఆర్ ను తిట్టేస్తారా? అంటూ ప‌ర్స‌న‌ల్ గా తీసుకునే ప‌రిస్థితి. అదే తీరులో బాబు స్టైల్లో నిర్ణ‌యాలు బాబు తీసుకోవాలే కానీ.. కేసీఆర్ ను ఫాలో కావాలంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఒక‌రికి సెట్ అయిన ఫార్మూలా మ‌రొక‌రికి ఏ మాత్రం సూట్ కాదు.

ఎక్క‌డిదాకానో ఎందుకు..? మంత్రులు మొద‌లుకొని ఎమ్మెల్యేల వ‌ర‌కూ ఎవ‌రిని ఎప్పుడు క‌ల‌వాలో కేసీఆర్ డిసైడ్ చేస్తారు. ఆయ‌న్ను ఉద్దేశించి ఎంత తోపు నేత అయినా ఒక్క మాట అంటే ఒక్క మాట తేడాగా మాట్లాడే ధైర్యం చేయ‌రు. అలా అని కేసీఆర్ త‌ప్పులు చేయ‌ర‌ని కాదు. కానీ..ఆయ‌న్ను త‌ప్పుల్ని ఎత్తి చూపే ధైర్యం టీఆర్ ఎస్ నేత‌ల్లో ఎవ‌రికీ లేద‌ని చెప్ప‌ట‌మే ఇక్క‌డ ఉద్దేశం.

అదే..ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు విష‌యానికి వ‌స్తే ఇక్క‌డ వ్య‌వ‌హారం కేసీఆర్‌ కు పూర్తి భిన్నం. బాబును ఉద్దేశించి బ‌హిరంగ స‌భ‌ల్లో జేసీ దివాక‌ర్ రెడ్డి లాంటోళ్లు నోరు పారేసుకోవ‌టం చూస్తున్న‌దే. ఆ మాట‌కు వ‌స్తే.. ఒక్క జేసీ మాత్ర‌మే కాదు.. బాబును ఉద్దేశించి కాస్త తేడాగా మాట్లాడేవారు టీడీపీలో చాలామందే ఉన్నారు. బాబు అంటే భ‌క్తి ఉన్నా.. భ‌యం అంత‌గా లేద‌నే చెప్పాలి.

ఏదైనా తేడా చేసే విష‌యంలో టీఆర్ ఎస్ నేత‌లు వ‌ణికిపోయే చందంగా టీడీపీ నేత‌లు వ‌ణ‌క‌ర‌ని చెప్పక త‌ప్ప‌దు. ఎందుక‌లా అంటే.. ఇద్ద‌రి చంద్రుళ్లు త‌మ పార్టీ నేత‌ల్ని డీల్ చేసే విష‌యంలో ఉండే తేడానే ఇందుకు కార‌ణం. ఇలాంటివేళ‌.. కేసీఆర్ అనుస‌రించే విధానాల్ని బాబు ఫాలో అవుతానంటే.. అంత‌కు మించిన పిచ్చి ప‌ని మ‌రొక‌టి ఉండ‌దు. తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఊరికి ముందే త‌మ అభ్య‌ర్థుల జాబితాను ప్ర‌క‌టించిన కేసీఆర్ సంచ‌ల‌నం సృష్టించారు.

మొద‌ట్లో ఆ ప్లాన్ వ‌ర్క్ వుట్ అయిన‌ట్లు క‌నిపించినా.. త‌ర్వాతికాలంలో అది త‌ప్పుగా టీఆర్ ఎస్ నేత‌లు సైతం ఫీల‌య్యే ప‌రిస్థితి. ఆ స‌మ‌యంలోనూ కేసీఆర్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నారు. ఆయ‌న న‌మ్మ‌కం వ‌ర్క్ వుట్ కావ‌ట‌మే కాదు.. అలా చేయ‌టమే టీఆర్ ఎస్ ఘ‌న విజ‌యానికి కార‌ణంగా విశ్లేషిస్తున్న వారు లేక‌పోలేదు.

కేసీఆర్ కు ఘ‌న విజ‌యాన్ని సాధించిన పెట్టిన సిట్టింగ్ అభ్య‌ర్థుల మాదిరే బాబు సైతం త‌న సిట్టింగుల మీద న‌మ్మ‌కం పెట్టుకున్న‌ట్లుగా చెబుతున్నారు. అంతేకాదు.. కేసీఆర్ మాదిరి మెజార్టీ అభ్య‌ర్థుల‌ను ఎన్నిక‌ల‌కు మూడు నెల‌ల ముందే ప్ర‌క‌టిస్తామ‌న్న ధీమాను బాబు వ్య‌క్తం చేస్తున్నారు. అదే జ‌రిగితే.. బాబుకు భారీ షాక్ త‌ప్ప‌దంటున్నారు. కేసీఆర్‌కు పార్టీ మీద ఉన్న ప‌ట్టుతో పాటు.. ప్ర‌త్య‌ర్థుల్లో ఉన్న బ‌ల‌హీన‌త‌ల మీద కేసీఆర్‌ కు చ‌క్క‌టి అంచ‌నాలు ఉన్నాయి. దీనికి భిన్న‌మైన ప‌రిస్థితి బాబుది. ఈ నేప‌థ్యంలో కేసీఆర్ మాదిరి ఊరికి ముందే అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌టం బాబుకు బ్యాండ్ బాజాగా మారుతుంద‌న్న అభిప్రాయాలు ఉన్నాయి. అదే సమ‌యంలో ఏపీలో విప‌క్షం బ‌లంగా ఉండ‌ట‌మే కాదు.. విప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌ణాళిక బ‌ద్ధంగా అభ్య‌ర్థుల ఎంపిక చేస్తుండ‌టంతో.. కేసీఆర్ ఫార్మూలా ఏపీలో వ‌ర్క్ వుట్ కాద‌న్న మాట బ‌లంగా వినిపిస్తోంది.